భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో సెలెక్టర్లు.. 26 ఏళ్ల ముంబై ఆల్‌రౌండర్‌ను చివరి రెండు టెస్టులకు ఎంపిక చేశారు. అతని పేరు.. తనూష్ కోటియన్. పుట్టింది కర్ణాటకలోనైనా.. పెరిగిందంతా ముంబైలోనే. ఒకరకంగా ముంబై జట్టుకు ఆడటమే.. అతన్ని జాతీయ జట్టులో చోటుదక్కేలా చేసింది. దాంతో, ఇతని గురించి ఎవరా..? అని ఆరా తీస్తున్నారు.
26 ఏళ్ల తనుష్ కోటియన్ గత సీజన్‌లో ముంబై రంజీ ట్రోఫీ విజేత జట్టులో సభ్యుడు. 2018లో ముంబై తరఫున బరిలోకి దిగిన తనుష్ అప్పటి నుంచి వెనుదిరిగి చూసింది లేదు. అశ్విన్ తరహాలో ఆఫ్ స్పిన్ వేయడంతో పాటు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతనికి ముంబై జట్టులో స్థానం సుస్థిరం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో అతను ముంబై తరుపున బరిలో ఉన్నాడు.
ఇప్పటివరకు 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కోటియన్ 101 వికెట్లు, 1525 పరుగులు చేశాడు. ఇందులో 3 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. బ్యాటర్‌గా 2 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు చేశాడు. 2023-24లో ముంబై జట్టు రంజీ ట్రోఫీని గెలవడంలో ఈ ఆల్‌రౌండర్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో 41.83 సగటుతో 502 పరుగులు, 29 వికెట్లు తీశాడు. దాంతో, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును గెలుచుకున్నాడు. ఆ తర్వాత అతను దులీప్ ట్రోఫీలో ఆడాడు. అక్కడ ఇండియా A తరపున మూడు మ్యాచ్‌లలో 10 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనలే అతన్ని సెలెక్టర్ల దృష్టిలో పడేలా చేశాయి.
తుది జట్టులో చోటు దక్కేనా..!
ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో టీమిండియా ముగ్గురు విభిన్న స్పిన్నర్లతో ఆడింది. పెర్త్ టెస్టులో వాషింగ్టన్ సుందర్, అడిలైడ్‌లో జరిగిన పింక్-బాల్ టెస్టులో అశ్విన్.. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టుకు రవీంద్ర జడేజా తుది జట్టులో ఉన్నాడు. బాక్సింగ్ డే టెస్ట్ కీలకమ్ కనుక కోటియన్ కు అవకాశం దక్కకపోవచ్చు. సీనియర్ ఆల్‌రౌండర్ జడేజావైపే రోహిత్ మొగ్గు చూపొచ్చు.