IND vs AUS: కంగారూల భారీ వ్యూహం..?: ఆస్ట్రేలియా జట్టులో భారత సంతతి స్పిన్నర్

IND vs AUS: కంగారూల భారీ వ్యూహం..?: ఆస్ట్రేలియా జట్టులో భారత సంతతి స్పిన్నర్

స్త్రీ, పురుష క్రికెట్.. టోర్నీ ఏదైనా వారిదే ఆధిపత్యం. మగాళ్లకు ఆ దేశ ఆడవాళ్లు ఏమాత్రం తీసిపోరు. ఓ రకంగా మగాళ్లతో పోలిస్తే, ఐసీసీ ట్రోఫీలు మగువలవే ఎక్కువ. ఇప్పటికే 20కి పైగా ఐసీసీ ట్రోఫీలు వారి సొంతం. అయినప్పటికీ, వారిలో ఆశ చావడం లేదు. దుబాయి వేదికగా భారత్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్లు భారీ వ్యూహమే పన్నారు. ఓ భారత సంతతి స్పిన్నర్‌ను బరిలో దింపారు. ఎవరతడు..? ఏంటి అతని కుటుంబ నేపథ్యం..? అనేది చూద్దాం..

భారత్‌తో జరుగుతోన్న సెమీఫైనల్ పోరులో ఆస్ట్రేలియా..  ఓ భారత సంతతి స్పిన్నర్‌ను బరిలో దింపింది. అతని పేరు.. తన్వీర్ సంఘా(Tanveer Sangha). దుబాయ్‌లోని స్పిన్ పిచ్‌ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, ఆస్ట్రేలియా జట్టు అతన్ని ప్లేయింగ్-11లో చేర్చింది. ఇది క్రికెట్‌లో సాధారణమే అయినప్పటికీ, ఈ మ్యాచ్‌లోనే బరిలోకి దింపాలన్న వారి ఆలోచనను అర్థం చేసుకోవాలి. ఇతడు వన్డే అరంగ్రేటం చేసి రెండేళ్లు గడిచినప్పటికీ, ఆడింది మూడు వన్డేలే. ప్రస్తుత భారత జట్టులోని యువ క్రికెటర్లు ఎవరూ ఇతన్ని పేస్ చేసింది లేదు. అతని బౌలింగ్ యాక్షన్ ఎలా ఉంటది అనేది పెద్దగా ఎవరికీ తెలియదు. అందువల్లే ఆస్ట్రేలియన్లు ఈ వ్యూహం పన్నారు.

తండ్రిది పంజాబ్..

తన్వీర్ కుటుంబం పంజాబ్‌లోని జలంధర్‌కు చెందినది. తండ్రి జోగా సింగ్ పంజాబ్‌లోని జలంధర్ సమీపంలోని ఒక గ్రామానికి చెందినవాడు. తల్లి ఉపజీత్ కౌర్.. ఫిజీ నివాసి. తండ్రి ట్రక్ డ్రైవర్, తల్లి అకౌంటెంట్. బ్రతుకుదెరువు కోసం ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడిన వీరి కుటుంబం.. తమ కుమారుడిని ఒక అంతర్జాతీయ క్రికెటర్‌గా తీర్చిదిద్దారు. తండ్రి సంకల్పం, తల్లి మద్దతు తన్వీర్ కెరీర్‌లో కీలక పాత్ర పోషించాయి. ఇతడికి సిమ్రాన్ అనే సోదరి కూడా ఉంది.

సిడ్నీలోని నైరుతి శివారు ప్రాంతాలలో నివాసముండే భారత వలసదారులకు జన్మించిన సంఘా కెరీర్ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్‌. ఆ తరువాత లెగ్-స్పిన్‌గా మారాడు. సంఘా.. పదమూడేళ్ల వయస్సులోనే ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ ఫవాద్ అహ్మద్ దృష్టిని ఆకర్షించాడు. అలా మొదలైన అతని ప్రయాణం.. 18 ఏళ్లు వచ్చేసరికి  న్యూ సౌత్ వేల్స్(NSW) జట్టులో అవకాశాన్ని తెచ్చి పెట్టింది. 

ఇప్పటివరకు ఈ భారత సంతతి స్పిన్నర్ ఆస్ట్రేలియా తరపున 3 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. వన్డేల్లో 2 వికెట్లు, టీ20ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో అతని ఎకానమీ రేటు 6.91.