అదానీ లంచం కేసు: ఏపీలో ఆ నెంబర్ వన్ అధికారి ఎవరు.. డీల్ వెనక వేల కోట్లు అతనికి ముట్టాయా..?

అదానీ లంచం కేసు: ఏపీలో ఆ నెంబర్ వన్ అధికారి ఎవరు.. డీల్ వెనక వేల కోట్లు అతనికి ముట్టాయా..?

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలోని బ్రూక్లిన్‌ ఫెడరల్‌ కోర్టు చేసిన అభియోగాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు.. ఏపీ రాజకీయాలను ఈ అభియోగాలు షేక్ చేస్తున్నాయి. అదానీ లంచం ఇవ్వజూపినట్లు అభియోగాలు వచ్చిన ఈ కేసులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఒకరిని "Foreign Official #1" అని చేర్చడం హాట్ టాపిక్గా మారింది.

ఈ కేసులో జగన్ సర్కార్ ప్రస్తావన ప్రముఖంగా వినిపిస్తుండటం, వైసీపీ ప్రభుత్వ  హయాంలో పనిచేసిన ఒక అత్యున్నత స్థాయి అధికారి హస్తం ఉందనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. 2020-24 మధ్య కాలంలో సోలార్ పవర్ కాంట్రాక్ట్స్ను దక్కించుకునేందుకు భారత్లో కొందరు ప్రభుత్వ అధికారులకు రూ. 2,029 కోట్లు(265 మిలియన్ యూఎస్ డాలర్లు) లంచాల రూపంలో అదానీ గ్రూప్ చెల్లించిందనేది ఈ కేసులో ప్రధాన అభియోగం.

"Foreign Official #1"కు రూ.1,750 కోట్లు లంచం ఇచ్చినట్లు ప్రధాన ఆరోపణ. 2019 మే నుంచి 2024 జూన్ వరకూ ఏపీలో అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగంలో ఈ లంచాలు పుచ్చుకున్న వ్యక్తి కొనసాగినట్లు అమెరికా కోర్టులో ప్రస్తావించిన ఆరోపణల్లో ఉండటం గమనార్హం. అయితే అమెరికాలో నమోదైన ఈ కోర్టు ఫైలింగ్స్లో ఆ Foreign Official #1ఎవరు, ఏంటనే ఐడెంటిటీని రివీల్ చేయలేదు.

2020లో అదానీ గ్రీన్ ఎనర్జీతో పాటు పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేసే మరో కంపెనీ 12 గిగావాట్ల సోలార్ పవర్ను ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు(SECI) ఉత్పత్తి చేసే కాంట్రాక్టును సొంతం చేసుకోవాలని భావించాయి. ఈ సోలార్ పవర్ను కొనుగోలు చేసే బయ్యర్లు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి దొరకలేదు. అయితే.. ఈ డీల్ ఎక్కడ రద్దవుతుందోనని భావించిన అదానీ గ్రూప్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ సోలార్ పవర్ను కొనేలా ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వజూపాయి.

ఈ సమయంలోనే జగన్ సర్కార్లో Foreign Official #1 అధికారి అదానీ గ్రూప్ ఆటలో పావుగా మారాడు. ఈ అధికారికి 228 మిలియన్ డాలర్లను అదానీ గ్రూప్ ఆఫర్ చేసిందని, ఆంధ్రాలోని ఎలక్ట్రిసిటీ ప్రొవెడర్లు 7 గిగావాట్ల సోలార్ ఎనర్జీని కొనుగోలు చేసేలా అదానీ గ్రూప్కు జగన్ సర్కార్ సాయపడిందనేది ఈ టోటల్ ఎపిసోడ్లో ప్రస్తావనకొచ్చిన ప్రధాన అభియోగం.

ALSO READ | బిగ్ బ్రేకింగ్ : అదానీ లంచం స్కాంలో.. అప్పటి జగన్ ప్రభుత్వ అధికారులు

దేశంలోని మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో సోలార్ ఎనర్జీ కొనుగోలు కోసం వెచ్చించలేదని సమాచారం. ఈ మొత్తం వ్యవహారం 2021లో జరిగింది. ఆ సమయంలో ఏపీలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉంది. ఈ డీల్కు సంబంధించిన అగ్రిమెంట్లను ఫైనలైజ్ చేసుకునేందుకు నేరుగా అదానీనే వ్యక్తిగతంగా ఈ Foreign Official #1తో పలుమార్లు 2021లో చర్చలు జరిపినట్లు ఆరోపణలున్నాయి. 2021లో ఆగస్ట్ 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20న అదానీ సదరు అత్యున్నత ప్రభుత్వ అధికారితో చర్చలు జరిపినట్లు ప్రాసెక్యూటర్స్ పేర్కొన్నారు.

ఈ చర్చల తర్వాతే ఏపీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు SECIతో పవర్ సేల్ అగ్రిమెంట్(PSA) చేసుకున్నాయని, 7 గిగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు అంగీకరించాయని ప్రాసిక్యూటర్స్ తెలిపారు. ఛత్తీస్గర్, తమిళనాడు, ఒడిశాతో పాటు జమ్ము కశ్మీర్ కూడా సోలార్ పవర్ కొనుగోలుకు సంబంధించిన అగ్రిమెంట్లపై 2021 జులై నుంచి 2022 ఫిబ్రవరి మధ్య కాలంలో సంతకం చేశాయని తెలిసింది. అయితే ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని, ఈ ఆరోపణలపై న్యాయపరంగా చర్యలు తీసుకునేలా ముందుకెళతామని అదానీ గ్రూప్ పేర్కొంది.