గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ నాటకంలో గిరీశం పాత్రచేత ఒక మాట చెప్పించారు. ‘పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్’ అన్న ఆ డైలాగ్ ఇవ్వాల్టికి పండిత, పామరులు గుర్తుచేస్తూనే ఉంటారు. కానీ, పొగ తాగడం వల్ల కలిగే నష్టాలను ముందే పసిగట్టి ఉంటే, ఆయన ఈ డైలాగ్‌ను మరోలా చెప్పించేవారేమో. ఎందుకంటే ఇప్పుడు పొగ తాగకపోవడమే గొప్ప ఎడ్యుకేషన్. అది ఇప్పుడు అందరికీ అవసరం. లేకపోతే మన బతుకులు పొగచూరిపోతాయన్నది వాస్తవం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారం టుబాకో ఉపయోగిస్తున్న వారిలో 750 మిలియన్ల మంది దానికి స్వస్తి పలకాలని భావిస్తున్నారట. ఈ సంఖ్య మరింత పెరిగేలా ప్రతి ఏటా మే 31న నిర్వహించే ‘ప్రపంచ టుబాకో వ్యతిరేక దినోత్సవం’ ఒక ప్రేరణ కావాలి. స్మోకింగ్ వల్ల కలిగే నష్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, సిగరెట్ పొగ వల్ల ఇతరులకు కలిగే నష్టాలను తెలియజేయడం, పొగాకు ఉత్పత్తుల పట్ల ఆకర్షితులు కావద్దని ప్రజలకు సందేశమివ్వాలి. అందులో భాగంగానే 1987లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకోవాలని నిర్ణయించింది.
ఇండియా నుంచి..
టుబాకో పుట్టుక చరిత్రలోకి వెళ్తే.. 1490లో భారత సముద్ర తీర ప్రాంతాల్లో పోర్చుగీసు నావికులు పొగాకు మొక్కలను గుర్తించారు. మనదేశం సుగంధ ద్రవ్యాలకు వ్యాపార కేంద్రంగా మారడంతో పొగాకు కూడా పోర్చుగీసు ధనాగారాన్ని నింపే సరుకు అయింది. పొగాకును తొలుత అరబిక్ వారు 'టొబక్' అనేవారు. తర్వాత అమెరికా 'టుబాకో'గా నామకరణం చేసింది. పొగాకు మొక్క భారత్ నుంచి కరేబియన్ దీవులకు వలస వెళ్తే, క్రమంగా ఆ పంట వర్జీనియా, టర్కీ, రష్యా దేశాలకు వ్యాప్తి చెందింది. పోర్చుగీసువారు 1600 సంవత్సరంలో మనదేశంలో పొగాకును వ్యాపారంగా మార్చారు.
1850లో సిగరెట్ల తయారీ
భారత గడ్డపై 1603లో బీజాపూర్ పాలకులు ఆదిల్ షా తమ రాజ్యంలో పొగాకు వాడకాన్ని ప్రవేశపెట్టారు. ఆయన 1604–05 కాలంలో మొగల్ సామ్రాజ్యాధిపతి అక్బర్‌కు పొగాకు, యురోపియన్ పైపులను బహుమతిగా పంపారు. దానిని ఆస్వాదించిన అక్బర్, ఆదిల్షాను ప్రశంసిచారట. ఆ తర్వాత రాజులు, నవాబులు, ఉన్నత వర్గాలు హుక్కా పీల్చడం అలవాటుగా మారింది. క్రమంగా సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత పొగాకు వినియోగం మరింతగా పెరిగింది. 1850లో రష్యాలోని సెయింట్ పీటర్ బర్గ్ లో పొగాకు నుంచి సిగరెట్ల తయారీకి శ్రీకారం చుట్టారు. 1906 నాటికి మనదేశంలో ఐటీసీ కంపెనీ బీహార్ లో తొలి సిగరెట్ కంపెనీని ప్రారంభించింది. అంతకు పూర్వమే ఇక్కడ బీడీ పరిశ్రమ అభివృద్ధి చెందింది. ఈ రోజు పొగాకు ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.
స్టేటస్ సింబల్ నుంచి వ్యసనంగా..
