Kota Rukmini: ఏపీ సచివాలయానికి కోట రుక్మిణి.. ఇంతకీ ఎవరీ మహిళ?

తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే.. పొరుగు రాష్ట్రం ఏపీవే ఆసక్తికరం. సినిమాల్లో సన్నివేశాల్లా ఏపీలో నిరంతరం ఎదో ఒకటి తెరమీదకు వస్తూనే ఉంటుంది. రెండ్రోజుల క్రితం వరకూ ఏపీ దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఎపిసోడ్ అందరికీ మంచి వినోదాన్ని పంచింది. ఇప్పుడు ఈ కథ చల్లబడేసరికి మరొకరు తెరమీదకు వచ్చారు. ఆమె పేరు.. కోట రుక్మిణి. జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం సీఎం పవన్‌ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితురాలిగా చెప్తున్న ఈమె గురించే ఇప్పుడు ఏపీ అంతటా చర్చ. అందుకు కారణాలూ లేకపోలేదు. 

ఏపీ కేబినెట్‌ మీటింగ్‌ జరుగుతున్న సమయంలో కోట రుక్మిణి సచివాలయంలో కనిపించడంతో ఈ చర్చ మొదలైంది. ఎమ్మెల్యేనా..! కాదు, మరి ఎమ్మెల్సీనా..!  కాదు. పోనీ, సచివాలయ సిబ్బందా..! అంటే అదీ కాదు. మరి ఓ అజ్ఞాత మహిళకు ఏపీ సచివాలయంలో పనేంటి..? అన్నది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్.    

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం(జులై 16) మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుతో పాటు కొత్త ఇసుక పాలసీ వంటి పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఈ మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలోనే జనసేన నేత కోట రుక్మిణి సచివాలయానికి వచ్చారు. కేబినెట్ సమావేశం జరిగే మొదటి బ్లాక్ వైపు అడుగులు వేశారు. అయితే, ఆమెవరో తెలియని పోలీస్ సిబ్బంది అడ్డగించారు.. లోపలకి అనుమతించలేదు. వెంటనే ఆమె ఎవరికో ఫోన్‌ చేయగా.. క్షణాల్లోనే పోలీసులు ఆమెను లోపలికి అనుమతించారు. ఈ దృశ్యాలు మీడియా కంటపడటంతో కోట రుక్మిణి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు.

ఎవరీ కోట రుక్మిణి..?

కోట రుక్మిణి స్వస్థలం.. కృష్ణా జిల్లా. ఆమె 2022 వరకూ లండన్‌లో ప్రముఖ బ్రాండెడ్‌ షాప్‌ నిర్వహించేవారు. ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయనకు కావాల్సినవన్నీ రుక్మిణినే కల్పించేదని టాక్. 2020లో రుక్మిణిని జనసేన సెంట్రల్‌ అఫైర్స్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక.. తన నివాసాన్ని లండన్‌ నుంచి హైదరాబాద్‌కు మార్చారు. అప్పటినుంచి ఆమె జనసేన పార్టీలో కీలకంగా మారారని వినికిడి. వాస్తవానికి నాదెండ్ల మనోహర్‌ చెప్పిన మాటను జనసేన అధినేత కాదనరాని జనసేన నాయకుల్లో టాక్. అలాంటిది ఆయనకంటే కంటే కోట రుక్మిణి చాలా పవర్‌ఫుల్‌ అన్న ప్రచారం ఏపీలో జరుగుతోంది. మొత్తానికి ఈమె ఎపిసోడ్‌ను వైసీపీ శ్రేణులు వినోదాత్మకంగా మార్చేశారు. నెట్టింట వారి వారి ఖాతాల్లో ఆమె ఫొటోలే దర్శనమిస్తున్నాయి.