Ryan Routh: ట్రంప్ను చంపాలని చూసింది వీడే.. వయస్సు 58 ఏళ్లు కానీ.. పెద్ద క్రిమినల్ మైండ్

Ryan Routh: ట్రంప్ను చంపాలని చూసింది వీడే.. వయస్సు 58 ఏళ్లు కానీ.. పెద్ద క్రిమినల్ మైండ్

ఫ్లోరిడా: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను టార్గెట్ చేసి కాల్పులు జరిపిన వ్యక్తిని అమెరికా నిఘా సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెష్టిగేషన్ (FBI) గుర్తించింది. ట్రంప్పై కాల్పులకు యత్నించిన వ్యక్తిని 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్ అని ఎఫ్బీఐ తెలిపింది. నార్త్ కరోలినాలోని గ్రీన్స్బోరోకు చెందిన ర్యాన్ గతంలో కన్స్ట్రక్షన్ వర్కర్గా పనిచేశాడు. డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారుడు. అతనికి ఎలాంటి మిలటరీ బ్యాగ్రౌండ్ లేదు. కాకపోతే.. యుద్ధంలో తానూ పాలు పంచుకోవాలని, పోరాడుతూ ప్రాణం పోయినా పర్లేదనే మనస్తత్వం ర్యాన్కు ఉన్నట్లు అతని సోషల్ మీడియా అకౌంట్స్ పరిశీలించగా తెలిసింది. యుద్ధంలో భాగం కావాలని ర్యాన్ ఉవ్విళ్లూరుతుండేవాడని, యుద్ధంలో పోరాడుతూ చనిపోవాలనే కోరిక బలంగా ఉందని తేలింది.

మరీ ముఖ్యంగా ఉక్రెయిన్, రష్యా యుద్ధం పట్ల ర్యాన్ అమితాసక్తితో ఉండేవాడు. ఉక్రెయిన్లో పోరాడి యుద్ధంలో ప్రాణాలు వదిలేయాలని ఉందని తన ‘ఎక్స్’ ఖాతాలో ర్యాన్ వెస్లీ రౌత్ బహిరంగంగా తన బలమైన ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ర్యాన్ రౌత్ ఉక్రెయిన్ మద్దతుదారుడు. అంతేకాదు..  ర్యాన్ వెస్లీ రౌత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నాడు. భవిష్యత్ యుద్ధాలు ఆగాలంటే పౌరులు యుద్ధ శైలిని మార్చుకోవాలని సిగ్నల్ మెసేజింగ్ యాప్ ప్రొఫైల్లో ర్యాన్ రాసుకొచ్చాడు. అంతేకాదు.. మానవ హక్కులు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విధానాలకు మద్దతు తెలపాలనేది ర్యాన్ అభిప్రాయం. మరీ ముఖ్యంగా చైనా దేశంలోని విధివిధానాలకు ట్రంప్పై కాల్పులు జరిపిన ఈ ర్యాన్ చాలా పెద్ద ఫ్యాన్. ఇదిలా ఉండగా.. ర్యాన్ వెస్లీ రౌత్ నేరపురిత చర్యలకు పాల్పడం ఇదేం మొదటిసారి కాదు. 2002లో కూడా ర్యాన్ ఒక కేసులో అరెస్ట్ కావడం గమనార్హం.

ALSO READ : Donald Trump: ట్రంప్పై మరోసారి కాల్పులు.. ఏకే-47 రైఫిల్ నుంచి దూసుకెళ్లిన బులెట్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్పై రెండోసారి కాల్పుల కలకలం రేగింది. ఏకే-47తో ట్రంప్ పై ర్యాన్ వెస్లీ  రౌత్ కాల్పులు జరిపేందుకు యత్నించాడు. ట్రంప్ తన గోల్ఫ్ కోర్ట్లో గోల్ఫ్ ఆడుతుండగా ర్యాన్ వెస్లీ ఏకే-47తో కాల్పులు జరిపాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తక్షణమే అలర్ట్ కావడంతో ట్రంప్ తృటిలో తప్పించుకున్నారు. ట్రంప్పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయేందుకు ర్యాన్ ప్రయత్నించాడు. పోలీసులు అతనిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ట్రంప్ను ఎందుకు లేకుండా చేయాలనుకున్నాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికైతే కారణం ఏంటనే విషయంలో స్పష్టత లేదు.