తొలుత పొగ పీల్చడం స్టేటస్ సింబల్‌గా ఉండేది. ఆ తరువాత అది మానసిక బలహీనతగా మారిపోయింది. ఈ బలహీనత ఎంతదాకా వెళ్లిందంటే, ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ మంది పొగాకు ఉత్పత్తులను వాడుతున్నారంటే అతిశయోక్తి కాదు. గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పొగరాయుళ్లు ప్రతి నిమిషానికి ఒక కోటి పది లక్షల సిగరెట్లను ఊదేస్తున్నారు. సుమారు వంద కోట్ల మందికి స్మోకింగ్ వ్యసనంగా మారింది. పొగాకు వినియోగంలో చైనా మొదటి స్థానంలో ఉంటే, ఇండియా రెండో స్థానంలో ఉంది. దీనికి యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. గ్లోబల్ అడల్డ్ టుబాకో సర్వే ప్రకారం ఇండియాలో 23 కోట్లకు పైగా పొగాకు వాడేవారు ఉన్నారు. స్మోకింగ్, పొగాకు నమలడం ప్రమాదకరమని, పొగాకులో ఏకంగా ఏడు వేల విష రసాయనాలు ఉన్నాయని, అవి 69 రకాల కేన్సర్లకు కారణమవుతున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
స్మోకింగ్ చేసేవారిపై కరోనా ప్రభావం
పొగాకు ఉత్పత్తులు అలవాటు ఉన్న వారందరూ కరోనా వైరస్ కు లక్ష్యంగా మారుతున్నారు. స్మోకింగ్ వల్ల శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారిని కరోనా కబళిస్తోంది. ఊపిరితిత్తులు బలహీన పడినవారు కరోనా వల్ల బతుకుపోరాటం చేయాల్సిన దుస్థితి దాపురించింది. వాస్తవానికి పొగాకు ఉత్పత్తులు వాడేవారు తరచూ తమ నోటిని, ముక్కును తాకుతుంటారు. ఈ అలవాటు వల్ల కరోనా వైరస్ సులభంగా సోకే అవకాశం ఉంది. హుక్కా పీల్చేవారు, గుట్కా, తంబాకు, జర్దా తినేవారు చేతులను నోటి దగ్గరకు తీసుకువెళ్లడం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉంది. పొగాకు అలవాటు ఉన్న వారు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం వల్ల వైరస్ వ్యాప్తికి కారకులుగా మారుతున్నారు. ఇప్పుడు పొగాకు అలవాటు ఉన్న వారు తక్షణం మేల్కొనాలి. ముఖ్యంగా యువకులు తమ అలవాట్లను మార్చుకోవాల్సిన సమయం ఇది.
ఆరోగ్య భారతం నిర్మిద్దాం
పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నివారిస్తే దేశంలో అనేక మరణాలకు అడ్డుకట్ట వేసిన వారవుతాం. ప్రతి ఇంట్లో పొగాకు వల్ల కలిగే నష్టాల గురించి మాట్లాడాలి. స్మోకింగ్, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల వచ్చే వ్యాధుల గురించి ప్రజలను చైతన్యపరిస్తే భవిష్యత్తులో ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడాన్ని, ఉమ్మి వేయడం, ఈ-–సిగరెట్ల వాడకాలపై నిషేధం విధించింది. ప్రధాని మోడీ మాటల్లో.. ‘‘ఈ–-సిగరెట్ లాంటి పొగాకు ఉత్పత్తులకు అలవాటుపడి యువత తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఈ బంధనాల నుంచి బయటపడాలి. పొ గాకుకు తావులేని ఆరోగ్య భారతాన్ని నిర్మించాలి.’’
ప్రాణాలు తీసేస్తోంది
వాస్తవానికి పొగాకు మన దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు గుండె జబ్బులు, కేన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. పొగాకు వాడకం వల్ల గాల్ బ్లాడర్, ఉదర, మూత్ర సంబంధిత వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అంతేకాదు, సంతానోత్పత్తి క్షీణిస్తున్నది. పుట్టబోయే పిల్లల్లో సంపూర్ణ ఆరోగ్యం కరువవుతున్నది. ప్రపంచంలో ప్రతి ఏడాది 7 మిలియన్ల మంది పొగాకు వల్ల మరణిస్తే, పాసివ్ స్మోకింగ్ వల్ల 1.20 మిలియన్ల మంది ప్రాణాలు వదులుతున్నారు. గుండెపోటుతో 16 శాతం, కేన్సర్ తో 25 శాతం, శ్వాసకోశ వ్యాధులతో 52 శాతం మంది మరణిస్తున్నారు. మనదేశంలో రోజుకు 3,500 మందిని పొగాకు పొట్టన పెట్టుకున్నదని, దేశంలోని మొత్తం మరణాల్లో ఏడు శాతం పొగాకు వల్ల సంభవిస్తున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఇటీవల వెల్లడించింది. - డాక్టర్ జె.విజయ్ కుమార్జీ, సీనియర్ స్టాఫ్ ఆర్టిస్ట్, రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో