
శివయ్యకు ఎప్పుడు పూజలు మొదలు పెట్టారు.. ఆయనను మొదట ఎవరు పూజించారు. ఆయనను ఎలా పూజించారు.. మంచి.. చెడు గురించి ఆయన ఎలా చెప్పాడో తెలుసుకుందాం..
అందరూ సమానమే!
శివుడికి రాజు, పేద, కులము, మతముతో సంబంధం లేదు. ఆయనకు అందరూ సమానమే. ప్రస్తుతం ఉన్న కొన్ని ఆలయాలు దాదాపు వెయ్యేళ్ల క్రితం కాలంలో కట్టినవే. కానీ అంతకుపూర్వం శివుడికి మాత్రమే గుడి కట్టి పూజించేవారట. శివుడిని అడవి బిడ్డలే ముందు పూజించారు. ప్రకృతి చేసే వినాశనాన్ని ఆపి, అడవినే నమ్ముకున్న వాళ్లను కాపాడిన దేవుడు .. శివుడని భావించి కొలిచారు వాళ్లంతా.
వేద పురాణాలకు ముందే శివుడిని దేవుడిగా ఆరాధించారు. వేద పురాణాల్లో శివుడి ప్రస్తావన చాలాకాలం పాటు లేదు. దానికి ఎన్నో సాంఘిక కారణాలు ఉన్నాయి. వేద పురాణాలకు వచ్చాక, అందరిచేతా పూజలు అందుకుంటూ శక్తిమంతమైన దేవుడిగా అవతరించాడు శివుడు.
శివుడ్ని పూజించడమనే ఆలోచనలోనే గొప్ప సాంఘీక సంస్కరణ ఉంది. అదెలాగంటే, శివుడికి ఏ ఒక్క మతమో, కులమో ఎక్కువ కాదు. ఎవరు... ఎలా కొలిచినా కాదనడు. ఇదే శివుడ్ని అందరికీ దగ్గర చేసింది. పేదలకు, అడవిని నమ్ముకున్న బిడ్డలకు శివుడ్ని దగ్గర చేసిన కారణం కూడా ఈ ఆలోచనే!
అంతా శివమయమే
మనకుండే లెక్కలేనన్ని ఆలోచనల్లో ఎప్పుడూ వెంటాడే ఒక ఆలోచన...ఏది మంచి... ఏది చెడు.. . ఇది మనకు ఎవరు చెప్పాలంటే, తిరిగి శివుడే చెప్పాలి. శివుడి ఆలోచనలోనైనా, రూపులోనైనా మనకు కనిపించేది ఇదే. ఆయన అందంగా లేడనుకుంటాం... ఆయననుచూసి భయపడేలా ఉన్నాడనుకుంటాం. ఆయన మద్యం సేవిస్తాడని, శ్మశానంలో గడుపుతాడని అంటాం.
ALSO READ | అన్ని పండగలకు బంగారం కొంటారు.. ఒక్క శివరాత్రికి బంగారం ఎందుకు కొనరు..?
ఇవన్నీ మనిషి జీవితంలో భాగమైన చెడు అయితే... అదే శివుడు వినాశనం నుంచి మనల్ని కాపాడటం, అందరినీ సమానంగా చూడటం లాంటివి చేస్తూ కనబడతాడు. ఇది మన జీవితాల్లోని మంచిగా ఉంది. మంచి, చెడు ఎలా ఉంటుందో పరిచయం చేసేది జీవితమైతే, ఆ జీవితమంతా ఒక శక్తి రూపంలో కనిపిస్తే ఎలా ఉంటుందో ఆ శక్తి పేరే శివుడు. ఆ శక్తి మనకు నేర్పేదే శివతత్త్వం.
భోళా శంకర.. ఆదియోగి.. అన్నీ శివుడే!
భోళా శంకరుడు, ఆదియోగి, నటరాజు, త్రయంబకుడు.. ఎలా పిలిచినా ఆయన శివుడే. శివ పురాణం ప్రకారం చూస్తే శివుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. ఆ రూపాలన్నీ శివ తత్త్వంలోని గొప్పదనాన్ని ఒక్కోరకంగా పరిచయం చేసేవే. అందులో కొన్ని రూపాల గురించి వివరంగా తెలుసుకుందాం..
భోళా శంకరుడు : శివుడి రూపాల్లో దీన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భోళా మనిషి అని మనం కొందరి గురించి చెప్పుకుంటాం. అంటే లౌక్యం తెలియని మనిషి అని. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు వీళ్లు. భోళా శంకరుడు కూడా ఇలాగే. ఆయనకు ఎవ్వరినీ తక్కువ చేయడం ఇష్టం ఉండదు. ఆయన తెలివి తక్కువవాడనీ కాదు, తన తెలివిని అనవసరమైన విషయాల్లో చూపి తాను గొప్పవాడినని చెప్పుకోడు.
త్రయంబకుడు : శివుడి మూడో కన్ను ఉంటుంది .. అందుకే ఆయనను త్రయంబకుడు అని కూడా అంటారు. కేవలం ఒక కన్ను ఎక్కువ ఉండటం కాదు దీనర్థం. ఆయన కంటికి కనిపించనిది కూడా గ్రహిస్తున్నాడని పురాణాల్లో వివరించారు
కాలభైరవుడు : కాలభైరవుడంటే శివుడి రౌద్ర రూపం. భరించలేని బాధను అంతం చేయడానికి పుట్టినదే ఈ రూపం
–వెలుగు, లైఫ్–