టీఆర్ఎస్ గూటికి నిప్పు పెట్టిందెవరు

టీఆర్ఎస్ గూటికి అగ్గి అంటుకుందా? ఈ అగ్గి పెట్టింది కౌశిక్ రెడ్డినా? లేక స్వయంగా కేసీఆరా? యజ్ఞం పూర్తయినాక మొత్తం  కాలబెట్టే పద్ధతి ఒకటుంది. కేసీఆర్ ఇలాంటి యజ్ఞాలు చాలా చేశారు. అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ కు నిప్పు పెట్టబోయి మిస్ ఫైర్ అయి  టీఆర్ఎస్ కొంపకు చిచ్చు పెట్టుకున్నట్టయిందా?  కాలం కలిసి రాకపోతే కట్టే పామై కరుస్తదంటరు. ఇప్పుడూ అదే పరిస్థితి కనిపిస్తోంది. నా చిన్నపుడు ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే దానికి బాధ్యత తనదే అని ఆనాటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. అలాంటిది తన సహచర మంత్రి అక్రమాలు చేస్తే అందుకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి గదా? ఈటల కన్నా ముందు ముఖ్యమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు, మేధావులు అడగాలని తోచనంతగా కేసీఆర్ ఆకర్షణలో పడిపోయారా? తన కేబినెట్​ సభ్యుడికి సీఎం బాధ్యత వహించనవసరం లేదా? ప్రశ్నించకపోతే, చర్చించకపోతే జ్ఞానం కూడా అజ్ఞానంగా మారి గడ్డ కడుతుంది. ఇలా గడ్డ కట్టిన జ్ఞానాన్ని ప్రశ్నించి అటూఇటూ ఊపినప్పుడే కాస్త తాజాదనం సంపాదించుకుంటుంది. అందుకే కొన్ని ప్రశ్నలు.

