గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎవరు..?

  • రేపే జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక
  • ప్రమాణ స్వీకారాల తర్వాత ఎలక్షన్
  • తెలంగాణ భవన్​లో టీఆర్ఎస్​ స్పెషల్ మీటింగ్
  • కేటీఆర్ సమక్షంలో సీల్డ్ కవర్ ఓపెన్
  • పదవి దక్కించుకునేందుకు లీడర్ల తీవ్ర ప్రయత్నాలు
  • బీసీ, ఓసీ మహిళా నేతల మధ్య పోటీ

 

అమావాస్య ముగిసిన తర్వాత ప్రమాణం

జీహెచ్ఎంసీ కొత్త కార్పొ రేటర్లు గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగనుంది. మెంబర్లంతా పొద్దున 10.45 గంటలలోగా జీహెచ్ఎంసీ కౌన్సిల్​హాల్​కు చేరుకోవాలని అధికారులు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 11 గంటలకు కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం మొదలవుతుంది. తెలుగు, హిందీ, ఉర్దూ , ఇంగ్లిష్ భాషల్లో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మెంబర్లు నచ్చిన లాంగ్వేజ్ లో ప్రమాణ స్వీకారం చేయొచ్చు

మేజిక్ ఫిగర్ అవసరం లేదు.. మెజార్టీ ఉంటే చాలు

మేయర్ ఎన్నిక కోసం మేజిక్ ఫిగర్ అవసరం లేదు, మెజార్టీ ఉంటే చాలు. ఓటింగ్ లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు మేయర్ గా ఎన్నికవుతారు. జీహెచ్ఎంసీ రిజల్ట్స్ లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదు. టీఆర్ఎస్ 56 చోట్ల, బీజేపీ 48 చోట్ల, ఎంఐఎం 44, కాం గ్రెస్ 2 చోట్ల గెలిచాయి. బీజేపీ కొత్త కార్పొరేటర్ ఒకరు మరణించడంతో ఆ పార్టీ మెంబర్ల సంఖ్య 47కు తగ్గింది. మొత్తం 149 సీట్లు కాగా.. అన్ని పార్టీలకు కలిపి మరో 44 మంది ఎక్స్​అఫీషియో మెంబర్లు ఉన్నారు. అంటే మొత్తంగా మెంబర్ల సంఖ్య 193 మందికి చేరుతుంది. ఎక్స్​అఫీషియో మెంబర్లతో కలిపి టీఆర్ఎస్ కు 88, బీజేపీకి 49, ఎంఐఎంకు 54, కాం గ్రెస్ కు ఇద్దరు మెంబర్లు ఉంటారు. అయితే ఏ పార్టీ కూడా వేరే పార్టీకి నేరుగా మద్దతిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దానికితోడు మ్యాజిక్ ఫిగర్​ వంటి రూలేమీ లేకపోవడంతో.. మిగతా పార్టీల కన్నా ఎక్కువ ఓట్లున్న టీఆర్ఎస్ మేమేయర్, డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకునే చాన్స్​ కనిపిస్తోంది.

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​ హైదరాబాద్​ మేయర్​ ఎన్నికకు ఒక్కరోజే టైం ఉండటంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. సీట్లు, ఎక్స్​అఫీషియో లెక్కలతో.. పీఠం టీఆర్ఎస్​కే దక్కే చాన్స్​ ఉండటంతో ఆశావహుల్లో ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమకు చాన్స్​ ఇవ్వాలని కేసీఆర్, కేటీఆర్​లను కలిసి కోరుతున్నారు. పార్టీ సీనియర్​నేతలు కొందరు తమ వారసులకు మేయర్​చాన్స్​ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. ఉద్యమ సమయం నుంచీ వెంట ఉన్న తమకు అవకాశం ఇవ్వాలంటూ మరికొందరు విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే ఎన్నిక జరిగే రోజునే మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను సీల్డ్​ కవర్ లో తెలంగాణ భవన్ కు పంపుతామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఆ రోజు ఉదయం 9 గంటలకల్లా టీఆర్ఎస్​ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా తెలంగాణ భవన్​కు రావాలని ఆదేశించారు. అక్కడే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పంపించిన సీల్డ్ కవర్ ను ఓపెన్ చేసి మేయర్, డిప్యూటీ మేయర్  క్యాండిడేట్ల పేర్లను ప్రకటించనున్నారు. ఆ సీల్డ్​ కవర్​లో ఎవరి పేరు ఉంటుందనే దానిపై టెన్షన్​ నెలకొంది. జీహెచ్ఎంసీ మేయర్​ పీఠం జనరల్​ మహిళకు రిజర్వు అయింది. పదవి కోసం ఓసీలతోపాటు బీసీ మహిళా లీడర్లు కూడా తీవ్రంగా పోటీ పడ్తున్నారు. దీంతో ఓసీలకు చాన్స్​ ఇస్తరా, బీసీలకు ఇస్తరా అన్నది ఆసక్తికరంగా మారింది.

