Champions Trophy: భారత్‌తో మ్యాచ్.. ‘స్పెషల్ కోచ్‌’ను దింపిన పాకిస్తాన్

Champions Trophy: భారత్‌తో మ్యాచ్.. ‘స్పెషల్ కోచ్‌’ను దింపిన పాకిస్తాన్

భారత్‌తో మ్యాచ్ అంటే, దాయాది జట్టు భయపడుతోంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. దాయాదుల పోరులో పైచేయి సాధించేందుకు పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కొత్త వ్యూహాలు అనుసరిస్తోంది. ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ‘స్పెషల్ కోచ్‌’ను బరిలోకి దింపింది. ఎవరా స్పెషల్ కోచ్‌..? ఏంటి అతని ప్రత్యేకత..? అనేది చూద్దాం..

Also Read :- బెన్ డకెట్ 165.. ఆస్ట్రేలియా ఎదుట భారీ టార్గెట్

ఇప్పటికే న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోవడంతో దాయాది జట్టుకు భారత్‌తో మ్యాచ్ చావోరేవో లాంటిది. ఆదివారం టీమిండియాతో జరిగే మ్యాచ్‌లో ఓడితే.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాదాపు నిష్క్రమించినట్టే. అందుకే ఈ మ్యాచ్‌ను పీసీబీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆటగాళ్ల శిక్షణ ఇచ్చేందుకు ముదస్సర్ నాజర్‌(Mudassar Nazar)ను బరిలోకి దింపింది.

ఎవరీ నాజర్..?

బ్యాటింగ్ ఆల్ రౌండరైన ముదస్సర్ నాజర్‌ ఒకప్పటి పాక్ ఆటగాడు. 1970లలో దాయాది జట్టులో మంచి ప్లేయర్. ముఖ్యంగా స్లో పిచ్‌లపై అద్భుతమైన నాక్ లు ఆడేవారు. పాక్ తరుపున 76 టెస్టులు, 122 వన్డేలు ఆడిన నాజర్.. రిటైర్మెంట్ ప్రకటించాక కోచ్‌గా అవతారమెత్తారు. 1993- 2001 మధ్య పలుమార్లు పాక్‌ జట్టుకు కోచ్‌గా పనిచేశారు. ఆ తరువాత కెన్యా, యూఏఈ టీమ్‌లకు కోచ్‌గా వ్యవహరించారు.  ప్రస్తుతం ఈయన దుబాయ్‌ ఉంటూ ఐసీసీ గ్లోబల్ అకాడమీలో పనిచేస్తున్నారు.

ఏంటి నాజర్ ప్రత్యేకత..?

ముదస్సర్‌కు యూఏఈ పరిస్థితులపై అపారమైన అనుభవం ఉంది. దీన్ని పాకిస్తాన్ సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. ముందుగా యూఏఈ పరిస్థితులపై ఆటగాళ్లకు అవగాహన కల్పిస్తే మ్యాచ్‌లో పైచేయి సాధించవచ్చనేది పాకిస్తాన్ వ్యూహం. శుక్రవారం పాకిస్తాన్ జట్టుతో కలిసిన ముదస్సర్.. తాత్కాలిక్ హెడ్ కోచ్‌ అకిబ్ జావేద్ తో కలిసి ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చారు. గంటల తరబడి ఎన్నో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. బౌలర్లు షాహీన్ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్ రౌఫ్ అతని కనుసన్నల్లోనే బంతులేశారు. అయితే బ్యాటర్లు మాత్రం ఎటువంటి ప్రభావం చూపలేదు. బాబర్ అజామ్, రిజ్వాన్ వంటి స్టార్లు బంతిని స్టాండ్స్‌లోకి లాంచ్ చేయడంలో తెగ ఇబ్బంది పడ్డారు.