Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం.. ఎవరీ మను భాకర్..?

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం.. ఎవరీ మను భాకర్..?

పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళా షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించింది. మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించి దేశానికి తొలి పథకాన్ని అందించింది. ఫైనల్లో మను 221.7 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచింది. తద్వారా ఒలింపిక్స్‌లో షూటింగ్‌ కేటగిరిలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. దాంతో, ఆమెపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేశమంతటా ఆమె గురించి చర్చిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.. 

హర్యానా వనిత

మను భాకర్ స్వస్థలం.. హర్యానా. ఫిబ్రవరి 18, 2002న ఓ గజ్జర్ కుటుంబంలో మను జన్మించింది. బాక్సర్లు, రెజ్లర్లకు పేరుగాంచిన ఝజ్జర్‌ కుటుంబంలో జన్మించిన మను పాఠశాల రోజుల్లో టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ వంటి పలు క్రీడల్లో ఆసక్తి కనపరిచేది. చివరకు షూటింగ్‌లో తన అభిరుచిని కనుగొని అటు వైపు ద్రుష్టి మరల్చింది. తనకు 14 ఏళ్ల వయస్సున్నప్పుడు ఒక స్పోర్ట్స్ షూటింగ్ పిస్టల్‌ కొనివ్వాల్సిందిగా ఆమె తండ్రిని కోరింది. ఆమె కోరికను ఎప్పుడూ కాదనని తండ్రి రామ్ కిషన్ భాకర్ ఆమెకు స్పోర్ట్స్ షూటింగ్ పిస్టల్‌ని కొనిచ్చారు. అక్కడినుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ ఆమె విశ్వక్రీడల వరకూ వెళ్ళింది. 

మను భాకర్ అంతర్జాతీయ అరంగేట్రం 2017లో జరిగింది. 2017 జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపియన్, మాజీ ప్రపంచ నంబర్ 1 హీనా సిద్ధూను ఓడించి మను భాకర్ అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం 2018లో బ్యూనస్ ఎయిర్స్‌ వేదికగా జరిగిన యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో మను 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలిచి యూత్ ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ షూటర్‌గా ఆమె నిలిచింది. అప్పుడు ఆమె వయసు.. 16 ఏళ్లు. 

తరువాత ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగిన 2018 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ మను మెప్పించింది. అక్కడ బంగారు పతకాన్ని సాధించి ప్రపంచ వేదికపై అగ్ర షూటర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. అనంతరం జకార్తా వేదికగా  జరిగిన 2018 ఆసియా క్రీడల్లో తోటి భారత షూటర్ అభిషేక్ వర్మతో కలిసి మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని సాధించింది. 

గన్‌లో సాంకేతిక లోపం 

ఎన్నో కలలతో షూటింగ్ కెరీర్‌ను ఎంచుకున్న మనుకు టోక్యో ఒలింపిక్స్ తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ఎన్నోఅంచనాలతో టోక్యోకు వెళ్లిన ఆమె, కీలక సమయంలో గన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో తీవ్ర నిరాశతో పతకం లేకుండా తిరిగొచ్చారు. మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో ఆమె గన్‌లో సాంకేతికత లోపం తలెత్తింది. దీంతో ఆమెపై ఒత్తిడి పెరిగి విలువైన సమయాన్ని కోల్పోయింది. ఫలితంగా ఫైనల్‌కు దూరమయ్యింది. కానీ, ఇప్పుడు మను పారిస్ ఒలింపిక్స్‌లో గురి తప్పకుండా తూటా పేల్చి.. పతకాన్ని సాధించింది.

పారిస్ ఒలింపిక్స్‌లో ఆమె విజయం భారతదేశంలోని ఔత్సాహిక షూటర్‌లకు రోల్ మోడల్‌గా నిలిపింది. ఆమెను ప్రశంసించని వారంటూ ఎవరూ లేరు. ఆమె స్వస్థలంలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అందరూ ఆమెను దీవిస్తున్నారు.