USA vs PAK: పాకిస్థాన్‌ను ఓడించింది మనోడే.. ఎవరీ సౌరభ్ నేత్రవాల్కర్..?

USA vs PAK: పాకిస్థాన్‌ను ఓడించింది మనోడే.. ఎవరీ సౌరభ్ నేత్రవాల్కర్..?

టీ20 వరల్డ్ కప్ 2024 లో తొలి సంచలనం నమోదయింది. పటిష్టమైన పాకిస్థాన్ జట్టుకు పసికూన అమెరికా జట్టు అనూహ్య షాక్ ఇచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణిస్తూ ఈ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ తో అమెరికా గట్టి పోటీ ఇస్తుందనుకున్నా.. విజయం మాత్రం ఊహించనిది. జట్టు క్రమశిక్షణగా ఆడినా.. అమెరికా విజయంలో మాత్రం  సౌరభ్ నేత్రవాల్కర్ ప్రధాన పాత్ర.

మొదట బౌలింగ్ లో 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి టాప్ స్పెల్ వేయగా.. సూపర్ ఓవర్ లో 13 పరుగులకే కట్టడి చేసి అమెరికాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ లో పాకిస్థాన్ 18 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో ఇఫ్తికర్ అహ్మద్, ఫకర్ జమాన్ లాంటి హిట్టర్లను కట్టడి చేయడంలో నేత్రవాల్కర్ సఫలమయ్యాడు. దీంతో ఈ యంగ్ ప్లేయర్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తుంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే సౌరభ్ నేత్రవాల్కర్ ది ఇండియా కావడం విశేషం. 

సౌరభ్ నేత్రవల్కర్ భారత సంతతికి చెందిన USA క్రికెటర్. అతని జన్మస్థలం ముంబై. 2010 లో జరిగిన ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్‌లో భారత్ తరఫున ఆడాడు. అప్పడు భారత జట్టులో కేఎల్ రాహుల్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ అగర్వాల్‌లు లాంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇదే టోర్నీలో పాకిస్థాన్ పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. 5 ఓవర్లలో కేవలం 16 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఈ టోర్నీలో మొత్తం 6 మ్యాచ్ ల్లో 9 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడిగా నిలిచాడు. అంతే కాదు ప్రస్తుతం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ వికెట్ ను ఈ టోర్నీలో పడగొట్టడం విశేషం. 

రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన సౌరభ్ నేత్రవల్కర్ భారత దేశీయ క్రికెట్ లో ముంబై జట్టులో రెగ్యులర్ సభ్యుడు. 2013-14 రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న ముంబై జట్టులో సౌరభ్ ఉన్నాడు. అయితే అతనికి క్రమంగా అవకాశాలు దక్కకపోవడంతో దృష్టి చదువుపై పెట్టాడు. 

2013లో ముంబై యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అమెరికా వెళ్లాడు. 2016లో కార్నెల్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డ్రిగీ అందుకున్నాడు. అనంతరం ఒరాకిల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జాయిన్ అయ్యాడు. అక్కడ ఉండగానే- గల్ఫ్ జెయింట్స్, గయానా అమెజాన్ వారియర్స్ తరఫున ఆడేవాడు. ఈ క్రమంలో  యూఎస్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం అమెరికా లీడ్ బౌలర్.. మెయిన్ బౌలర్ నేత్రవల్కర్ కావడం విశేషం.