
- రేసులో ధర్మేంద్ర ప్రధాన్, వైద్యనాథ్ పాండా, జువెల్ ఓరమ్, అపరాజిత సారంగి
- మరో రెండు రోజుల్లో కొత్త సీఎం పేరు ఖరారయ్యే చాన్స్
- లోక్ సభలో మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో ఎంపీలకంటే..ఎమ్మెల్యేలకే ఎక్కువ చాన్స్
భువనేశ్వర్: ఒడిశా కొత్త ముఖ్యమంత్రి కోసం బీజేపీ హైకమాండ్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ప్రధానంగా ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎంపీల పేర్లను పరిశీలిస్తున్నది. వారిలో సీనియర్ లీడర్లు ధర్మేంద్ర ప్రధాన్, వైద్యనాథ్ జే పాండా, జువల్ ఓరమ్, అపరాజిత సారంగి, సంబిత్ పాత్రా సహా ఇతర లీడర్లు ఉన్నారు. పదేండ్ల పాటు కేంద్ర మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్.. కర్నాటక, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఒడిశాలో పార్టీ ఎన్నికల ఇన్ చార్జిగా పనిచేశారు. సంభాల్ పూర్ సీటులో ఎంపీగా ఎన్నికైన ప్రధాన్ కు బ్యాక్ గ్రౌండ్, అడ్మినిస్ట్రేటివ్ అనుభవం నేపథ్యంలో ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
అలాగే కేంద్రపడా నుంచి ఎంపీగా ఎన్నికైన వైద్యనాథ్ జే పాండా పేరు కూడా లిస్టులో ఉంది. తాజా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కు ఒకప్పుడు నమ్మకస్తుడైన పాండా.. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా, ఒకసారి లోక్ సభ సభ్యుడిగా పనిచేశారు.అమెరికాలో మేనేజ్ మెంట్, ఇంజినీరింగ్ చేసిన ఆయన.. కొన్ని సంవత్సరాలు కార్పొరేట్ రంగంలో పనిచేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఇక సీఎం పదవికి పరిశీలనకు వస్తున్న మరో పేరు, కేంద్ర మాజీ మంత్రి, గిరిజన నేత జువల్ ఓరమ్. సుందర్ గఢ్ లోక్ సభ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. కాగా.. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో సీఎం కోసం ఒక ఎంపీని బీజేపీ వదులుకునే పరిస్థితి లేదు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల పేర్లను హైకమాండ్ పరిశీలిస్తున్నది. ఈ రేసులో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ మాంఝీ, టాప్ ఎస్సీ లీడర్లు ముఖేశ్ మహాలింగ్, సూర్యవంశీ సూరజ్, మాజీ బ్యూరోక్రాట్ అపరాజిత సారంగి ఉన్నారు. అలాగే పూరి ఎంపీ సంబిత్ పాత్రా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గిరీశ్ చంద్ర ముర్ము కూడా సీఎం రేసులో ఉన్నారు. మయూర్ భంజ్ జిల్లాకు చెందిన గిరిజనుడైన గిరీశ్ కు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మంచి సంబంధాలు ఉన్నాయి. సీఎం ఎంపిక కోసం ఢిల్లీలో సెంట్రల్ లీడర్ షిప్ తో రాష్ట్ర బీజేపీ నాయకత్వం భేటీ అయింది. రెండు రోజుల్లో కొత్త సీఎంను ప్రకటించే అవకాశం ఉంది. సీఎం ఎంపిక జరిగితే ఈ నెల 10న ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటయ్యే చాన్స్ ఉంది.
గవర్నర్ కు గెజిట్ నోటిఫికేషన్..
ఒడిశాలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నికుంజ బిహారి ధల్.. గవర్నర్ రఘువర్ దాస్ కు గురువారం రాజ్ భవన్ లో గెజిట్ నోటిఫికేషన్ సమర్పించారు. అసెంబ్లీకి ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేల పేర్లు ఆ గెజిట్ లో ఉన్నాయని అధికారులు తెలిపారు. కాగా.. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించినందుకు ఎన్నికల అధికారులకు గవర్నర్ రఘువర్ దాస్ అభినందనలు తెలిపారు. ఒడిశా అసెంబ్లీలో 147 సీట్లు ఉండగా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 78, బీజేడీ 51, కాంగ్రెస్ 14 సీట్లలో, సీపీఎం ఒక సీటులో విజయం సాధించాయి. ఈ ఎన్నికల్లో నలుగురు ఇండిపెండెంట్లు కూడా విజేతలుగా నిలిచారు.