అనుకోని ప్రమాదమైతే బాధ్యులెవరు.?

అనుకోని ప్రమాదమైతే బాధ్యులెవరు.?
  •     ఓ వైపు స్కూల్..మరో వైపు గ్యాస్ గోడౌన్
  •     ప్రమాదపు అంచున విద్యార్థులు చదువులు 
  •     కొందుర్గ్ లోని గురుకుల పాఠశాల తీరు ఇది

షాద్ నగర్,వెలుగు :  రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ లో ప్రభుత్వ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇది అద్దె భవనంలో కొనసాగుతుంది. 5 వ తరగతి నుంచి ఇంటర్ వరకు సుమారు 640 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. దీనికి సమీపంలో భవాని గ్యాస్ ఏజెన్సీ పేరుతో ఇండియన్ గ్యాస్ సిలిండర్ల గోడౌన్ ఉంది. ఒక పక్క విద్యార్థుల చదువు.. మరో పక్క గురుకుల పాఠశాల భవనంలో  ఏ క్షణంలో  ఏం జరుగుతుందో చెప్పేలేని ప్రమాదకర పరిస్థితి పొంచి ఉంది. గ్యాస్ గోడౌన్ లో ఏదైనా ప్రమాదవశాత్తూ ఘటన జరిగితే బాధ్యులు ఎవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 

ప్రభుత్వ అధికారులు స్పందించి గ్యాస్ గోడౌన్ ను తరలించి విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.  గురుకులానికి ఆటస్థలం లేకపోవడంతో రోడ్డు దాటి ఓ ప్రైవేటు స్థలంలో క్రీడలు నిర్వహిస్తున్నారు.  పరిగి, షాద్ నగర్  హైవే నిత్యం రద్దీగా ఉంటూ భారీ వాహనాలు వెళ్తుంటాయి. గ్యాస్ గోడౌన్ కు  సంబంధించిన సమస్యపై లేవనెత్తగా నిర్వాహకులు  వేరేచోటుకు మారుస్తామని చెప్పి నిర్లక్ష్యం చేస్తున్నారని, వెంటనే దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.