ఆధ్యాత్మికం: యోగి అంటే ఎవరు..యఙ్ఞం అంటే ఏమిటి..

ఆధ్యాత్మికం: యోగి అంటే ఎవరు..యఙ్ఞం అంటే ఏమిటి..

ఆసక్తి, అభిమానం పోయిన మానవుడు యోగి అవుతాడు. అతడు చేసే ప్రతి పని యజ్ఞార్థ కర్మ అవుతుంది. అప్పుడు. కర్మ అంటదు. ఇక్కడ యజ్ఞం అనే మాటకి సరైన అర్థం తెలుసుకోవలసి ఉంది. యజ్ఞం అంటే 'పరార్థ కర్మ' అని అర్థం. 'పరార్థం' అంటే తన కోసం కాక ఇతరుల ప్రయోజనం కోసం చేసే పని.

దీనికి ఒక చిన్న ఉదాహరణ చెపుతారు పెద్దలు. వండుకోవటం 'స్వార్థం' వండి పెట్టటం యజ్ఞార్థ క్రియ.  యజ్ఞం అనే మాటని ఆంగ్లంలో శాక్రిఫైజ్ అంటారు. దానికి కూడా అర్ధం త్యాగం అనే కదా. ఇది ... లేక దీని ఫలితం నాకు చెందాలి అనుకోకుండా పని చెయ్యటం యజ్ఞార్థ కర్మ.  అయితే పని చెయ్యటం దేనికి? ఊరకుండవచ్చు కదా. అనే ప్రశ్న రావటం సహజం. ఆకర్మ అనేదాని గురించి కూడా చెప్పటం జరిగిందిగా. బ్రతికి ఉన్నంత కాలం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అదేదో పది మందికి ఉపయోగపడేది అయితే మంచిది కదా. అది కూడా తన కర్తవ్యం అనుకొని చేయాలే కాని, పుణ్యమో, పేరో, ప్రఖ్యాతో వస్తుందని కాదు.

అందరికీ యజ్ఞాలు చేసే అర్థబలం, అంగబలం ఉండవు. వారి సంగతేమిటి?  చక్కని మార్గం చెపుతున్నాడు శ్రీకృష్ణుడు. 

"బ్రహ్మార్పణం బ్రహ్మహవి ర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్. 
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా"

జ్ఞాని అయిన వాడికి సమస్తంలో పరబ్రహ్మతత్వ దర్శనం అవుతుంది. దానిని భావన చేయటంలోనే కిటుకు అంతా ఉంది. పెద్దలైన వారు పిల్లలచేత భోజనానికి ముందు ఈ శ్లోకం చెప్పిస్తారు. దీని అర్థం "బ్రహ్మకి ఇస్తున్నాను. అది బ్రహ్మకి హవిస్సుగా మారుతోంది. దానిని పచనం చేసే అగ్ని కూడా బ్రహ్మమే. బ్రహ్మ చేత అది హుతమ్ అవుతోంది. చేరవలసినది కూడా బ్రహ్మమునే. ఇదంతా బ్రహ్మ కర్మమే". ఇదే బ్రహ్మయజ్ఞం.

భోజనం చేసేప్పుడు పిల్లలకి అర్ధం అయ్యేది.. "నేను తినే ఆహారం నాలో ఉన్న బ్రహ్మకి ఇస్తున్నాను. నేను తిన్న ఆహారాన్ని పచనం చేసే జఠరాగ్ని కూడా బ్రహ్మమే. పచన ప్రక్రియ (అరగటం) యజ్ఞం. అన్నం పచనమై ప్రాణంగా శక్తిగా పరిణామం చెందుతున్నప్పుడు అది పరబ్రహ్మానికి చెందుతున్నది' అని తలుచుకుంటూ ఉండాలి.

ఇది అభ్యాసం అయితే ఎవరికయినా ఏదైనా ఇస్తున్నప్పుడు అతడిలో ఉన్న దేవతాగణానికి ఇస్తున్నట్టు భావన చేయటం కుదురుతుంది. ఇవ్వాలన్న సంకల్పం కూడా సంకల్పరూప బ్రహ్మమే. అంటే ఇవ్వాలన్న సంకల్పం, ఇవ్వటం, ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు అన్నీ బ్రహ్మమే. కనుక మొత్తం బ్రహ్మం నుండి అర్పణంగా, హవిస్సుగా..అగ్నిగా.. యజమానిగా..  సృష్టియజ్ఞం మొదలై బ్రాహ్మతృప్తి యందే అస్తిత్వం పొందుతోంది.

