నీతూ బిష్త్ (Neetu L Bisht).. ఉత్తరాఖండ్‌లోని కర్చులిలో 1997 డిసెంబర్ 16న పుట్టింది. తల్లి, మోహిని బిష్త్, తండ్రి ప్రతాప్ బిష్త్. వాళ్ల నాన్న రాష్ట్రపతి భవన్లో ఉద్యోగం చేసేవాడు. దాంతో న్యూఢిల్లీకి మకాం మార్చాడు. కొన్నాళ్లు అంతా బాగానే ఉంది. కానీ.. నీతూకి 11 సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి ప్రతాప్ సెరిబ్రల్ హెమరేజ్‌తో చనిపోయాడు. దాంతో.. పిల్లల బాధ్యత తల్లి మీదే పడింది. కుటుంబానికి పెద్ద బిడ్డగా నీతూ కూడా కుటుంబ బాధ్యతలను పంచుకుంది.
నీతూకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. ఆమె న్యూ ఢిల్లీలోని డా. రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ స్కూల్‌లో చదువుకుంది. ఆ తర్వాత కష్టపడి మోడల్‌గా ఎదిగింది. వ్లాగర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా, ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌గా, వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకుంది.
నీతాది మధ్యతరగతి కుటుంబం.. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. కుటుంబ బాధ్యతలన్నీ తల్లిపైనే పడ్డాయి. ఆమెకు చేదోడువాదోడుగా ఉండేందుకు నీతా కూడా సంపాదించాలి అనుకుంది. చిన్న ఉద్యోగంలో చేరింది. కానీ.. ఆమెకు టిక్‌టాక్‌లో ఫాలోయింగ్ రావడంతో సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయింది. దాంతో మోడలింగ్, కమర్షియల్ యాడ్స్ అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు కోట్ల మంది అభిమానంతోపాటు కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.
సోషల్ మీడియా..
నీతూ బిష్త్ ఒక చిన్న ఉద్యోగంతో తన కెరీర్‌ని మొదలుపెట్టింది. కానీ.. ఎప్పటికప్పుడు మారుతున్న సోషల్ మీడియా ప్రపంచంలో అదృష్టం ఎవరిని ఎలా వరిస్తుందో ఊహించలేం. నీతూ జీవితంలో కూడా అలాంటిదే జరిగింది. ఆమె 2018లో షార్ట్–ఫామ్ వీడియో ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో వీడియోలు చేసింది. అదే ఆమె సోషల్ మీడియాలో వేసిన మొదటి అడుగు. చాలా తక్కువ రోజుల్లోనే ఆమెకు ఫాలోవర్స్ బాగా పెరిగారు. కానీ.. అంతలోనే మన దేశంలో టిక్‌టాక్‌ని బ్యాన్ చేశారు. అయినా.. నీతూ నిరాశపడలేదు.
ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన చానెల్ ‘నీతూ బిష్త్’ని 2011లోనే మొదలుపెట్టినా.. టిక్‌టాక్ బ్యాన్ అయినప్పటినుంచి ఎక్కువగా వీడియోలు అప్లోడ్ చేస్తోంది. చూస్తుండగానే యూట్యూబ్‌లో కూడా సబ్స్క్రయిబర్స్ని సంపాదించుకుంది. దాంతో ఆమె ఎక్కడికి వెళ్లినా గుర్తుపట్టి సెల్ఫీలు తీసుకునేవాళ్లు. ఆ గుర్తింపుని చూసి సోషల్ మీడియానే కెరీర్‌గా ఎంచుకుంది. ఆమె చేసే కంటెంట్‌కి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. చాలా తక్కువ టైంలోనే 10 మిలియన్ సబ్స్క్రయిబర్ మార్క్‌ని రీచ్ అయ్యింది.
ప్రేమ.. పెండ్లి
నీతూ బిష్త్ మోడల్‌గా మారిన తర్వాత ప్రొఫెషనల్ క్రికెటర్ లఖన్ అర్జున్ రావత్‌తో ప్రేమలో పడింది. 2021 జనవరి 15న నిశ్చితార్థం చేసుకుంటున్నట్టు ప్రకటించింది. తన సోషల్ మీడియా పేజీల్లో వాళ్ల ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేసింది. ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 27న వాళ్ల పెండ్లి జరిగింది.
ఆ తర్వాత కూడా మోడలింగ్ యూట్యూబ్‌లో వీడియోలు చేయడం కంటిన్యూ చేస్తోంది. నీతూ బ్యూటీ ప్రొడక్ట్స్ ప్రమోషన్స్‌తోపాటు కమర్షియల్ యాడ్స్ కూడా చేసింది. పంజాబీ పాట ‘‘బద్నామి’’లాంటి మ్యూజిక్ వీడియోల్లో కూడా కనిపించింది. ముఖ్యంగా బింగో, లివ్‌ప్యూర్, అమెజాన్, కోస్టా, పాంటలూన్స్‌తో యాడ్స్ ఆమెకు బాగా పేరు తీసుకొచ్చాయి.
31 మిలియన్లు
నీతూ చానెల్లో ఎక్కువగా ట్రావెల్, ఫ్యాషన్ వ్లాగ్స్తోపాటు కామెడీ వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. అప్పుడప్పుడు బ్యూటీ టిప్స్ కూడా చెప్తుంటుంది. కాకపోతే.. టిక్‌టాక్ లాగా యూట్యూబ్‌లో కూడా షార్ట్ ఫార్మాట్ వీడియోలనే పోస్ట్ చేస్తుంటుంది. ఇప్పటివరకు ఆమె 2,900 వీడియోలు అప్లోడ్ చేస్తే.. వాటిలో పెద్ద వీడియోలు 8 మాత్రమే ఉన్నాయి. ఆమెకు ఇంతలా గుర్తింపు దక్కడానికి కారణం కూడా షార్ట్ వీడియోలే.
ఇప్పటివరకు నీతూ బిష్త్ చానెల్‌ను 31.6 మిలియన్ల మంది సబ్స్క్రయిబ్ చేసుకున్నారు. ఆమె చేసిన ఒక షార్ట్ వీడియోకు ఏకంగా 590 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. వంద మిలియన్ల వ్యూస్ దాటిన వీడియోలు చానెల్లో చాలానే ఉన్నాయి. ఆమెకు ఫేస్బుక్లో 4 మిలియన్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 4.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.