ఐరాసలో భారత రాయబారిగా తెలుగు వ్యక్తి .. ఎవరీ పర్వతనేని హరీశ్‌..?

తెలుగు వ్యక్తి, ఐఎఫ్‌ఎస్‌ అధికారి పర్వతనేని హరీష్ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో భారత తదుపరి రాయబారి/శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం (ఆగస్టు 14) ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈయన జర్మనీలో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 1న పదవీ విరమణ చేసిన రుచిరా కాంబోజ్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

కాగా, అంతకుముందు ఐరాసలో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంబోజ్ చరిత్ర సృష్టించారు. ఈమె 1987 సివిల్ సర్వీసెస్ బ్యాచ్‌ టాపర్. కాంబోజ్ యునైటెడ్ నేషన్స్‌లో భారతదేశ విజయాలను ప్రపంచ దేశాలకు తెలియజేయడమే కాదు.. చైనా, పాకిస్థాన్ వంటి దేశాల కుటిల రాజకీయాలను ధైర్యంగా తిప్పికొట్టారు.

ఎవరీ పర్వతనేని హరీశ్‌..?  

పర్వతనేని హరీశ్‌ హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. గోల్డ్‌మెడల్‌ కూడా సాధించారు. అనంతరం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్( ఐఐఎం) కలకత్తాలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆయన సతీమణి పేరు.. పర్వతనేని నందిత. వీరికి ఇద్దరు కుమార్తెలు ఆయూషీ, అమానీ. వీరిలో అమానీ కూచిపూడి కళాకారిణి. 

ఈయన నవంబర్ 6, 2021న జర్మనీలో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి అదే పదవిలో కొనసాగుతున్నారు. గతంలో ఈయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి(ఆర్థిక సంబంధాలు)గా పనిచేశారు. ఆర్థిక దౌత్య విభాగానికి నాయకత్వం వహించారు. G20, G7, BRICS, IBSAలకు భారతీయ సౌస్ షెర్పాగా ఉన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MEA)లో ఈస్ట్ ఆసియా విభాగంలోనూ పనిచేశారు. భారత ఉపరాష్ట్రపతికి జాయింట్ సెక్రటరీ, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ కూడానూ. ఇలా ఈయన ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు.