Justice BR Gavai: 52వ సీజేఐగా జస్టిస్ బి.ఆర్.గవాయ్.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే..

Justice BR Gavai: 52వ సీజేఐగా జస్టిస్ బి.ఆర్.గవాయ్.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే..

భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్​ రామకృష్ణ గవాయ్(బి.ఆర్.గవాయ్) మే 14న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్​ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో సీనియారిటీ పరంగా తన తర్వాత స్థానంలో ఉన్న బి.ఆర్.గవాయ్ పేరును సంప్రదాయానికి అనుగుణంగా కేంద్ర న్యాయశాఖకు సిఫారసు చేశారు. జస్టిస్ బి.ఆర్.గవాయ్ నవంబర్ 23 వరకు ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగనున్నారు.

జస్టిస్ గవాయ్ 2019, మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.జస్టిస్ బి.ఆర్.గవాయ్ సీజేఐగా బాధ్యతలను చేపట్టనున్న రెండో దళిత వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ మహారాష్ట్రలోని అమరావతిలో 1960, నవంబర్ 24న జన్మించారు. నాగ్ పూర్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్లు, అమరావతి విశ్వవిద్యాలయానికి స్టాండింగ్ కౌన్సెల్గా పనిచేశారు. 

జస్టిస్ బిఆర్ గవాయ్ 1992, ఆగస్టు నుంచి 1993, జులై వరకూ బాంబే హైకోర్టు నాగుర్ ధర్మాసనంలో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్​గా సేవలందించారు. జస్టిస్ బిఆర్ గవాయ్ 2000, జనవరి 7న హైకోర్టు నాగ్​పూర్ ధర్మాసనంలో ప్రభుత్వ న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్​గా నియమితులయ్యారు. 2005, నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.

Also Read : ఇంటర్ అర్హతతో CSIR -NAL లో ఉద్యోగాలు

కీలక తీర్పులు 
* 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4–1తో ఇచ్చిన తీర్పులో జస్టిస్ గవాయ్ ఉన్నారు.

* 2023, డిసెంబర్లో జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పులో ఉన్నారు.

* రాజకీయ పార్టీలకు సంబంధించి ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలోనూ జస్టిస్ గవాయ్ సభ్యులు.

* ఎస్సీ వర్గీకరణలో రాష్ట్రాలకు రాజ్యాంగపరమైన అధికారం కల్పిస్తూ ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6–1తో ఇచ్చిన తీర్పులోనూ జస్టిస్ గవాయ్ సభ్యులుగా ఉన్నారు.