బెట్టింగ్ యాప్స్ దందాలో తప్పెవరిది?

 బెట్టింగ్ యాప్స్ దందాలో తప్పెవరిది?

చరిత్రలో ఇప్పటివరకు జరిగిన ఆర్థిక మోసాలలో ప్రధాన కారణం బాధితుల అత్యాశే.  మోసగాళ్ల ప్రధాన పెట్టుబడి కూడా మనుషుల్లోని అత్యాశే.  ఈ అత్యాశ లేకుంటే మోసాలకు తావే ఉండదు. డబ్బు సంపాదించాలి, పెద్ద పెద్ద మేడల్లో ఉండాలి, ఖరీదైన కార్లలో తిరగాలనే ఆశ అందరికీ ఉంటుంది. అయితే, దానిని సాధించేందుకు ఏదారిని ఎంచుకుంటున్నామనేదే ముఖ్యం. కష్టపడి పనిచేస్తూ, తెలివితేటలతో ఆదాయ మార్గాలను పెంచుకోవడం ఓ పద్ధతి.. రాత్రికిరాత్రే  కోటీశ్వరులయ్యే మార్గం కోసం వెతకడం మరో పద్ధతి. 

ఈ రెండో పద్ధతి వల్ల కోటికొక్కరు కోటీశ్వరులు కావొచ్చేమో కానీ మిగతా తొంభైతొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది మంది నష్టపోవడం మాత్రం ఖాయం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న అంశం బెట్టింగ్ యాప్స్.  చట్ట విరుద్ధమైన ఈ యాప్స్​లో పందాలు కాసి, ఆటలాడి వందలాది మంది రోడ్డున పడ్డారు, పడుతున్నారు. 

బెట్టింగ్​ యాప్స్​లో ఉన్నదంతా పోగొట్టుకున్నవారు కొందరైతే, అప్పులు తెచ్చి మరీ పందాలు కాసి పోగొట్టుకున్నవారు మరికొందరు. లక్షల్లో, కోట్లలో అప్పులపాలై దిక్కుతోచని పరిస్థితిలో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో స్కూలు విద్యార్థుల నుంచి మొదలుకొని పదవీ విరమణ చేసిన సీనియర్  సిటిజన్ల దాకా అన్ని వయసుల వారు ఉండడం గమనార్హం.  కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడిన సంఘటనలూ చోటు చేసుకోవడంతో  తెలంగాణ పోలీసులు స్పందించారు.

 కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విషయంపై తొలుత  ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ ఒంటరి పోరాటం ప్రారంభించారు.  సీనియర్​ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా వ్యవహరిస్తున్న సజ్జనార్ కూడా ‘ఎక్స్’లో యుద్ధం చేస్తున్నారు. సజ్జనార్ ట్వీట్లతో కదిలిన పోలీసులు బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేస్తూ యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న సోషల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్లపై  చర్యలు చేపట్టారు.  వైజాగ్​కు చెందిన  లోకల్ బాయ్ నానితో  మొదలైన అరెస్టుల పర్వం టాలీవుడ్ హీరోలకు నోటీసులు పంపించేదాకా చేరుకుంది.

నిజంగా తప్పు ఇన్​ఫ్లూయెన్సర్లది మాత్రమేనా?

తాజా అరెస్టులు, నోటీసులు జారీచేసి ప్రముఖులను విచారణకు పిలవడం తదితర సంఘటనలకు తెలుగు రాష్ట్రాల ప్రజల మద్దతు విపరీతంగా ఉంది.  డబ్బు కోసం అమాయకుల జీవితాలు అంతమైపోతున్నా లెక్కచేయకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని ఫేస్ బుక్,  ఇన్ స్టా వంటి సోషల్ మీడియా వేదికలలో లక్షలాది మంది కామెంట్లు పెడుతున్నారు. 

