Khaleda Zia: ఆ రోజు షేక్ హసీనా జస్ట్ మిస్.. వామ్మో.. ఖలీదా జియా బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే..

Khaleda Zia: ఆ రోజు షేక్ హసీనా జస్ట్ మిస్.. వామ్మో.. ఖలీదా జియా బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే..

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం నాడు (ఆగస్ట్ 5, 2024) రాజీనామా చేయడంతో ఆ దేశంలో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. బంగ్లాదేశ్ మొదటి ప్రధానిగా పనిచేసిన ఖలీదా జియాకు మంగళవారం నాడు హౌస్ అరెస్ట్ నుంచి విముక్తి లభించింది. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన నిరసనలు బంగ్లాదేశ్లో ప్రభుత్వ అస్థిరతకు కారణమైన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఖలీదా జియా విడుదల కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. 

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చీఫ్ జియా విడుదలకు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దిన్ ఆదేశాలిచ్చిన గంటల వ్యవధిలోనే ఆమె విడుదల కావడం గమనార్హం. కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ప్రధాని ఖలీదా జియా లివర్ వ్యాధితో, డయాబెటిస్, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఖలీదా జియా విడుదల కావడంతో ఆమె ఎవరనే చర్చ నెట్టింట మొదలైంది. ఈ తరుణంలో ఆమె గురించి బ్రీఫ్గా కొన్ని విషయాలు తెలుసుకుందాం..

ఎవరీ ఖలీదా జియా..?

* ఖలీదా జియా ఆగస్ట్ 15, 1945న జన్మించారు. బంగ్లాదేశ్ మొదటి మహిళా ప్రధానిగా ఖలీదా జియా పనిచేశారు. ఆమె భర్త జియావుర్ రెహ్మాన్ ఒక ఆర్మీ అధికారి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని ఆయనే స్థాపించారు. బంగ్లాదేశ్ 6వ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. 1981లో సైనిక తిరుగుబాటు కారణంగా హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఖలీదా జియా నాయకత్వం వహిస్తున్నారు.

* హసీనాతో చేతులు కలిపిన ఖలీదా జియా 1990లో మిలటరీ రూలర్ హుస్సేన్ మహ్మద్ ఇర్షద్ పాలనను కూలదోశారు. ఈ పరిణామం అనంతరం.. ఇస్లామిక్ పొలిటికల్ గ్రూప్స్ మద్దతుతో జియా బంగ్లాదేశ్ తొలి ప్రధానిగా ఎన్నికయ్యారు.

* ఖలీదా జియా ప్రభుత్వ హయాంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బంగ్లాదేశ్లో అధ్యక్ష విధానం స్థానంలో పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని తీసుకొచ్చారు. విదేశీ పెట్టుబడుదలపై ఆంక్షలను ఎత్తివేశారు. ఉచిత నిర్భంద విద్యను అమలు చేశారు.

* 1996లో జరిగిన ఎన్నికల్లో హసీనా చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఐదేళ్లకు తిరిగి అధికారాన్ని దక్కించుకున్నారు.

* ఖలీదాకు, హసీనాకు అస్సలు పడేది కాదు. ఖలీదా ప్రభుత్వం, ఆమెకు అనుకూలంగా ఉండే కొన్ని ఇస్లామిక్ గ్రూప్లు 2004లో హసీనా ర్యాలీ చేస్తుండగా గ్రనేడ్స్ విసిరేశారు. ఈ ఘటనలో హసీనా త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. హసీనా మద్దతుదారుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు.

* 2006లో ఆర్మీ నేతృత్వంలో బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడటంతో ఖలీదా, హసీనా ఇద్దరినీ జైలుకు పంపారు. 2008లో జనరల్ ఎలక్షన్స్ జరగడంతో ఈ ఇద్దరికీ జైలు నుంచి విముక్తి లభించింది. 2008లో జరిగిన ఎన్నికలను ఖలీదా నేతృత్వంలోని బీఎన్పీ బాయ్కాట్ చేసింది. 2018 నుంచి ఖలీదా అవినీతి కేసులో హౌస్ అరెస్ట్ కావడం గమనార్హం. హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో ఖలీదాకు హౌస్ అరెస్ట్ నుంచి విముక్తి లభించింది.