ఏడుపాయల చైర్మన్ గిరి ఎవరికో?

ఏడుపాయల చైర్మన్ గిరి ఎవరికో?
  • దేవాలయాల పాలకవర్గాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ
  •  వనదుర్గామాత ఆలయ చైర్మన్ పదవికి తీవ్రమైన పోటీ
  • ఎమ్మెల్యే మైనంపల్లి ఆశీస్సుల కోసం ప్రయత్నాలు 

మెదక్, పాపన్నపేట, వెలుగు: రాష్ట్రంలో వివిధ జిల్లాలోని దేవాలయాల పాలక వర్గాల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయ చైర్మన్, డైరెక్టర్ పదవులు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది.  తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక బీఆర్ఎస్​ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి చెందిన వారికే ఏడుపాయల చైర్మన్​, డైరెక్టర్​ పదవులు దక్కాయి. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రావడం, స్థానికంగా కాంగ్రెస్​ ఎమ్మెల్యే గెలవడంతో ఆ పార్టీ నాయకుల్లో ఆశలు చిగురించాయి. 

12 డైరెక్టర్​ పోస్టులు

ఎండోమెంట్​పరిధిలో ఉన్న ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయ పాలకవర్గంలో మొత్తం 14  డైరెక్టర్​ పోస్టులు ఉంటాయి. ఇందులో ఆలయ పూజారి ఒకరు ఎక్స్​ అఫిషియో మెంబర్​గా, మరొక దాతకు అవకాశం ఉంటుంది. మిగిలిన 12  పోస్టుల్లో 10 డైరెక్టర్​ పోస్టులు పాపన్నపేట మండలం, రెండు డైరెక్టర్​ పోస్టులు కొల్చారం మండలానికి చెందిన వారికి కేటాయిస్తారు. డైరెక్టర్ల ఎన్నిక పూర్తయ్యాక వారిలో నుంచే ఒకరిని చైర్మన్​గా ఎన్నుకుంటారు.

చైర్మన్​ పదవికి తీవ్రమైన పోటీ

గతంలో నియామకమైన ఏడుపాయల దేవాలయ పాలక మండలి పదవీ కాలం గత ఆగస్టు 6వ తేదీతో ముగిసింది. దీంతో కొత్త పాలక మండలి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. తాజాగా ప్రభుత్వం కొత్త పాలక మండలి ఏర్పాటుకు నోటిఫికేషన్​ జారీ చేయడంతో కసరత్తు మొదలైంది. దేవాలయ పాలక మండలి డైరెక్టర్​ పదవులకు పెద్దగా పోటీ లేకున్నా చైర్మన్​ పదవికి పోటీ ఎక్కువగా ఉంది. మొదటి నుంచి ఏడుపాయల చైర్మన్​ పదవి పాపన్నపేట మండలానికి చెందిన వారికే కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. 

ఈ సారి పాపన్నపేటకు చెందిన కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి శెట్టి శ్రీకాంతప్ప, పోడిచన్​పల్లి తండాకు చెందిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోవింద్​ నాయక్, కొత్తపల్లికి చెందిన కాంగ్రెస్​సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ మల్లప్ప, నాగ్సాన్ పల్లికి చెందిన ఏడుపాయల మాజీ చైర్మన్ పార్షి నర్సింలు, యూసుఫ్​పేటకు చెందిన శ్రీకాంత్​ రెడ్డి, కొడపాకకు చెందిన జంగం సతీశ్, పంతులు భూమన్న, కుర్తివాడకు చెందిన  శ్రీధర్, చిత్రియాలకు చెందిర రఘు చైర్మన్ పదవి రేసులో ఉన్నారు.

 కాగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆశీస్సులు ఉన్న వారికే పదవులు దక్కే అవకాశం ఉంది. ఈ మేరకు ఆశావహులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఆశీస్సులతో ఏడుపాయల చైర్మన్​ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.