పాకిస్థాన్ లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓ హిందూ మహిళా పోటీ చేయనుంది. ఆ దేశంలో ఓ హిందూ మహిళా బరిలో నిలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. బునెర్ జిల్లాలోని పీకే 25 జనరల్ స్థానంలో సవీరా ప్రకాశ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసింది కూడా. ఈమె ప్రస్తుతం జిల్లాలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఇటీవల చేసిన సవరణలో జనరల్ సీట్లలో మహిళా అభ్యర్థులకు కనీసం 5 శాతం ప్రాతినిధ్యం కల్పించాలని ఆదేశించింది. సవీరా ప్రకాశ్ 2022లో అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆమె తండ్రి ఓమ్ ప్రకాశ్ కూడా వైద్యుడే. ఆయన 35 సంవత్సరాలుగా పార్టీలో క్రియాశీల సభ్యునిగా ఉన్నారు. అయితే తండ్రి ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ.. సవీర బరిలో నిలవాలని నిర్ణయించుకుంది.
బర్నర్‌లోని పీకే-25 స్థానానికి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించింది కూడా. హిందూ కమ్యూనిటీ బాగుకోసం కృషి చేయడంతో పాటుగా మహిళా సాధికారత, సంక్షేమ సాధన తన లక్ష్యమని సవీరా ప్రకాశ్ చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను తప్పకుండా విజయం సాధిస్తానని ఆశాభావంతో చెప్తున్నారామే. కాగా పాకిస్థాన్‌లో 16వ నేషనల్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8, 2024న జరగనున్నాయి.