Chess World Cup: నాన్నకు పోలియో.. అమ్మ గృహిణి: చెస్ దిగ్గజాలనే గడగడలాడిస్తున్న ప్రజ్ఞానంద

Chess World Cup: నాన్నకు పోలియో.. అమ్మ గృహిణి: చెస్ దిగ్గజాలనే గడగడలాడిస్తున్న ప్రజ్ఞానంద

గత 24 గంటలుగా దేశమంతటా వినిపిస్తోన్న ఏకైన పేరు.. ప్రజ్ఞానంద. నిజానికి ఇతనెవరో చాలా మందికి తెలియదు. ఎందుకో తెలుసా? అతనొక చెస్ ప్లేయర్. క్రికెట్ ఒకటే క్రీడ అనుకునే మనకు అతని పేరు తెలియకపోవడంతో ఆశ్చర్యం లేదు. 

ఇంతకీ ఇప్పుడు అతని పేరు ఎందుకు మార్మోగుతుందంటే.. 18 ఏళ్ల వయసున్న ఈ భారత యువ సంచలనం ఫిడే చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌‌లో అడుగు పెట్టాడు. ప్రపంచ నెం.1 చెస్ ప్లేయరైన మాగ్నస్‌ కార్ల్‌సన్‌‌కు చెమటలు పట్టించాడు. కాకపోతే ఫైనల్ మ్యాచ్ ఇంకా ముగియలేదు. తొలి గేమ్ డ్రా కావడంతో.. బుధవారం(ఆగష్టు 23) రెండో గేమ్‌లో మరోసారి తలపడనున్నారు. ఇందులో కూడా డ్రా అయితే టై బ్రేకర్‌లో ఫలితం తేలుతుంది.

రెండో భారతీయుడు

 చెస్ వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్న రెండో భారతీయ ఆటగాడు ప్రజ్ఞానంద. ఇంతకుముందు విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే భారత్ నుంచి ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆడారు. అంతేకాదు చెస్ ప్రపంచ కప్ ఫైనల్ ఆడినవారిలో అత్యంత పిన్న వయస్కుడు ప్రజ్ఞానందే. ఆగష్టు 10నే ఈ యువకుడికి 18 ఏళ్లు నిండాయి.  

ఎవరీ ప్రజ్ఞానంద

అతని స్వస్థలం తమిళనాడులోని చెన్నై. 2005, ఆగస్టు 10న జన్మించారు. తండ్రి రమేష్‌బాబు. ఆయన తమిళనాడు ప్రభుత్వ సహకార బ్యాంకులో (టీఎన్‌ఎస్‌సీ) బ్రాంచ్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. తల్లి నాగలక్ష్మి.. గృహిణి.  ఈ దంపతులకు కూతురు కూడా ఉంది.. పేరు అక్క వైశాలి. ప్రజ్ఞానంద కన్నా నాలుగేళ్లు పెద్దది. 

తరచూ జాతీయ మరియు అంతర్జాతీయ పోటీలలో అతనితో వెంట ఉండేది తల్లి, అక్క మాత్రమే. ఎందుకో తెలుసా..? తండ్రికి పోలియో. ఆ వైకల్యం కారణంగా దూర ప్రయాణాలు చేయటం ఇష్టం లేక కొడుకు విజయాలను దూరం నుంచి చూస్తేనే తండ్రి ఆనంద పడుతుంటారు. ఒకానొక సమయంలో ఆర్థిక పరిస్థితి అనుకూలించక ప్రజ్ఞానందను చెస్‌లోకి పంపించకూడదని అనుకున్నారట తండ్రి. కానీ, అతని ఆసక్తి, ప్రతిభను గమనించాక మనసు మార్చుకున్నారట.

అక్క నుంచే చదరంగ పాఠాలు 

ప్రజ్ఞానంద నాలుగేళ్ల వయసు నుంచే చెస్ బోర్డు ముందు కూర్చొని తన అక్కతో పోటీపడేవాడట. అందులో ఓడిపోతే.. ఎందుకు ఓడిపోయానా అని ఎత్తుల గురుంచి ఆలోచిస్తూ చెస్ బోర్డు ముందే గడిపేవాడట. తన వయసు పిల్లలు ఇతరులతో ఆటలు ఆడుతుంటే.. తాను మాత్రం చెస్‌ బోర్డుతోనే పోటీపడేవాడట. అక్క నుంచే చదరంగ పాఠాలు నేర్చుకున్న అతను.. ఆమెను ఓడించాడాటానికే చెస్ నేర్చుకున్నాడట. అలా మొదలైన అతని చెస్ ప్రస్థానం.. నేడు చదరంగ మార్తాండగా మారే స్థాయికి తీసుకొచ్చింది.

10 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్ అయిన ప్రజ్ఞానంద.. 12 ఏళ్ల 10 నెలలకే గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. ఈ ప్రయాణంలో అతను సాధించిన విజయాలు మరెన్నో ఉన్నాయి.