బహుశా వారికి తగిన శాస్తి జరిగిందని సంతోషిస్తుండవచ్చు కూడా. కానీ, ఇక్కడ తప్పు  కేవలం యూట్యూబర్లు, ఇన్​ఫ్లూయెన్సర్లది మాత్రమేనా?  వారు ప్రమోట్ చేశారు కాబట్టి మేం పందాలు కాశాం,  జూదమాడి ఉన్నదంతా పోగొట్టుకున్నామని బాధితులు చెబుతున్నారు. మరి ఇదే ఇన్​ఫ్లూయెన్సర్లు ఓ సబ్బుల కంపెనీకో, వంట నూనె కంపెనీకో  ప్రచారం చేస్తే అప్పుడు కూడా జనం పొలోమని ఆయా కంపెనీల ఉత్పత్తులు ఇలాగే కొనుగోలు చేసేవారా?  లేదు కదా.  మరి ఈ బెట్టింగ్ యాప్స్​కు మాత్రమే ఎగబడడానికి కారణమేంటని ఆలోచిస్తే ‘ఈజీ మనీ కోసం’ అనేది ఎవరికైనా అర్థమవుతుంది.  కూర్చున్న చోటు నుంచే వేలు, లక్షలు సంపాదించాలనే ఆశ.. కాదు కాదు అత్యాశే  దీనికి కారణమని తెలుస్తోంది. ఒళ్లు నలగొద్దు, చెమట చిందొద్దు.. జేబులు మాత్రం కరెన్సీ కట్టలతో నిండిపోవాలనే మనస్తత్వమే ఈ అనర్థానికి కారణం.

ఈజీ మనీ

ఇటీవలి కాలంలో సమాజంలో ఓ ప్రమాదకరమైన ధోరణి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. అదే ఈజీ మనీ.  డబ్బు సక్రమంగా సంపాదించాలంటే కష్టపడడం ఒక్కటే మార్గం. కానీ, ఇప్పుడు అలా కష్టపడి సంపాదించుకోవడం తెలివితక్కువతనంగా చూసే పరిస్థితి నెలకొంది.  కొడితే  ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని చాలామంది భావిస్తున్నారు. ఆ కోరికలో తప్పులేదు.  కానీ, దానికి అడ్డదారి తొక్కడమే అనర్థాలకు దారితీస్తోంది. 

ఆరుగాలం శ్రమించిన రైతు ప్రకృతి సహకరించకపోవడం వల్లో,  నకిలీ విత్తనాల వల్లో,  నకిలీ పురుగు మందుల వల్లో నష్టపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడంటే అయ్యో పాపం అనిపిస్తుంది.  కానీ, జూదమాడి, అప్పులపాలై  ఆత్మహత్య చేసుకున్నవారిపైన జాలిపడడం అరుదు.  ఇక్కడ ఇంకో విషయం మరుగునపడిపోతోంది.  అప్పుచేసి జూదమాడిన వ్యక్తి  ఆత్మహత్య  చేసుకున్నాడంటే చేసిన తప్పుకు శిక్ష అనుభవించాడని అనుకునేవారూ ఉన్నారు. 

మరి అతడికి అప్పు ఇచ్చిన వ్యక్తి  పరిస్థితి ఏంటి? కష్టపడి  పైసా పైసా కూడ బెట్టుకున్న సొమ్ము అప్పుగా ఇస్తే.. వడ్డీ సంగతి దేవుడెరుగు అసలు కూడా వచ్చే మార్గంలేక లోలోపల కుమిలిపోతున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి సదరు జూదగాడిపైనే జనం సానుభూతి చూపిస్తారు. ఇక్కడ తప్పెవరిది?  మంది  సొమ్ముతో  జూదమాడి పోగొట్టిన వ్యక్తి బాధితుడెలా అయ్యాడు?  న్యాయంగా  నాలుగు  రూపాయల కోసం ఆశపడ్డ వ్యక్తి  మానవత్వంలేని వాడెలా అయ్యాడు?

ఇన్​ఫ్లూయెన్సర్లు ప్రమోట్ చేయకుంటే...

బెట్టింగ్ యాప్స్​కు  ప్రమోషన్ చేయడం  అంతపెద్ద  నేరమా?  ఇన్​ఫ్లూయెన్సర్లు  ప్రమోట్ చేయకుంటే  జనం  బెట్టింగ్ కాసేవారు కాదా..? కాదనుకోవడం అమాయకత్వమే.  బాధితులు కడుపు మంటతో చెప్పే మాటలు పక్కన పెడితే బెట్టింగ్ యాప్​ల  నిర్వాహకులు  రకరకాలుగా  ప్రమోషన్  చేసుకుంటున్నారు. 

 సోషల్ మీడియాలో యాడ్స్ నుంచి మొదలుకొని ఫోన్లకు మెసేజ్ పంపడం దాకా ఎన్నో మార్గాలు. వాటిని కట్టడి చేయడానికి ఏ టెలికాం సంస్థా ఎందుకు చర్యలు చేపట్టట్లేదు?   వాటిపై  కేసులూ  నమోదు కాలేదే?  ఇదే బెట్టింగ్ యాప్ లకు  సంబంధించిన యాడ్స్ ఏకంగా హైదరాబాద్ మెట్రోరైలుపై కనిపించడం దేనికి సంకేతం?  నెటిజన్ల ఫిర్యాదుతో మెట్రో నిర్వాహకులు స్పందించి  రాత్రికిరాత్రే వాటిని తొలగిస్తామని చెప్పడం హాస్యాస్పదం.  

యాడ్​కు  ఒప్పుకున్నపుడో,  లేక బోగీపై  రంగులేస్తున్నపుడో తెలియదా?  ప్రయాణికులకు కనిపించిన ఆ యాడ్స్ నెటిజన్లు ఫిర్యాదు చేసేవరకూ మెట్రో అధికారులకు కనిపించకపోవడం దురదృష్టకరం.  పోలీసుల కేసులు, నోటీసులు, అరెస్టులతో బెట్టింగ్ యాప్స్ మోసాలకు తెరపడుతుందని నమ్మడం అత్యాశే.  పోలీసులైనా ఎన్నింటిని అరికట్టగలరు.. ఎంతమందిని అరెస్టు చేయగలరు?  ఈ విషయంలో ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలి. తప్పు చేశాక నెపం వేరేవారిపై తోసే మనస్తత్వం మానుకుని మన తప్పులకు మనమే బాధ్యత వహించాలి.

అత్యాశ జోలికి పోవద్దు

రూ.5 వేలో,  రూ.10 వేలో  పోగొట్టుకున్నాక వీరు ఆ ఆటను ఎందుకు ఆపలేదనే సందేహం రావడం సహజం. అయితే, జూదానికి ఉన్న ప్రత్యేకత అదే.. ఏ రకమైన జూదమైనా సరే, మొదట్లో లాభాలు వస్తాయి.  పది రూపాయలు పెడితే వెయ్యి,  వెయ్యి పెడితే పదివేలు వస్తాయి. నిమిషాల్లో డబ్బు రెట్టింపు అవుతుందనే అత్యాశను పుట్టించడం జూదంలో మొదటి స్టెప్. ఆ తర్వాత మెల్లమెల్లగా డబ్బులు పోతుంటాయి. పోయిన డబ్బులు తిరిగి రాబట్టుకోవాలనే కోరికతో మళ్లీ మళ్లీ ఆడుతుంటారు. 

అందినకాడల్లా అప్పు చేసి, ఇక అప్పు దొరకదనే స్థితికి చేరేదాకా ఈ జూదం కొనసాగుతుంది. దీంతో అప్పటివరకూ భ్రమల్లో ఉన్న బాధితుడు వాస్తవంలోకి వచ్చిపడతాడు.  ఇంట్లో వాళ్లకు, అప్పులవాళ్లకు ముఖం చూపలేక బలవన్మరణానికి పాల్పడతాడు. ఈ పరిస్థితికి వాళ్లనో,  వీళ్లనో  తప్పుపట్టి ప్రయోజనం లేదు.  మన పరిస్థితికి మనమే బాధ్యులం. అత్యాశ జోలికి పోకుండా, సులభంగా డబ్బు వచ్చిపడాలనే ఆలోచన దరిచేరకుండా జాగ్రత్తపడడమే ఇప్పుడు మనం చేయాల్సిన పని.  అదేసమయంలో ఎవరేమైపోతే నాకేంటి.. నాకు డబ్బు వస్తే చాలనే ఆలోచన కూడా ప్రమాదకరమే!

ఆశ- అత్యాశ

ఆశ పడడం తప్పుకాదు, నిజానికి ఆశే మనిషిని బతికిస్తుంది. ఇవాల్టికన్నా రేపటి రోజు బాగుంటుంది, ఇప్పుడున్న కష్టాలు, సమస్యలు రేపు ఉండవనే ఆశ లేకుంటే ఎవరికైనా బతుకు భారమవుతుంది. అదేసమయంలో అత్యాశ అంధకారానికి, అర్ధాంతరంగా తనువు చాలించడానికి కారణమవుతుంది. ఇన్​ఫ్లూయెన్సర్ల  అరెస్టు వార్తలకు సంబంధించిన పోస్టులకు పలువురు పెట్టిన కామెంట్లు చూస్తే బాధితులు లక్షలు, కోట్లల్లో పోగొట్టుకున్నవారు చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది. 

-కటకం శ్రీధర్, సీనియర్ జర్నలిస్ట్-