పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఎయిర్ పిస్టల్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్ -మను భాకర్ జోడి కాంస్య పతకం సాధించి భారత మువ్వెన్నల జెండాను రెపరెపలాడించారు. ఫైనల్లో భారత జోడీ 16-10తో దక్షిణ కొరియాకు చెందిన ఓహ్ యే-జిన్, లీ వోన్‌హోపై గెలిచి కాంస్యం సాధించి దేశం గర్వించేలా చేశారు. దాంతో, ఈ జోడీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మను భాకర్ గురించి గత రెండ్రోజులుగా వింటున్నా.. ఈ సరబ్‌జోత్ ఎవరా.? అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో అతని గురించి, అతని విజయాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
హర్యానా రైతు బిడ్డ
సరబ్‌జోత్ స్వస్థలం.. హర్యానాలోని అంబాలా. ధీన్ గ్రామానికి చెందిన రైతు దంపతులు జతీందర్ సింగ్ - హర్దీప్ కౌర్‌ల కుమారుడు. సరబ్‌జోత్ చండీగఢ్‌లోని డీఏవీ కాలేజీలో చదువు పూర్తి చేశాడు. కోచ్ అభిషేక్ రాణా దగ్గర శిక్షణ పొందాడు. సరబ్‌జోత్‌కి షూటింగ్‌లో పరిచయం అతని చిన్ననాటి రోజుల్లో సమ్మర్ క్యాంప్ సమయంలో జరిగింది. తాత్కాలిక రేంజ్‌లో ఎయిర్ గన్‌లు పట్టుకుంటున్న కొంతమంది పిల్లలను చూసినప్పుడు, అదే తన కెరీర్‌గా ఎంచుకున్నాడు.
అతనికి 13 ఏళ్ల వయస్సు ఉన్న సమయంలో తన తండ్రి వద్దకు వెళ్లి, 'నాన్న, నేను షూటింగ్‌లో పాల్గొనాలనుకుంటున్నాను.." అని చెప్పాడు. రైతైన ఆ తండ్రి ఈ క్రీడ చాలా ఖరీదైనదని అతనికి చెప్పాడు. కానీ చివరికి, సరబ్‌జోత్ మక్కువను, మొండితనాన్ని కాదనలేక గన్ కొనిచ్చారు. ఇతను 2019లో జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్, సుహ్ల్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
ఆసియా క్రీడల్లో స్వర్ణం
సరబ్‌జోత్ సింగ్ ఒక పెద్ద ఈవెంట్‌లో దేశం గర్వపడేలా చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022లో చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో చైనాను ఓడించి స్వర్ణం గెలుచుకున్న అర్జున్ సింగ్ చీమా, శివ నర్వాల్‌లతో కూడిన భారత త్రయంలో సరబ్‌జోత్ ఒకరు. అలాగే, 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో దివ్య టీఎస్‌తో భారత్‌కు రజతం అందించాడు.
Bronze for team India in the 10m Air Pistol Mixed Team match!
— SAI Media (@Media_SAI) July 30, 2024
Manu and Sarabjot with some fantastic shooting to land India's second medal of the #Paris2024Olympics! pic.twitter.com/WhFPY7mNa7
సరబ్‌జోత్ విజయాలు
- 2024 పారిస్ ఒలింపిక్స్:10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్- బ్రాంజ్ మెడల్
- 2022 ఆసియా క్రీడలు: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్- గోల్డ్ మెడల్
- 2022 ఆసియా క్రీడలు: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ - సిల్వర్ మెడల్
- 2023 భోపాల్ ప్రపంచ కప్: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషులు- గోల్డ్ మెడల్
- 2023 బాకు ప్రపంచ కప్: 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్ టీమ్ - గోల్డ్ మెడల్
- 2023 చాంగ్వాన్ ఆసియా ఛాంపియన్‌షిప్స్: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్- బ్రాంజ్ మెడల్
- 2019 దోహా ఆసియా ఛాంపియన్‌షిప్స్: 10మీ ఎయిర్ పిస్టల్ (పురుషుల జట్టు)- బ్రాంజ్ మెడల్
- 2019 దోహా ఆసియా ఛాంపియన్‌షిప్స్: 10మీ ఎయిర్ పిస్టల్ (మిక్స్ టీమ్)- గోల్డ్ మెడల్
- 2019 సుహ్ల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్: 10మీ ఎయిర్ పిస్టల్ జూనియర్ పురుషులు (వ్యక్తిగతం)- గోల్డ్ మెడల్
- 2019 జర్మనీ జూనియర్ ప్రపంచ కప్: 10మీ ఎయిర్ పిస్టల్ పురుషులు (వ్యక్తిగతం)- సిల్వర్ మెడల్
- 2019 జర్మనీ జూనియర్ ప్రపంచ కప్: 10మీ ఎయిర్ పిస్టల్ (జట్టు)- గోల్డ్ మెడల్
- 2019 జర్మనీ జూనియర్ ప్రపంచ కప్: 10మీ ఎయిర్ పిస్టల్ (మిక్స్ టీమ్)- సిల్వర్ మెడల్
మను భాకర్
కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ 124 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత ప్లేయర్ గా నిలిచింది. అంతకుముందు ఆమె మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా ఆమె రికార్డు సృష్టించింది. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు 1900 ఒలింపిక్స్‌లో బ్రిటీష్-ఇండియన్ అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ అథ్లెటిక్స్‌లో రెండు రజత పతకాలు సాధించాడు.