ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మార్మోగుతోంది. ఈ గ్యాంగ్‌స్టర్ ఎప్పుడు, ఎవరిని చంపేస్తారో అన్న భయం అటు రాజకీయ నేతల్లోనూ, ఇటు స్టార్ సెలెబ్రెటీల్లోనూ కనిపిస్తోందనే చర్చ మొదలైంది. ముంబైలో ఒకప్పటి మాఫియాను మళ్లీ తీసుకొచ్చాడని చెబుతన్న బిష్ణోయ్ ఎవరు..? అతని నేపథ్యం ఏమిటి..? 30 ఏళ్లకే ఇంత నేర సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించగలిగాడు..? వంటి అనేక ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఎవరీ లారెన్స్ బిష్ణోయ్..?
బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన లారెన్స్ బిష్ణోయ్ 1993 ఫిబ్రవరి 12న జన్మించాడు. అతని స్వస్థలం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ధత్తరన్‌వాలి గ్రామం. తండ్రి హర్యానా పోలీసు శాఖలో కానిస్టేబుల్. లారెన్స్ పుట్టిన నాలుగేళ్లకు(1997లో) తండ్రి పోలీసు శాఖను వదిలి వ్యవసాయం బాట పట్టారు. బిష్ణోయ్ 12వ తరగతి వరకు పంజాబ్- హర్యానా- రాజస్థాన్ సరిహద్దులోని అబోహర్ అనే చిన్న పట్టణంలోని పాఠశాలలో చదువుకున్నాడు. అనంతరం పైచదవుల కోసం 2010లో చండీగఢ్‌కు వెళ్లి డీఏవీ కాలేజీలో చేరాడు. అక్కడే అతని నేర సామ్రాజ్యానికి తొలి అడుగు పడింది.
డీఏవీ కళాశాలలో చేరిన తరువాత బిష్ణోయ్ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2011-12 మధ్య పంజాబ్ విశ్వవిద్యాలయం (SOPU) విద్యార్థి సంస్థ అధ్యక్షుడయ్యాడు. అక్కడే అతనికి గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌తో పరిచయం ఏర్పడింది. అతని అండదండలతో అనతికాలంలోనే యూనివర్శిటీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆ సమయంలోనే అనేక నేర కార్యకలాపాలకు పాల్పడ్డాడు.
నేర జీవితం
ప్రస్తుతం బిష్ణోయ్‌పై హత్య, దోపిడీతో సహా రెండు డజన్లకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతనిపై నమోదైన మొదటి ఎఫ్‌ఐఆర్ హత్యాయత్నానికి సంబంధించింది. చండీగఢ్‌లో అతనిపై నమోదైన ఏడు ఎఫ్‌ఐఆర్‌లలో నాలుగు కేసుల్లో నిర్దోషిగా విడుదలయ్యాడు. మూడు కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి. 2012 నుండి, బిష్ణోయ్ ఎక్కువ సమయం కటకటాల వెనుక గడిపాడు. ఆ సమయంలో అతను ఇతర నేరస్థులతో పొత్తులు పెట్టుకున్నాడు.
అతను జైలు నుండి బయటికి వచ్చినప్పుడు ఆయుధాల వ్యాపారులను, స్థానిక నేరస్థులను కలుసుకునేవాడు. అలా అనుచరుల సంఖ్యను పెంచుకున్నాడు. ప్రస్తుతం బిష్ణోయ్ గ్యాంగ్ లో 700 మందికి పైగా సభ్యులు ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఒకప్పుడు పంజాబ్ కు మాత్రమే పరిమితమైన ఈ గ్యాంగ్.. ఇప్పుడు మహారాష్ట్రలో ఉనికి కోసం ప్రయత్నిస్తోందని అంటున్నారు.
సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు
కృష్ణ జింకల వేట కేసులో నటుడు సల్మాన్ ఖాన్ ప్రమేయం ఉన్నందున బిష్ణోయ్ చాలా కాలంగా అతడిని హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కృష్ణ జింకలు బిష్ణోయ్ తెగకు సెంటిమెంట్. అందువల్లే సల్మాన్ ఖాన్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడని టాక్. మోకా చట్టంలో అరెస్టైన బిష్ణోయ్ ప్రస్తుతం తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అక్కడినుంచే తన నేర సామ్రాజ్యన్ని నడిపిస్తున్నాడు.