పతంజలి కొరొనిల్ కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్న WHO

కరోనా వైరస్ ను అరికట్టి… రోగ నిరోధక శక్తిని ఈ మెడిసిన్ పెంచుతుందంటూ ప్రచారం చేసుకుంటున్న పతంజలి సంస్థ వారి కొరొనిల్ మరో వివాదంలో చిక్కుకుంది. యోగా గురు బాబా రాందేవ్‌ ప్రమోట్‌ చేసిన ఈ మెడిసిన్‌ సర్టిఫికేట్‌పై గందరగోళం నెలకొంది. పతంజలికి సంబంధించి కొరొనిల్‌పై ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పడం పతంజలిని షాక్ గురిచేసింది. తమ మందు ఆయుర్వేద మూలికలతో తయారైనదని, ఇది కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా నివారిస్తుందని రాందేవ్‌ బాబా చెబుతున్నారు. ఈనెల 19న కేంద్ర మంత్రులు హర్షవర్ధన్‌, నితిన్‌ గడ్కరీ హాజరైన ఓ కార్యక్రమంలో దీనిని ఫస్ట్‌ ఎవిడెన్స్‌ బెస్ట్‌ మెడిసిన్‌ ఫర్‌ కోవిడ్‌-19 మందుగా తెలిపారు.

కరోనా వైరస్‌కు  మొదటి సమర్ధత మెడిసిన్‌ అని వివరించారు రాందేవ్ బాబా. దీనికి ఫార్మాస్యూటికల్‌ ప్రొడక్ట్‌గా సర్టిఫికేట్‌ లభించిందని, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన గుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్రాక్టీసెస్‌ విభాగం గుర్తించిందన్నారు.

అయితే..దీనిపై స్పందించిన WHO తాము దీనిని రివ్యూ చేయలేదని, అలాగే సాంప్రదాయక మందుగా సర్టిఫై చేయలేదని స్పష్టం చేసింది. కరోనా చికిత్సకు సంబంధించి తాము ఎలాంటి మెడిసిన్‌ను సమీక్షించలేదని ట్వీట్ చేసింది.