న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. ఇప్పుడా రాష్ట్రాలకు సీఎంలు ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. మరో నాలుగైదు నెలల్లోనే లోక్ సభ ఎన్నికలు ఉండడంతో సీఎంల ఎంపికపై బీజేపీ హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మధ్యప్రదేశ్ లో ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా పేర్లు వినిపిస్తున్నాయి.
తోమర్ ఈసారి అసెంబ్లీకి పోటీ చేసి గెలవగా, సింధియా మాత్రం పోటీ చేయలేదు. ఇక రాజస్థాన్ లో మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సీపీ జోషి, దియా కుమారి, మహంత్ బాలక్ నాథ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా పేరును కూడా హైకమాండ్ పరిశీలించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చత్తీస్ గఢ్ లో మాజీ సీఎం రమణ్ సింగ్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ సావో, ధరమ్ లాల్ కౌశిక్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఓపీ చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి.