టీచర్ల మరణాలకు బాధ్యులెవరు?

టీచర్ల మరణాలకు బాధ్యులెవరు?

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో టీఆర్ఎస్​ సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసం అనివార్యత లేకున్నా వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, ఐదు మున్సిపాల్టీల ఎన్నికలకు పూనుకున్నది. కరోనా విషమ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ చావుబతుకుల సమస్యగా ఉందని ఉద్యోగులు, టీచర్లు ఎంత మొత్తుకున్నా వారి మాటలను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికలు నిర్వహించి తన పంతం నెగ్గించుకున్న ది. సురక్షిత ఎన్నికల నిర్వహణ సందేహాస్పదంగా ఉందని హైకోర్టు ఎన్నిసార్లు ప్రశ్నించినా, తప్పుడు అఫిడవిట్లతో, కల్లబొల్లి మాటలు చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం హైకోర్టును బురిడి కొట్టించాయి. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాలకు వంత పాడుతూ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం కూడా ఈ కుట్రలో భాగస్వామ్యం కావడం విచారకరం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాక జోక్యం చేసుకొని ఆపేసే సంప్రదాయం లేనందున హైకోర్టు కూడా అన్యమనస్కంగానే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కొన్ని నిబంధనలను విధించింది. వాటిని పాటిస్తామని మాయమాటలు చెప్పిన ప్రభుత్వం.. ఆచరణలో వాటిని తుంగలో తొక్కేసింది.

విధిలేక ఎన్నికల డ్యూటీలకు..
కరోనా నిబంధనలను గాలికొదిలేసి సాధారణ పరిస్థితుల్లో నిర్వహించే మాదిరిగానే ఎన్నికలు నిర్వహించడంతో అనేక మంది పోలింగ్ సిబ్బంది, వారి కుటుంబాలు కూడా కరోనా బారిన పడ్డాయి. ఎన్నికల విధుల్లో పాల్గొన్న పాపానికి పదుల సంఖ్యలో టీచర్లు మరణించడం విచారకరం. ఎన్నికల విధుల్లో పాల్గొనకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఈసీ హుకుం జారీ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో టీచర్లు పాల్గొనాల్సి వచ్చింది. అయితే బస్సుల్లో సిబ్బందిని తరలించే క్రమంలో ఎలాంటి నిబంధనలు పాటించలేదు.పైగా పోలింగ్ స్టేషన్లు కొన్నింటిని గాలిచొరబడని చోటుల్లో ఏర్పాటు చేశారు. ఏర్పాట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఏదోలా ఎన్నికలను పూర్తి చేశారు.

టీచర్లకు, వారి కుటుంబాలకు కరోనా
అయితే ఎన్నికల విధుల్లో పాల్గొన్న అనేక మంది సిబ్బందికి కరోనా లక్షణాలు బయటపడటంతో బెంబేలెత్తిపోయారు. వందలాది మంది టీచర్లు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. కొందరు హోం ఐసోలేషన్ లో ఉంటే.. మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో ట్రీట్​మెంట్​ కోసం లక్షలాది రూపాయలు వెచ్చించారు. ఇందుకోసం అప్పులు చేసి, ఆస్తులు కుదువబెట్టి ప్రైవేటు ఆస్పత్రులకు బిల్లులు చెల్లించారు. ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు ఎందుకూ పనికిరాలేదు. ఏ ప్రైవేటు ఆస్పత్రి వాటిని అంగీకరించలేదు. క్యాష్​ చెల్లిస్తేనే ట్రీట్​మెంట్​ చేశారు. దీంతో పదుల సంఖ్యలో టీచర్లు మరణించారు. వారి కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న కారణంగా కరోనా కాటుకు బలైన టీచర్ల పట్ల ప్రభుత్వం గానీ, ఎన్నికల సంఘం గానీ ఎలాంటి సానుభూతిని ప్రదర్శించలేదు. ఎన్నికల సంఘం వారికి పారితోషికం చెల్లించి చేతులు దులిపేసుకుంది. ఇప్పుడు వారి యోగక్షేమాలను విచారించేది ఎవరు?ఎన్నికల్లో పాల్గొన్న కారణంగా అనేక కష్టాలపాలైన వీరి జీవితాలను ఎవరు బాగు చేస్తారు?. పదుల సంఖ్యలో టీచర్లు మరణించినా, వందలాది టీచర్ల కుటుంబాలు కరోనా బారినపడినా వారిని ఏ ఉపాధ్యాయ సంఘం పట్టించుకోలేదు. అండగా నిలబడ లేదు.

సుమోటోగా విచారణ చేయాలి
భవిష్యత్​లో ఎన్నికల సంఘం, ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా రాజ్యాంగబద్ధ పరిధులను అతిక్రమించి అనుచిత చర్యలకు పాల్పడకుండా ఉండాలంటే ఈ ఎన్నికల తతంగంపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలి. ఎన్నికల విధుల కారణంగా టీచర్లు కరోనాతో మరణించడాన్ని, ప్రభుత్వ హత్యలుగా పరిగణించి హైకోర్టు సుమోటోగా స్వీకరించాలి. అఫిడవిట్లలో చెప్పిన ప్రకారమే ఎన్నికలు నిర్వహించారా? లేదా? అనేది విచారించాలి. కరోనా నిబంధనలు పాటించకుండా ఎన్నికలు నిర్వహించినట్లయితే సంబంధిత అధికారులను శిక్షించాలి. సిబ్బంది ప్రాణాలతో చెలగాటమాడే యంత్రాంగానికి గుణపాఠం చెప్పే రీతిలో హైకోర్టు స్పందించాలి. ఎన్నికల సిబ్బంది తమ ఆరోగ్య పరిరక్షణ కోసం ఖర్చు చేసిన ప్రతి పైసాను ఎన్నికల కమిషన్ నుంచి తిరిగి చెల్లించేలా తీర్పు ఇవ్వాలి. అలాగే సముచితమైన నష్టపరిహారాన్ని బాధితులకు ఇప్పించాలి.

- నోముల శ్రీనివాస్ రెడ్డి, హన్మకొండ