బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దిన్ పార్లమెంట్ను రద్దు చేశారు. బంగ్లాదేశ్ పూర్తిగా సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే.. సైనిక పాలనను కూడా విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ ఉండాలని బంగ్లాదేశ్ విద్యార్థులకు నాయకత్వం వహిస్తున్న నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థుల అభ్యర్థనకు మహ్మద్ యూనస్ కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఈయన ఆధ్వర్యంలో ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో.. అసలు ఎవరీ మహ్మద్ యూనస్ అనే ప్రశ్న నెట్టింట ట్రెండ్ అయింది.
84 సంవత్సరాల మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్లో గ్రామీణ్ బ్యాంక్ను నెలకొల్పి బంగ్లాదేశ్ ప్రజల్లో ఎంతోమందిని పేదరికం నుంచి బయటపడేశారు. ఆయన చేసిన సేవలకు గానూ 2006లో నోబెల్ బహుమతి ఆయనను వరించింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఒకప్పుడు మహ్మద్ యూనస్ను రాజకీయ ప్రత్యర్థిగా చూశారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. షేక్ హసీనా ఈయనపై ఫోకస్ పెట్టడంతో బంగ్లాదేశ్ ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు యూనస్కు లభించింది. ఎన్నో కోర్టు కేసులను మహ్మద్ యూనస్ ఎదుర్కొన్నారు.
Also Read :- 76 ఏళ్ల చరిత్రను.. ఆ 45 నిమిషాల క్లయిమాక్స్ ముగించేసింది
హసీనా ప్రభుత్వం ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసింది. అయితే ఇవన్నీ రాజకీయ ప్రోద్భలంతో బనాయించిన కేసులుగా బంగ్లాదేశ్ ప్రజలు భావించారు. అందుకే.. బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మహ్మద్ యూనస్ నేతృత్వంలో కొనసాగించాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి అక్కడి ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతోంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అస్థిరత తొలగిపోయి సుస్థిర ప్రభుత్వం ఏర్పడేంత వరకూ బంగ్లాదేశ్లో పరిస్థితులు అదుపులోకి రాకపోవచ్చు.
-