ఆక్సిజన్ అవసరం 200 మందిలో ఒక్కరికే

  • ఒమిక్రాన్​ బాధితుల్లో తీవ్రత తక్కువే: ఏహెచ్​పీఐ
  • ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న పేషెంట్ల డేటా విడుదల
  • మహారాష్ట్ర, ఢిల్లీల్లో 10%  బెడ్లే నిండాయని వెల్లడి  
  • లంగ్స్​పై ఒమిక్రాన్​ ప్రభావం లేదన్న డబ్ల్యూహెచ్​వో
  • కేవలం గొంతు, ముక్కు, శ్వాసనాళంపైనే ప్రభావమని వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్​ కేసులు పెరుగుతున్నా ఆందోళన చెందాల్సిన పనిలేదని నిపుణులు చెప్తున్నారు. కొత్త వేరియంట్​తో ఆస్పత్రి పాలయ్యే ముప్పు తక్కువగానే ఉందని, ఆక్సిజన్​ అవసరం కొద్ది మందికే ఉంటోందని అంటున్నారు. అసోసియేషన్​ ఆఫ్​ హెల్త్​కేర్​ ప్రొవైడర్స్​ ఇండియా (ఏహెచ్​పీఐ).. దేశంలో ఒమిక్రాన్​తో ఆస్పత్రి పాలవుతున్న వారి డేటాను విడుదల చేసింది. దేశంలోని ప్రైవేట్​ ఆస్పత్రుల్లో చేరిన ప్రతి 200 మంది కరోనా పేషెంట్లలో ఒక్కరికే ఆక్సిజన్​ అవసరమవుతోందని ఆ డేటాలో ఏహెచ్​పీఐ పేర్కొంది. కొత్త వేరియంట్​ కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్ర, ఢిల్లీల్లో బెడ్ల అవసరం 9 నుంచి 10 శాతమే ఉందని వెల్లడించింది. మహారాష్ట్రలో 89 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయని, 91 శాతం మంది పేషెంట్లలో లక్షణాలే లేవని తెలిపింది. ముంబైలోని ప్రభుత్వ దవాఖాన్లలో 30,565 బెడ్లుండగా.. కేవలం 12.2 శాతం, 2,720 ఐసీయూ బెడ్లలో 14 శాతం మాత్రమే నిండినట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో 5,192 బెడ్లకుగానూ 838 (16 శాతం) నిండాయి. 180 ఐసీయూ బెడ్లు ఫుల్​ అయ్యాయి. 

ఒమిక్రాన్​ తీవ్రత తక్కువే: డబ్ల్యూహెచ్​వో
ఒమిక్రాన్​ తీవ్రత తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) కూడా వెల్లడించింది. అప్పర్​ రెస్పిరేటరీ ట్రాక్ట్​(ముక్కు, గొంతు, శ్వాసనాళం‌‌‌‌)పైనే ఒమిక్రాన్​ ప్రభావం ఉందని, లంగ్స్​పై ఎఫెక్ట్​ లేదని డబ్ల్యూహెచ్​వో ఇన్సిడెంట్​ మేనేజర్​ అబ్ది మహమూద్​ చెప్పారు. దీంతో పాత వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్​ లక్షణాలు, ఆ లక్షణాల తీవ్రత తక్కువగా ఉందని, న్యుమోనియా ముప్పు కూడా తక్కువేనని పేర్కొన్నారు. ఇది ప్రపంచానికి చాలా మంచి విషయమన్నారు. అయితే, ఒమిక్రాన్​ సోకే వేగం ఎక్కువగా ఉందని,  కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయని చెప్పారు. వ్యాక్సినేషన్​ ఎక్కువగా జరగని, స్లోగా జరుగుతున్న దేశాలకు దాని వల్ల ముప్పేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఒమిక్రాన్​కు ప్రత్యేక వ్యాక్సిన్​ గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం తొందరపాటవుతుందన్నారు. వ్యాపారం కోణంలో ఆలోచించకూడదని, ప్రభుత్వాలు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని అబ్ది మహమూద్​ సూచించారు.

ఢిల్లీలోనూ తక్కువే
ఢిల్లీలో 9,029 బెడ్లలో 420 మాత్రమే నిండాయని ఏహెచ్​పీఐ డేటాలో వెల్లడించింది. 168 మంది పేషెంట్లు ఆక్సిజన్​ సపోర్ట్​పై ఉన్నారని, కేవలం 14 మందికే వెంటిలేటర్​పై ట్రీట్​మెంట్​ చేస్తున్నారని వివరించింది. ప్రస్తుతం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్​ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 568 కేసులు నమోదు కాగా.. 259 మంది పేషెంట్లు ఇప్పటికే డిశ్చార్జ్​ అయ్యారు. ఢిల్లీలో ఇప్పటిదాకా 382 మంది ఒమిక్రాన్​ బారిన పడ్డారు.