అంటే, మొత్తం బ్రహ్మమే. ఈ బ్రహ్మము సృష్టి చేసే చతుర్ముఖబ్రహ్మ కాదు. ఆయనని కూడా సృష్టించిన పరబ్రహ్మము. ఎవ్వరికీ తెలియకుండానే, అందరి చేత సమగ్రంగా నిర్వహించబడుతూ, అందరిలోనూ అంతర్యామిగా వ్యవహరిస్తున్న సృష్టి యజ్ఞం ఎవరికీ తెలియకపోయినా తనంతట తానే ప్రవర్తిస్తూ ఉంది కనుక అది బ్రహ్మయజ్ఞం అనబడుతోంది. దానితో అనుసంధానమై చేసే పనులు బ్రహ్మానుభవానికి కారణమౌతాయి.

దీనికొక చక్కని ఉదాహరణ మనం తీసుకునే ఆహారం, తద్వారా ప్రాణాలు నిలబడటం. భూమిలో సారం ఉన్నదని దానికైనా తెలుసా? తన వల్ల విత్తనాలు మొలకెత్తుతాయని వర్షానికి తెలుసా? తన నుండి అంకురంగా పొటమరించేది ఏమిటో విత్తనానికి తెలియదు. తన నుండి ఎన్నో గింజలు ఎట్లా వస్తాయో ఆ అంకురానికి తెలియదు. తాము ఆహారమై ప్రాణాలని ఎట్లా నిలబెడతాయో ఆ గింజలకి తెలియదు. అసలు పంట పండించాలనే సంకల్పం మనిషికి ఎట్లా కలిగిందో ఎప్పుడైనా ఆలోచించామా? తెలియకుండా జరిగిపోయే సృష్టి యజ్ఞమే బ్రహ్మయజ్ఞం.

'ఈ బ్రహ్మయజ్ఞాన్ని అంటే సృష్టి యజ్ఞాన్ని చూసి మానవులు అనుకరించి చేస్తున్న యజ్ఞాలు ఎన్నో. భూమి, నీరు, నిప్పు, గాలి మొదలైన రూపాలలో జీవుల మనుగడకి సహకరించే శక్తులయిన దేవతలని ఉద్దేశించి చేసేది దేవయజ్ఞం అనుకుంటారు కొందరు. అవి మలినం కాకుండా చూడటం, మెరుగుపరచి ఇతరుల కోసం వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచటం ద్వారా ఆరాధించటం ఉత్తమమైన దేవయజ్ఞం.

మరికొంతమంది యజ్ఞంతోనే యజ్ఞాన్ని ఆరాధిస్తారట. అంటే, జ్ఞానం అనే అగ్నిలో ...జ్ఞానం వల్ల తమలో వెలిగిన జ్ఞానసంపదని తోటివారిలో ఉన్న జ్ఞానానికి సమర్పించటం. సద్గ్రంథ పఠనం, బోధనం, రచించి పాఠకులలో ఉన్న యజ్ఞమూర్తికి యజ్ఞంగా సమర్పించటం మొదలైనవి జ్ఞాన యజ్ఞంలోని పద్ధతులు. 

కొంతమంది శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే తన్యాత్రలని ఇంద్రియాలనే అగ్నిలో హవిస్సులుగా సమర్పించి యజ్ఞం చేస్తారు. మరికొందరు పంచేంద్రియ ప్రవృత్తులని ధ్యానమార్గంలో నియమం అనే అగ్నిలో హోమం చేస్తారు. కొద్దిమంది వస్తు సంపదని యజ్ఞం చేస్తున్నారు. తాము పండించిన పంటని, పాడిని, తయారుచేసిన వస్తువులని ఎవరికి వారు మాత్రమే అనుభవించరు కదా. కొందరు తపోయజ్ఞం ఆచరిస్తే, వేరే కొందరు యజ్ఞార్థం యోగాభ్యాసం,ప్రాణాయామం వంటివి చేస్తారు. లోక శ్రేయస్సు కోసంచేసేది ఏది అయినా యజ్ఞమే.


–వెలుగు, లైఫ్​–