చివరి ప్రయత్నాల్లో లీడర్లు బిజీ బిజీ

మేయర్ పదవిని తమ వారసులకు ఇప్పించుకునేందుకు టీఆర్ఎస్ లీడర్లు చివరి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రగతిభవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్, కేటీఆర్ లను కలిసి తమ వాళ్లకు చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే వారు ఇప్పటివరకు అందరూ చెప్పింది వినడమే తప్ప.. ఎవరికీ ఎట్లాంటి సంకేతాలు ఇవ్వడం లేదని టీఆర్ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. ఎంపీ కె.కేశవరావు తన బిడ్డ విజయలక్ష్మికి మేయర్ పదవి ఇప్పించేందుకు తీవ్రంగా ట్రై చేస్తున్నట్టు పార్టీ లీడర్లు చెప్తున్నారు. టైం దొరికిన ప్రతిసారీ ఈ విషయాన్ని కేసీఆర్ కు దృష్టికి తెస్తున్నారని అంటున్నారు. ఇక ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ తన భార్య శ్రీదేవికి మేయర్ పదవి ఇవ్వాలని అడుగుతున్నట్టు తెలిసింది. రెండు రోజుల క్రితం రామ్మోహన్, శ్రీదేవి ఇద్దరూ ప్రగతిభవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ ను కలిశారు. మరోవైపు తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలతకు మేయర్ పదవి ఇవ్వాలంటూ ఆమె భర్త శోభన్ రెడ్డి గట్టిగా ట్రై చేస్తున్నారు. ఉద్యమ కాలం నుంచీ పార్టీలో ఉన్న తమకు ఇప్పటిదాకా ఎట్లాంటి అవకాశం రాలేదంటూ ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. ఇక ఇప్పటికే పలుసార్లు కేటీఆర్ ను కలిసి తనకు మేయర్​ చాన్స్​ ఇవ్వాలని కోరిన పీజేఆర్ బిడ్డ విజయారెడ్డి.. తాజాగా మరోసారి కేటీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. భారతీనగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శ్​రెడ్డికి మేయర్ పదవి ఇవ్వాలని ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కోరుతున్నట్టు సమాచారం. వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ మన్నె కవిత, అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి కూడా మేయర్​ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

కేటీఆర్ సమక్షంలో సీల్డ్ కవర్ తెరిచి..

గురువారం ఉదయం 9 గంటల టైంలో తెలంగాణ భవన్ లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో ఓటర్ల మీటింగ్ జరుగనుంది. ఈ మీటింగ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. ఆయన సమక్షంలో సీల్డ్ కవర్ ఓపెన్ చేసి మేయర్, డిప్యూటీ మేయర్ క్యాండిడేట్ల పేర్లను ప్రకటించనున్నారు. క్యాండిడేట్లను ఎవరు ప్రపోజ్ చేయాలి, ఎవరెవరు సపోర్టు చేయాలనేది అక్కడే వివరించనున్నారు.

అమావాస్య దాటిన తర్వాతే మేయర్ ఎన్నిక

గురువారం ఉదయం 11.10 నిమిషాల వరకు అమావాస్య ఉంటుందని, అది ముగిసిన తర్వాతే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుదని లీడర్లు అంటున్నారు. కార్పొరేటర్ల ప్రమాణం తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. 10 నిమిషాల్లో ఎన్నిక పూర్తవుతదని
ఆఫీసర్లు చెప్తున్నారు.

పార్టీల వారీగా ఎక్స్​అఫీషియో మెంబర్లు..

టీఆర్ఎస్​: రాజ్యసభ ఎంపీలు డి.శ్రీనివాస్, కేఆర్ సురేశ్​రెడ్డి, జె.సంతోష్​కుమార్, కె కేశవరావు, ఓడితెల లక్ష్మీకాంతరావు, లోక్​సభ ఎంపీలు కొత్త ప్రభాకర్‌​రెడ్డి, ఎమ్మెల్సీలు వి.భూపాల్ రెడ్డి, పి.సతీశ్​కుమార్, మహమూద్​ అలీ, టి.భానుప్రసాద్ రావు, ఎంఎస్​ ప్రభాకర్ రావు, నారదాసు లక్ష్మణరావు, బొగ్గారపు దయానంద్, బాలసాని లక్ష్మీనారాయణ, కల్వకుంట్ల కవిత, మహ్మద్​ ఫరీదుద్దీన్, సత్యవతి రాథోడ్, బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేశ్,ముఠా గోపాల్, దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, పద్మారావు గౌడ్, సాయన్న, మైనంపల్లి హన్మంతరావు, బేతి సుభాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, అరికెపూడి గాంధీ, నామినెటెడ్​ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్.

ఎంఐఎం: ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ, ఎమ్మెల్సీలు మిర్జా రియాజ్​ఉల్ హాస్​ హఫండీ, సయ్యద్​ అమీనుల్​ హాసన్​ జాఫ్రీ, ఎమ్మెల్యేలు అబ్దుల్​ బలాలా, జాఫర్ హుస్సేన్, కౌసర్​ మొహినొద్దిన్, ముంతాజ్​ అహ్మద్ ఖాన్, అక్బరుద్దీన్ ఒవైసీ, సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, మహ్మద్ మొజంఖాన్.

బీజేపీ: ఎంపీ కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్

పోటీకి మూడు పార్టీలు రెడీ

మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం జీహెచ్ఎంసీలోని మూడు ప్రధాన పార్టీలు రెడీ అయ్యాయి. టీఆర్ఎస్ తెలంగాణ భవన్ లో గురువారం ఉదయం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో ఓటర్లతో స్పెషల్ మీటింగ్ పెట్టుకుంది. బీజేపీ కూడా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు పార్టీ క్యాండిడేట్లను రెడీ చేస్తోంది. మజ్లిస్​ పార్టీ బుధవారం దారుస్సలాంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో మేయర్ ఎన్నికపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. బీజేపీ పోటీ చేస్తే ఎంఐఎం కూడా తమ క్యాండిడేట్లను బరిలోకి దించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

ఇవి కూడా చదవండి

షర్మిల..జగన్ అన్న వదిలిన బాణం కాదు,కేసీఆర్ వదిలిన బాణం

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా

జగన్ వద్దన్నా షర్మిల వినలే.. ఆమె పార్టీతో వైసీపీకి సంబంధం లేదు