బిట్టు శ్రీను.. లాయర్​ దంపతుల హత్య వెనుక కొత్త పేరు

  • తెరపైకి జడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు పేరు
  • హంతకులు వాడిన కారు అతనిదే

పెద్దపల్లి, వెలుగు: లాయర్​ దంపతుల హత్య సూత్రధారి కుంట శ్రీనివాసేనా? తెర వెనుక పెద్దతలకాయలు ఏవైనా ఉన్నాయా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. పోలీసుల తమ ఎంక్వైరీలో తేలినవని చెప్తున్న విషయాలు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. నల్లకారులో వచ్చిన హంతకులు లాయర్లు ప్రయాణిస్తున్న కారును అడ్డగించి, అందరూ చూస్తుండగానే హత్యచేసి, అదే కారులో వెళ్లిపోయారు. అయితే నిందితులు వాడిన కారు మంథనికి చెందిన బిట్టు శ్రీను అనే వ్యక్తిదని గురువారం ప్రెస్​మీట్లో ఐజీ నాగిరెడ్డి చెప్పారు. వారికి కారు ఇచ్చిన బిట్టు శ్రీను పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్టమధుకు స్వయాన మేనల్లుడు. మధు నిర్వహించే పుట్ట లింగమ్మ ట్రస్ట్​చైర్మన్​గా కొనసాగుతున్నట్లు తెలిసింది. పుట్ట మధు వెన్నంటి ఉండే బిట్టు శ్రీను, కుంట శ్రీనుకు మొదటి నుంచి పరిచయం ఉంది. కానీ ఐజీ నాగిరెడ్డి మాత్రం చిరంజీవి అనే వ్యక్తి అడిగితే బిట్టు శ్రీను తన కారు ఇచ్చాడని ప్రెస్​మీట్​లో చెప్పారు. కారులో ఉన్న కత్తులనే హత్యకు వాడారని చెప్పారు. అవి ముందే ఉన్నాయా? నిందితులే తెచ్చారా? అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇక కారు అవసరమైతే కుంట శ్రీను స్వయంగా బిట్టు శ్రీనును ఎందుకు అడగలేదనే ప్రశ్న వస్తోంది. బిట్టు శ్రీను హస్తం లేదని చెప్పేందుకే చిరంజీవి పేరు తెచ్చారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

కుమార్ గోదారిఖని ఎట్ల పోయిండు?

నిందితులు ముగ్గురూ హత్య తర్వాత బిట్టు శ్రీను కారులో పారిపోయారని వీడియో క్లిప్పింగుల్లో తెలుస్తోంది. కానీ కుంట శ్రీనును, చిరంజీవిని మహారాష్ట్రలో పట్టుకున్నట్లు, ఒకరిని  గోదావరిఖనిలో పట్టుకున్నట్లు ఐజీ వెల్లడించారు. ఇద్దరు సుందిళ్ల బ్యారేజీ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తే రక్తపు బట్టలతో ఉన్న కుమార్​ను గోదావరిఖనికి ఎవరు, ఏ వెహికిల్​లో తీసుకొచ్చారు. అనే ప్రశ్నకు పోలీసులు సమాధానం చెప్పలేదు. ముగ్గురు నిందితుల మధ్య ఉన్న సంబంధాలపైనా పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. కరోనా టైంలో చిరంజీవికి కుంట శ్రీను సాయం చేసినందుకే హత్యకు సహకరించాడని చెప్పిన పోలీసులు అక్కపాక కుమార్​ గురించిన సమాచారం ఇవ్వలేదు. వామన్ రావు మంథనికి ఎప్పుడు ఏ వెహికిల్​లో వచ్చాడో, ఏ టైంలో కోర్టు నుంచి హైదరాబాద్ బయలుదేరాడో కారులో ఉన్నవారికి చెప్పేందుకు ఎవరో ఒకరు రెక్కీ నిర్వహించి ఉండాలి. వాళ్లెవరో, ఎంతమందో ఇప్పటికైతే పోలీసులు చెప్పలేదు.

గ్రామంలోని వివాదాలకే హత్య చేస్తారా?

మంథని నియోజకవర్గంలో కొందరు అధికార పార్టీ లీడర్లు చేస్తున్న అక్రమాలపై వామన్​రావు, నాగమణి దంపతులు కొన్నేండ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. టీఆర్ఎస్​ లీడర్ల ఇసుక, కలప దందాలు, అవినీతి, అక్రమాలపై హైకోర్టులో కేసులు వేసి నడిపిస్తున్నారు. మంథని నియోజకవర్గంలో జరిగిన అనుమానాస్పద మరణాలు, లాకప్​డెత్​లపైనా హైకోర్టులో పిల్స్ వేసారు. పోలీస్ ఆఫీసర్లు మాత్రం గ్రామంలో కుంట శ్రీను కడుతున్న ఇల్లు, పెద్దమ్మ గుడికి పర్మిషన్ లేకపోవడాన్ని ప్రశ్నించినందుకే హత్య చేసినట్టు తమ ఎంక్వైరీలో తేలిందని చెబుతున్నారు. ఈ చిన్న వివాదానికే పథకం ప్రకారం నడిరోడ్డుపై ఇద్దరు లాయర్లను నరికిచంపుతారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

For More News..

ఐపీఎల్‌లో తెలుగు కుర్రాళ్లకు ఛాన్స్.. ఎవరిని ఎంతకు కొన్నారంటే..

రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న లాయర్లు..

కరోనా టైమ్​లో ఎడ్యుకేషన్​ లోన్స్​ రికార్డు