మేడ్చల్ లో మెరిసేదెవరు ?.. ​ పోటా పోటీగా బీఆర్ఎస్​, కాంగ్రెస్ ప్రచారం

  • హస్తగతం చేసుకుంటామంటున్న కాంగ్రెస్​ అభ్యర్థి వజ్రేశ్​​
  • క్యాడర్ లేకున్నా ఉనికి కోసం బీజేపీ అభ్యర్థి సుదర్శన్​రెడ్డి ప్రయత్నాలు

హైదరాబాద్, వెలుగు: పారిశ్రామిక వాడలు నెలవైన ప్రాంతం మేడ్చల్. ఈ సెగ్మెంట్​లో పట్టణ ఓటర్లు, వలస కూలీలు నివసిస్తుంటారు. ఇందులో అధిక శాతం అర్బన్​ ఓటర్లు ఉండగా.. వీరిలో బీసీ, ఎస్సీ వర్గాల ఓట్లే  ఎక్కువగా ఉంటాయి.  ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధించాలన్నా ఆయా వర్గాలనే ప్రసన్నంచేసుకోవాల్సి ఉంటుంది. మేడ్చల్​లో  పరిధిలో అధిక భాగం అర్బన్​ఏరియా ఉండగా... దీనిలో జవహర్​నగర్​, బోడుప్పల్, పీర్జాదిగూడ మూడు కార్పొరేషన్లతో పాటు దమ్మాయిగూడ, నాగారం, తూంకుంట, గుండ్ల పోచంపల్లి, మేడ్చల్, ఘట్​కేసర్, పోచారం మున్సిపాలిటీలు భాగంగా ఉన్నాయి. అదేవిధంగా మేడ్చల్, చర్లపల్లి, కీసర, ఘట్​కేసర్, గుండ్ల పోచారం వంటి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఉండగా ఆయా ప్రాంతాల్లో వలస కూలీలు ఎక్కువగా నివసిస్తుంటారు. ఘట్​కేసర్, శామీర్​పేట, మేడ్చల్​వంటి ప్రాంతాల్లో ముస్లిం మైనార్టీ ఓటర్లు, జవహర్​నగర్, బోడుప్పల్, పీర్జాది గూడ కార్పొరేషన్ల పరిధిలో సంపన్న ఓటర్లు ఉన్నారు. సెగ్మెంట్​లో ప్రధానంగా మేడ్చల్, శామీర్​పేట, మూడుచింతలపల్లి, కీసర, ఘట్​కేసర్, కాప్రా, మేడిపల్లి రెవెన్యూ మండలాలు ఉన్నాయి.  ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి, కాంగ్రెస్ నుంచి వజ్రేశ్ యాదవ్​, బీజేపీ నుంచి సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. అయితే... బీఆర్ఎస్​, కాంగ్రెస్​ పోటా పోటీగా ఉన్నాయి.

మళ్లీ తననే ఆశీర్వదిస్తారంటున్న మల్లారెడ్డి

2018లో బీఆర్ఎస్​ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓటర్లు తననే ఆశీర్వదిస్తారనే విశ్వాసంతో ఆయన ఉన్నారు. మంత్రిగా సెగ్మెంట్ అభివృద్ధికి చేసిన పనులే తనను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్​ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తనకు లాభిస్తాయని ఆయన భావిస్తున్నారు. మల్లారెడ్డి మైనస్​ను చూస్తే.. సెగ్మెంట్ అభివృద్ధిని పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన భూకబ్జాలు చేశారని, వ్యాపారులు, రియల్​ఎస్టేట్​వ్యాపారులపై బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు భారీగానే వస్తున్నాయి.

బీఆర్ఎస్​ వ్యతిరేకతపైనే కాంగ్రెస్ ​ఆశలు

బీఆర్ఎస్​పై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని కాంగ్రెస్​అభ్యర్థి తోటకూర వజ్రేశ్​యాదవ్ ​ధీమాతో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆయన  టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్​లో చేరారు. ప్రస్తుతం ఆయనకు టికెట్ రావడంతో పోటీలో నిలిచారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లో చేరారు. పార్టీ సీనియర్ ​నేత హరివర్ధన్​రెడ్డితో కూడా వజ్రేశ్​కు మంచి సంబంధాలున్నాయి. ముగ్గురు నేతలు కలిసి పని చేస్తుండడంతో ప్రజల్లో పెరుగుతున్న ఆదరణతో లాభిస్తుందంటున్నారు. మరోవైపు పార్టీలోని కొందరు అసంతృప్తులు ఆయను గెలుపు కోసం పని చేస్తారా? అనే ప్రశ్న తలెత్తుతున్నది.

క్యాడర్ లేక వెనకబడింది

సెగ్మెంట్​లో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్​ మధ్య పోటీ హోరాహోరీ ఉండగా... బీజేపీ కాస్త వెనకబడి ఉందని చెప్పొచ్చు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేసే పథకాలు తనను గెలిపిస్తాయని ఆశాభావంతో ఉన్నారు. ప్రధాని మోదీ చరిష్మా కూడా తనకు కలిసి వచ్చే అంశమని అంటున్నారు. బీఆర్ఎస్​ ప్రభుత్వ వైఫల్యాలు కూడా తనకు అనుకూలంగా మారుతాయంటున్నారు.  పార్టీకి పెద్దగా క్యాడర్​ లేక పోవడం నష్టంగా చెప్పొచ్చు.

ALSO READ : కేసీఆర్​ దమ్ముంటే రాజకీయంగా కొట్లాడు .. వివేక్ వెంకటస్వామి సవాల్

సెగ్మెంట్ ఓటర్లు ఇలా..

మొత్తం          5,95,382
పురుషులు     3,06,854
మహిళలు        2,88,486
ట్రాన్స్ జెండర్లు     42