
షూటింగ్ అంటేనే ఖరీదైన క్రీడ.. కానీ తనది
వ్యవసాయ ఆధారిత కుటుంబం.. ప్రతి రోజు 35 కిలో మీటర్లు ప్రయాణించి షూటింగ్ రేంజ్‌కు వెళ్లాలి. బస్సులో వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు.. ఏదైనా సొంత వాహనంపై వెళ్లాలంటే అనుకూలించని ఆర్థిక పరిస్థితులు.. అయినా ఇవేమి ఆ యువ షూటర్ కలకు అడ్డుగా నిలవలేదు. ఇలాంటి కష్టాలను చూసి అతనేమి షూటింగ్ నుంచి పారిపోలేదు. ఎక్కడైతే నిరాశపడ్డాడో అక్కడే తనకంటూ ఓ గమ్యాన్ని సృష్టించుకున్నాడు.. ఎక్కడైతే పతకం కోల్పోయాడో.. అక్కడే తొలి ఒలింపిక్ మెడల్ గెలిచాడు. అతనే హర్యానాకు చెందిన 22 ఏండ్ల యంగ్ షూటర్ సరబ్‌జోత్ సింగ్.
తండ్రి త్యాగం.. తాత
అండపారిస్‌లో మూడు రోజుల కిందట మెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్ చేరడంలో సరబ్‌జోత్ విఫలమయ్యాడు. మను భాకర్ పతకం నెగ్గడంతో ఆమెతో కలిసి బరిలోకి దిగాలంటే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. సరిగ్గా అదే దిశగా ఆలోచన చేసిన సరబ్ ఉన్న ఫలంగా ప్రాక్టీస్ పెంచాడు. మనుతో సమంగా గురి తప్పకుండా బుల్లెట్లు దింపాడు. దాని ఫలితమే ఒలింపిక్స్‌లో తొలి పతకాన్ని అందుకోవడంతో పాటు ఇండియాకు రెండో మెడల్ రావడంలో భాగమయ్యాడు. సరబ్‌ది అంబాలాలోని ధీన్ అనే చిన్న గ్రామం. వసతి, సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే. అలాంటి గ్రామం నుంచి ఒలింపిక్ షూటర్ వస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. 2016లో షూటింగ్ మొదలుపెట్టిన సరబ్‌కు ఆరంభంలో అన్నీ కష్టాలే.
ప్రతి రోజు 35 కిలో మీటర్లు ప్రయాణించి అంబాలాలోని అభిషేక్ రాణా రేంజ్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఎక్విప్‌మెంట్‌తో బస్సు ప్రయాణం తలకు మించిన భారంగా ఉండేది. దీనికి తోడు తండ్రి ఆదాయంతో కుటుంబ పోషణ మాత్రమే గడిచేది. కానీ ఖరీదైన షూటింగ్ పరికరాలు సమకూర్చుకోవడం కష్టమయ్యేది. కానీ అదే సమయంలో యూఎస్‌కు చెందిన తన తాత అండగా నిలిచాడు. రాజీ పడకుండా ఎప్పటికప్పుడు ఖరీదైన పరికరాలు అందించాడు. మూడేండ్ల తర్వాత చేతన్ అనే స్నేహితుడు తోడుగా నిలవడంతో సరబ్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2019 నుంచి ఖేలో ఇండియాలో భాగం కావడం కూడా సరబ్‌కు కలిసొచ్చింది. ప్రఖ్యాత కోచ్‌లతో కలిసి పని చేసే అవకాశం రావడంతో తన తప్పులను తెలుసుకుంటూ గురిపై పట్టు పెంచుకుని వరల్డ్ టోర్నీల్లో పతకాలు గెలిచాడు. అయితే మెగా గేమ్స్‌లో మెన్స్ కేటగిరీలో విఫలమైనప్పుడు మాత్రం తన పాత రోజులు గుర్తుకు వచ్చాయని సరబ్ చెప్పాడు. మొత్తానికి ఎనిమిదేండ్ల తర్వాత తన కల ఫలించినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు.
ఫైనల్ తర్వాత.. మా నాన్న నా కోసం ఏం చేశాడు, మా తాత మద్దతు, నా కెరీర్‌లో మొదటి రెండేండ్లు బస్సులో ఒంటరి ప్రయాణం, స్నేహితుల అండ.. ఇప్పుడు ఒలింపిక్ పతకం ఇలా ప్రతి అంశం గుర్తుకు వచ్చింది. నా కోసం కష్టపడిన వీరందరికి నేను ఏమీ ఇవ్వగలను. నా తల్లిదండ్రుల జీవితాలు బాగుపడాలని మాత్రం ఆశిస్తున్నా.
- సరబ్‌జోత్