ఉద్యమకారులను, సీనియర్లను, సాహితీవేత్తలను, కళాకారులను కాదని గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం సమర్థనీయం కాదు. అతను ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి. వయసు కూడా చాలా తక్కువ. స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారట. హవ్వ ఎంత విపరీతం? మానుకోటలో రాళ్లు విసిరి ఉద్యమకారులను కసితీరా బాదిన కౌశిక్ రెడ్డిని ప్రజలు ఎలా క్షమిస్తారనుకున్నారు? కౌశిక్ రెడ్డి ఉద్యమ ద్రోహి. కౌశిక్ రెడ్డిని ఏ పద్ధతిలో సమర్థిస్తారు? పదవులు నిలబెట్టుకోవడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని దీని భావం కాదా? కనీసం 20 మంది సాహితీవేత్తలు, కళాకారులు, మేధావులు ఈ ఎమ్మెల్సీకై నిరీక్షించారు. వారిలో పది మందికి స్వయంగా కేసీఆర్ ఓపెన్​గా మీకే అని ప్రకటించారు. స్పీకర్ మధుసూదనాచారి సేవలు అమూల్యమైనవి. కవి జయరాజు, తననే అంటిపెట్టుకుని ఉన్న దేశపతి శ్రీనివాస్ వంటి వారిని కాదని కౌశిక్ రెడ్డికి ఇచ్చారు. ఆయన వివాదాస్పదుడు. ఊగిసలాట మనిషి. పార్టీలో చేరి కొద్దిరోజులే అయింది. హుజూరాబాద్​లో ఆయనకు వచ్చిన ఓట్లు కాంగ్రెస్ తరఫున వచ్చినవే. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే పది వేలు దాటడం అనుమానమే. 
ఈటలపై ఇంత పగ దేనికి?
అసలు ఈటల రాజేందర్ ను ఓడించాలని ఇంత పంతం, పగ దేనికి? తన ముందు ఎవరు తల ఎత్తినా నామరూపాలు లేకుండా చేస్తానని హెచ్చరించడానికా? మీతో విభేదిస్తే మీకు చేసిన సేవంతా మరిచి పగబడతారా? అదే తన సహచరులు తప్పు చేస్తే కడుపులో పెట్టి కాపాడుకుంటారు. జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి వంటి వారిని ఎన్నిసార్లు కడుపులో దాచుకోలేదు? గులాబీ జెండాలో మాకు హక్కుంది అని మాట్లాడితే తప్పయితదా? గులాబీ జెండాను తెలంగాణ ప్రజలు త్యాగాలకు, ఆకాంక్షలకు ప్రతినిధిగా భావించారు. మాది అనే మాట మీకు కష్టమైందా? అంటే పార్టీని, ఉద్యమాన్ని, త్యాగాలను, కీర్తి ప్రతిష్టలను మీ వ్యక్తిగత ఆస్తిగా భావిస్తున్నారా? ఇప్పటికే ఎంతోమంది ఉద్యమ ద్రోహులను అక్కున చేర్చుకున్నారు. ఉద్యమ నాయకులను దూరం కొట్టారు. పొమ్మనలేక పొగబెట్టారు. పైగా మమ్మల్ని వదిలి వెళ్లిన వారు అనామకులైపోయారని అదేదో గొప్ప అన్నట్టు ప్రకటిస్తున్నారు. ఏ వ్యాపారంలోనైనా, సంసారంలోనైనా విడిపోతే.. విడిపోయినా చల్లగ బతుకు అని కోరుకుంటారా? సర్వనాశనం కావాలని కోరుకుంటారా? ఇంత శాడిజం మీలో ఎలా ప్రవేశించింది? అధికారం వల్ల వచ్చిన అహంకారమా? ప్రజలు తమ ఓట్లు వేస్తే మీరు గెలిచారు. ఓట్లు వేయకపోతే మీకీ అధికారం ఎక్కడిది? ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేసి ఇది రాజకీయమని సమర్థించేవారు ఉద్యమ ద్రోహులు, అవకాశవాదులు, స్వార్థపరులు తప్ప తెలంగాణ శ్రేయస్సు కోరేవారు కాదు. 
1996 నుంచి బహుజనుల చేతిలో ఉద్యమం
దేనికైనా సమయం రావాలి. ఎవరికైనా కొంత సమయం ఇవ్వాలి. గాదె ఇన్నయ్య, వి.ప్రకాశ్, ప్రొఫెసర్​జయశంకర్ సార్​ వంటి వారు కలిసి 1996 నుంచి నడుస్తున్న ఉద్యమంలోకి తీసుకొచ్చారు. 1996 నుంచి తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ, నక్సలైట్​ ఉద్యమకారులు, 1969 నాటి ఉద్యమకారులు, విద్యార్థులతోపాటు ఆకుల భూమయ్య, వైకుంఠం, మారోజు వీరన్న, ఈటల రాజేందర్, కేశవరావు జాదవ్, గద్దర్, బెల్లి లలిత, కాళోజీ, రాపోలు ఆనంద భాస్కర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆలె నరేంద్ర, నాట్యకళ ప్రభాకర్, ప్రొ.లక్ష్మణ్, ప్రొఫెసర్ మధుసూదనరెడ్డి, హరనాథ్, పాశం యాదగిరి, డా.చిరంజీవి, అందెశ్రీ, గూడ అంజయ్య, మల్లేపల్లి లక్ష్మయ్య, చెరుకు సుధాకర్, గోపీనాథ్, నందిని సిధారెడ్డి, రత్నమాల, రసమయి బాలకిషన్, నేను ఇలా ఎందరో పుల్ల పుల్ల ఏరి ఉద్యమానికి ఒక రూపం ఇచ్చారు. జవసత్వాలు అందించారు. ఎన్నో తాత్విక చర్చలు చేసి భువనగిరి, వరంగల్, కామారెడ్డి వంటి సభల్లో తీర్మానాలు ప్రకటించారు. అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతో వీరందరిపై వందలాది లాఠీలు విరిగాయి. తలలు పగిలాయి. కేసులు, జైళ్ల పాలయ్యారు. అప్పుడు మీరెక్కడున్నారు ఆ చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించే సహచరులుగా మంత్రి పదవిలో ఉన్నారు. మంత్రి పదవి నుంచి తప్పించి డిప్యూటీ స్పీకర్ గా కూర్చోబెట్టడంతో అసంతృప్తితో ఉన్న కేసీఆర్ ను ప్రకాశ్, ఇన్నయ్య, జయశంకర్ ఉద్యమంలోకి తెచ్చారు. 1996 నుంచి బహుజనుల నాయకత్వంలో సాగుతున్న ఉద్యమాన్ని వారి చేతుల నుంచి కేసీఆర్  చేతిలో పెట్టారు.
కేసీఆర్​ లేకుంటే 2005 లోనే రాష్ట్రం వచ్చేది
ఉద్యమంలో కేసీఆర్ లేకపోతే 2005లోనే తెలంగాణ వచ్చేది. ఎందుకు ఆలస్యమైందో చాలా మందికి తెలీదు. బహుళ నాయకత్వంలో ఉన్న ఉద్యమంలో తన స్థానం, నాయకత్వం స్థిరపడేదాక అనేక మలుపులు తిప్పారు. అందుకే ఎప్పటికప్పుడు విద్యార్థులు, సామాజిక ఉద్యమకారులు ఉద్యమాన్ని కొనసాగిస్తూ వచ్చారు. 2004లో కేంద్రం, రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాల్లో చేరడం ఉద్యమాన్ని, రాష్ట్ర ఏర్పాటును వాయిదా వేయడానికి, తమ సామాజిక వర్గం పుంజుకోవడానికి, మిగతా నాయకత్వాన్ని వెనక్కి నెట్టడానికి వేసిన ఎత్తుల గురించి మరోసారి చెప్తాను. 1996 నుంచి మేము, కాంగ్రెస్, బీజేపీ, ఇంద్రారెడ్డి చేసిన ఉద్యమాలు, పార్టీ చరిత్ర గురించి యువతరానికి చెప్పాల్సిన సమయం వచ్చింది. నిజాయితీ, త్యాగాలకు మారు పేరైన వారిని వెనక్కి నెట్టి ఉద్యమ ద్రోహులను నెత్తికెక్కించుకుంటారా? ఇలాంటివి చూస్తూ నోరు మూసుకునే వారు ఉద్యమ ద్రోహులు, ప్రజాద్రోహులు. చైతన్యంతో నిలదీసేవాడే నిజమైన ఉద్యమకారుడు. విమర్శిస్తే పదవులు పోతాయని నోరు మూసుకుని కూర్చున్న వాళ్లంతా అవకాశవాదులే, స్వార్థపరులే.

