IPL 2025: ఆర్‌సీబీ బౌలింగ్ కోచ్‌గా సాల్వి.. ఎవరితను..?

IPL 2025: ఆర్‌సీబీ బౌలింగ్ కోచ్‌గా సాల్వి.. ఎవరితను..?

ఐపీఎల్ తదుపరి ఎడిషన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కీలక వ్యూహాలు అనుసరిస్తోంది. వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకున్న ఆర్‌సీబీ యాజమాన్యం.. తాజాగా, దేశ‌వాళీ క్రికెట్‌లో సుధీర్గ అనుభవమున్న ఓంకార్ సాల్వి తమ బౌలింగ్ కోచ్‌గా నియమించుకుంది. 

'గత 8 నెలల వ్యవధిలో రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ నెగ్గిన ఓంకార్ సాల్వి ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో మాతో కలిసి నడవనున్నారు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో బిజీగా ఉన్న సాల్వి, ఆ విధులు పూర్తయ్యాక ఆర్‌సీబీతో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు..' అని ఆర్‌సీబీ ట్వీట్ చేసింది. ముంబై కోచ్‌గా సాల్వీ పదవీకాలం 2025 మార్చితో ముగియనుంది. ఆ గడువు ముగిసిన వెంటనే ఆయన ఆర్‌సీబీతో కలవనున్నారు. 

 ఎవరీ ఓంకార్ సాల్వి..? 

భారత మాజీ పేసర్ ఆవిష్కర్ సాల్వి సోదరుడే.. ఓంకార్ సాల్వి. 46 ఏళ్ల సాల్వికి దేశ‌వాళీ క్రికెట్‌లో కోచ్‌గా సుదీర్ఘ అనుభం ఉంది. ఇతను శిక్షణలో ముంబై జ‌ట్టు.. రంజీ ట్రోఫీని, ఇరానీ క‌ప్‌నూ చేజిక్కించుకుంది. అంతేకాదు, గడిచిన ఐపీఎల్ సీజ‌న్‌లో సాల్వి కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌(KKR)కు అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా సేవ‌లందించాడు. అప్పుడు కేకేఆర్ విశ్వవిజేతగా నిలిచింది. దాంతో, ఆర్‌సీబీ తదుపరి సీజ‌న్ కోసం కోచ్‌గా సాల్వికి బాధ్యత‌లు క‌ట్టబెట్టింది.

సాల్వి తన క్రికెట్ కెరీర్‌లో ఒకే ఒక లిస్ట్-ఏ మ్యాచ్ ఆడారు. రైల్వేస్ తరఫున ఆడిన అదే మొదటి, చివరి మ్యాచ్.

ఆర్‌సీబీ కోచింగ్ స్టాఫ్: 

  • ఆండీ ఫ్ల‌వ‌ర్ (ప్ర‌ధాన కోచ్)
  • దినేశ్ కార్తిక్ (బ్యాటింగ్ కోచ్, మెంట‌ర్)
  • ఆడ‌మ్ గ్రిఫిత్ (అసిస్టెంట్ కోచ్)
  • నీల్ మెకంజీ (అసిస్టెంట్ కోచ్)
  • శిఖా ధ‌నుండియాల్ (టీమ్ డైరెక్ట‌ర్)
  • మ‌లొలాన్ రంగ‌రాజన్ (హెడ్ ఆఫ్ స్కౌంటింగ్, అసిస్టెంట్ కోచ్)