Jagan Warns Police: కోపంతో ఊగిపోతూ జగన్ వార్నింగ్ ఇచ్చిన ఆ మధుసూదన్ రావు ఎవరు..? ఆయన బ్యాక్గ్రౌండ్ ఇది..

అమరావతి: ఏపీ అసెంబ్లీ సాక్షిగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. పొలిటికల్ సర్కిల్స్లో, వైసీపీ, టీడీపీ సోషల్ మీడియా పేజ్ల్లో జగన్ తాజా వీడియో ట్రెండ్ అవుతోంది. జగన్ మాస్ చూపించారని, ‘వింటేజ్ జగన్ ఈజ్ బ్యాక్’ అని ఈ వీడియోను ట్రెండ్ చేస్తుంటే, జగన్ వార్నింగ్ ఇచ్చిన పోలీసు అధికారి మధుసూదన్ రావును హీరోగా టీడీపీ సోషల్ మీడియా హైలైట్ చేస్తోంది. మొత్తంగా చెప్పాలంటే ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జరిగిన ఈ పరిణామం ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో హీట్ పెంచింది.

జగన్ వార్నింగ్ అనంతరం ఆ మధుసూదన్ రావు ఎవరనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో, నెటిజన్లలో జోరుగా నడుస్తోంది. జగన్ పేరు గుర్తుంచుకుని మరీ, కోపంతో ఊగిపోతూ ‘‘మధుసూదనరావు.. గుర్తు పెట్టుకో.. ఎల్లకాలం ఇలాగే ఉండదు’’ అని హెచ్చరించారు. ‘‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. నీ టోపీపై ఉన్న సింహాలకు అర్థమేంటో తెలుసా? అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మీరున్నారు’’ అని జగన్ ఆ పోలీసు అధికారికి హిత బోధ చేయడం గమనార్హం. ఇంతలా ఆ పోలీసు అధికారికి జగన్ వార్నింగ్ ఇవ్వడంతో ‘‘Who is Madhusudan Rao ?’’ అనే చర్చ జోరుగా జరుగుతోంది.

 

ఆ పోలీసు అధికారి మధుసూదన్ రావు మరెవరో కాదు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం సీఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయనకు అసెంబ్లీ డ్యూటీ వేశారు. అసెంబ్లీలోకి ఎలాంటి ప్లకార్డులు, బ్యానర్లు, పేపర్లు తీసుకురావొద్దని అసెంబ్లీ అధికారుల నుంచి అసెంబ్లీ డ్యూటీలో ఉన్న పోలీసులకు స్పష్టమైన ఆదేశాలున్నాయి. అయితే.. వైసీపీ అధినేత జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు, బ్యానర్లు తీసుకువెళ్లారు. అసెంబ్లీలోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో.. అసెంబ్లీ అధికారుల ఆదేశాలకు అనుగుణంగా.. వైసీపీ నేతల చేతుత్లోని పేపర్లను పోలీసులు లాక్కున్నారు. ప్లకార్డులు, పేపర్లు ఉంటే అనుమతి ఇవ్వమని సీఐ మధుసూదనరావు వైసీపీ అధినేత జగన్కు, వైసీపీ ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్పారు. మధుసూదన్ రావు ఇలా చెప్పడంతో వైసీపీ అధినేత జగన్కు చిర్రెత్తుకొచ్చింది. ప్లకార్డులు తీసుకెళ్లనివ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ అధికార టీడీపీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.

Also Read:-ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

వైఎస్ జగన్కు సీఐ మధుసూదన్ రావు ముందే తెలుసో లేక ఖాకీ డ్రస్ మీద పేరు చూసి పిలిచారో తెలియదు గానీ ‘‘మధుసూదనరావు.. గుర్తు పెట్టుకో’’ అని వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో ఏపీ పాలిటిక్స్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. మధుసూదన్ రావు గతంలో గుంటూరు, కొత్తపేట, పిడుగురాళ్ల, మంగళగిరి, తాడేపల్లి పోలీస్ స్టేషన్లలో సీఐగా పని చేశారు. సిన్సియర్ ఆఫీసర్గా గుర్తింపు ఉంది. సౌమ్యుడు, వివాద రహితుడు. రూల్స్ ఫాలో అవుతారనే పేరుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కారణంగా ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో సీఐ మధుసూదన రావు పేరు మోత మోగుతోంది.