భారత క్రికెట్ మాజీ మహిళా కోచ్ తుషార్ అరోథే వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. శనివారం వడోదర, ప్రతాప్‌గంజ్ ప్రాంతంలోని ఆయన నివాసంలో పోలీసు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) అధికారులు సోదాలు నిర్వహించగా ఇంట్లో కోటి రూపాయలు పట్టుబడ్డాయి. మొత్తం రూ. 1.01 కోట్ల నగదు బూడిద రంగు సంచుల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ డబ్బుకు సరైన ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకొని, ఆయనపై కేసు నమోదు చేశారు.
"ఆ డబ్బు వారిదే అనేందుకు తుషార్ అరోథే సరైన ఆధారాలు చూపించకపోవడంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఇన్‌స్పెక్టర్ వీఎస్ పటేల్ వెల్లడించారు. మరో ఇద్దరు సహచరులు విక్రాంత్ రాయపట్వర్, అమిత్ జనిత్ వద్ద రూ.38 లక్షల నగదు దొరికినట్లు పోలీసులు తెలిపారు. తుషార్ అరోథే కుమారుడు రిషిపై గతంలో క్రికెట్ బెట్టింగ్, చీటింగ్ కేసులు ఉన్నాయి. దాంతో, పట్టుబడిన డబ్బు క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
తుషార్ అరోథే న్యాయపరమైన చిక్కుల్లో పడటం ఇదే మొదటిసారి కాదు. ఏప్రిల్ 2019లో ఢిల్లీ క్యాపిటల్స్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా స్థానిక కేఫ్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో వడోదర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరోథే సహా మరో 18 మందిని అరెస్టు చేశారు. అనంతరం ఆరోతే సహా నిందితులందరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఎవరీ తుషార్ అరోథే..?
తుషార్ అరోథే మాజీ భారత క్రికెటర్. అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో బరోడాకు ప్రాతినిధ్యం వహించాడు. 114 ఫస్ట్-క్లాస్, 51 లిస్ట్ A మ్యాచ్‌లు ఆడాడు. ఎఫ్‌సి క్రికెట్‌లో బరోడా తరఫున అరోథే 6105 పరుగులు చేశాడు. 225 వికెట్లు కూడా తీశాడు. 2003లో ఆటగాడిగా రిటైరయ్యాక, 2008లో భారత మహిళల జట్టు కోచింగ్ స్టాఫ్‌లో చేరాడు. 2017 ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరిన మహిళల క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్. ఆపై 2018లో ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. అప్పటినుంచి తుషార్ అరోథె కోచింగ్ సిబ్బందిలో ఒకడిగా 2022 వరకు జట్టుతోనే కొనసాగాడు.