‘హుజూరాబాద్’ ఇప్పుడు జాతీయ సమస్య
3 వేల నామినేటెడ్ పోస్టులు నింపకుండా కేసీఆర్ చేస్తున్నదేమిటి? కేసీఆర్​ కుటుంబానికి అన్నీ సమకూరితే చాలా? నిలదీయడం మేధావులు, కళాకారులు, ప్రజల కర్తవ్యం. మేము టీఆర్ఎస్ నాయకత్వానికి అనేక ప్రశ్నలు సంధిస్తున్నాం. వాటికి టీఆర్ఎస్ అధిష్టానం, కేసీఆర్ స్పందించి మాట్లాడితే అది వారికే ప్రయోజనం. కేసీఆర్ స్వయంగా తెచ్చిన ఉపద్రవం హుజూరాబాద్ ఉప ఎన్నిక. తానే తెచ్చి తానే భయపడిపోతూ కోట్లాది ప్రజా ధనాన్ని వెదజల్లుతూ రోజుకో కుప్పిగంతు వేస్తున్నారు. అనేక మలుపులు తిరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యే సీటుకు సంబంధించినది కాదు. ఇప్పుడు అది కేసీఆర్, ఈటలకు మధ్య గెలుపు ఓటముల సమస్య కాదు. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక జాతీయ సమస్య. బడుగు బలహీన వర్గాల శక్తిసామర్థ్యాలకు, అహంకారంతో మిమ్మల్ని వాడుకొని తొక్కేయగలం అనే చిన్న సామాజికవర్గానికి మధ్య యుద్ధం. కేసీఆర్, టీఆర్ఎస్ తమ సర్వశక్తులతో గోదాలోకి దిగిన యుద్ధం. మొత్తం సామాజిక శక్తులు ఈటల వెంట ఒక్కటై నిలిచిన యుద్ధం. అంతేకాదు మొదటిసారి బీజేపీ మత ప్రసక్తి లేని పోటీతో ముందుకుసాగుతున్న జాతీయ యుద్ధం. టీఆర్ఎస్, ప్రభుత్వ బలాలను మోహరించి దీనిని చావు బతుకుల సమస్యగా మార్చిందెవరు? టీఆర్ఎస్ గూడుకు నిప్పు పెట్టిందెవరు? మారాల్సిందెవరు? ప్రజలా? అధిష్టానమా?
కేసీఆర్​కు ఎంత కృతజ్ఞత ఉంది?
ఈటలను ఓడించాలని ఎన్ని స్కీములు ముందుకు తెచ్చారు? ఎంత మంది ఎమ్మెల్యేలను, మంత్రులను, అధికారులను, విద్యార్థి నాయకులను గెదుముతున్నారు? ఇదంతా చూసి దమ్ముంటే మీరే పోటీకి దిగండి అంటూ సవాల్​ విసిరాడు మీ నిన్నటి సహచరుడు. ఇలా మాటలు పడడం మంచి చేస్తుందా? ఓడించాలని చేసే మీ ప్రయత్నాల ఫలితం మీ చరిత్రకు శోభను ఇస్తుందా? మీతో కలిసి నడిచిన సహచరులకు పదవి ఇస్తే మీకు చెంచాగిరి చేయాలా? పదవి ఇచ్చినంత మాత్రాన బానిసత్వం చేస్తారా? కృతజ్ఞతగా ఉండాలని మీరు అనుకోవచ్చు. కానీ సహచరులు లేకపోతే  మీరెక్కడ? కృతజ్ఞతగా ఉండటమనేది కేసీఆర్ కు వర్తించదా? తనకు మేలు చేసిన వారి పట్ల కేసీఆర్ కు ఎంత కృతజ్ఞత ఉంది? చర్చకు సిద్ధమా? వేలాది మంది ఉద్యమకారులు, విద్యార్థులు, కళాకారులు, కార్మికులు, జర్నలిస్టులు, రాజకీయ నేతలు ఎన్నో త్యాగాలు చేస్తేనే కదా మీరీ స్థితికి వచ్చింది? వారి పట్ల మీ కృతజ్ఞత ఏది?

– బీఎస్‌ రాములు

సామాజిక తత్వవేత్త