తెలంగాణ రెగ్యులర్ డీజీపీ ఎవరు.? రేసులో ఆ నలుగురు

తెలంగాణ రెగ్యులర్ డీజీపీ ఎవరు.? రేసులో ఆ నలుగురు
  • సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్యానెల్ లిస్ట్ రెడీ చేస్తున్న ప్రభుత్వం
  • లిస్ట్​లో రవిగుప్తా, సీవీ ఆనంద్, శివధర్​రెడ్డి, మరో ఇద్దరు ఐపీఎస్​లు!
  • ఐదుగురి పేర్లు యూపీఎస్సీకి పంపేందుకు ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో రెగ్యులర్ డీజీపీ నియామకం కోసం ప్యానెల్ లిస్ట్ సిద్ధం చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్యానెల్ లిస్ట్‌‌ను రెడీ చేసి.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కు ప్రతిపాదనలు పంపనుంది.  డీజీపీల నియామకంపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. దానిని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించిన 8 రాష్ట్రాలపై కంటెంప్ట్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  ప్రభుత్వం ఇప్పుడు డీజీపీ పదవికి ప్యానెల్ లిస్ట్​ను సిద్ధం చేస్తున్నది. 


కొత్త డీజీపీ నియామకం కోసం సీనియార్టీ ప్రకారం చూస్తే  రవి గుప్తా, సీవీ ఆనంద్, బి. శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ తో పాటు ప్రస్తుత యాక్టింగ్ డీజీపీ జితేందర్ కూడా పోటీలో ఉన్నారు. అయితే ఆయనకు ఇంకా 5 నెలల సర్వీస్ మాత్రమే ఉన్నది.  సీనియార్టీ ప్రకారం చూస్తే రవి గుప్తా.. ప్రస్తుతం హోం   స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఈయన 1990 బ్యాచ్​కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి.  ఆయన 2023 డిసెంబర్ నుంచి 2024 జులై వరకు డీజీపీగా పనిచేశారు. ఇక   ఇంటెలిజెన్స్ చీఫ్​​గా ఉన్న శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ అధికారి. వచ్చే ఏడాది డిసెంబర్​లో రిటైర్ కానున్నారు. దీంతో ఆయన పేరును కూడా ప్రభుత్వం ప్రతిపాదనల్లో చేర్చనుంది. సీవీ ఆనంద్ (1991 బ్యాచ్) హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఆయన కూడా 2027 డిసెంబర్ లో రిటైర్ కానున్నారు.  ఈ ఇద్దరి పేర్లను కూడా ప్రభుత్వం ప్యానెల్ లిస్ట్​లో చేర్చనున్నట్టు తెలుస్తున్నది. సౌమ్య మిశ్రా, శిఖా గోయల్​తో పాటు ఏడీజీలు మహేశ్​మురళీధర్ భగవత్, సజ్జనార్, స్టీఫెన్ రవీంద్ర  కూడా ఉన్నారు. అయితే వీరి సర్వీసు ఎక్కువ కాలం ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం డీజీ కేడర్​లోని సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపాలి. యూపీఎస్సీ ముగ్గురు అధికారుల ప్యానెల్‌ను సిఫారసు చేస్తుంది. వీరిలో ఒకరిని డీజీపీగా నియమించాలి. అర్హతల్లో 30 ఏండ్ల సర్వీసు, డీజీ లేదా ఏడీజీ ర్యాంక్, కనీసం 6  నెలల సర్వీసు మిగిలి ఉండడం, రెండేండ్ల పదవీకాలం  ఉండాలి.

డీజీపీల నియామకంపై సుప్రీం ఉత్తర్వులు

డీజీపీల నియమాకం కంటెంప్ట్ కేసులో సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. ఈ ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు 8 రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.  ఇందులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, పంజాబ్ , బిహార్, ఒడిశా, కేరళ,ఉత్తరప్రదేశ్ , రాజస్థాన్  ఉన్నాయి. కోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.  అలాగే, ఈ రాష్ట్రాలు తమ డీజీపీ నియామక ప్రక్రియలో 2006 తీర్పును ఎలా పాటించాయో వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణ మే 6 కు వాయిదా వేసింది. అలాగే, సుప్రీంకోర్టు ఈ విచారణలో భాగంగా ‘‘రాష్ట్రాలు తమ రాజకీయ అవసరాల కోసం డీజీపీ నియామకాలను వాడుకోవడం సరికాదు’’ అని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రకాశ్ సింగ్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం.. డీజీపీల నియామకం పారదర్శకంగా,  యూపీఎస్సీ సిఫారసు ఆధారంగా జరగాలని ఆదేశించింది.