అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా ఎవరెస్ట్ ఎక్కడం అంటే సాహసమనే చెప్పాలి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అయిన ఎవరెస్ట్‌ని 1953లో తొలిసారి ఇద్దరు పర్వతారోహకులు ఎక్కినట్టు రికార్డులు చెప్తున్నాయి.
కానీ.. అంతకుముందే మరో ఇద్దరు ఎవరెస్ట్‌ని ఎక్కారని కొందరు వాదిస్తున్నారు. ఎవరెస్ట్ అంటేనే ఒక మిస్టరీ. కానీ.. దాన్ని ముందుగా ఎక్కిందవరనేది కూడా మిస్టరీనే ఇప్పటికీ.
మేఘాలు ఎవరెస్ట్ పర్వతాన్ని కప్పినట్టే.. దాని అధిరోహణ చరిత్రను కూడా కప్పి ఉంచి అంతు చిక్కకుండా చేశాయి. అధికారిక లెక్కల ప్రకారం 1953 మే 29న న్యూజిలాండ్‌కు చెందిన సర్ ఎడ్మండ్ హిల్లరీ, నేపాల్‌కు చెందిన షెర్పా టెంజింగ్ నార్గే ఎవరెస్ట్ ఎక్కారు.
మానవులు సాధించిన విజయాల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా దీని గురించి చెప్తుంటారు. ఈ చారిత్రాత్మక ఆరోహణకు ముందు ఎవరెస్ట్ చివరి భాగాన్ని చేరుకోవడానికి అనేక మంది ప్రయత్నించారు. ముఖ్యంగా 1920ల ప్రారంభంలో ఎక్కువగా బ్రిటిషర్లు ట్రై చేశారు.
హిల్లరీ, టెంజింగ్ నార్గే కంటే మూడు దశాబ్దాల ముందే బ్రిటన్‌కి చెందిన జార్జ్ మల్లోరీ, ఆండ్రూ ఇర్విన్ ఎవరెస్ట్ ఎక్కినట్టు కొందరు వాదిస్తున్నారు. వీళ్లు 1924లో ఎవరెస్ట్ ఎక్కేందుకు వెళ్లారు. అదృశ్యం అయ్యారు.
ఎప్పుడు చనిపోయారు?
అత్యంత కఠినమైన వాతావరణం ఉండే ఉత్తర ధృవం, దక్షిణ ధృవాలకి 1920ల నాటికి మనుషులు వెళ్లారు. కానీ.. ప్రపంచ ‘‘మూడో ధృవం’’గా పేరున్న హిమాలయాల్లోని ఎవరెస్ట్‌ని మాత్రం ఎక్కలేకపోయారు.
అందుకే ఎలాగైనా ఎవరెస్ట్‌ని అధిరోహించాలనే ఉద్దేశంతో జార్జ్ మల్లోరీ, ఆండ్రూ ఇర్విన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ.. ఎవరెస్ట్ ఎక్కుతూ మధ్యలోనే చనిపోయారు. కానీ.. కొందరు మాత్రం ఎవరెస్ట్ ఎక్కి, దిగుతుంటే చనిపోయారని చెప్తున్నారు. ఇంతకీ వాళ్ల ప్రయాణం ఎలా సాగింది? అనేది తెలుసుకోవడానికి అంతగా ఆధారాలు లేకపోయినా దొరికిన కొన్ని ఆధారాలతో ఒక అంచనాకి వచ్చారు ఎక్స్పర్ట్స్.
ఈ ఇద్దరూ 1924లో ఆర్టిఫిషియల్ ఆక్సిజన్‌తో ఎవరెస్ట్ ఎక్కేందుకు బయల్దేరారు. వాళ్లలో మల్లోరీ అప్పటికే రెండుసార్లు ఎవరెస్ట్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. కానీ.. 24,600 అడుగుల ఎత్తు దాటి పైకి వెళ్లలేకపోయాడు.
పైగా అతను బ్రిటన్‌లోని బెస్ట్ క్లైంబర్స్(అధిరోహకుడు)లో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇక ఇర్విన్ విషయానికి వస్తే.. వయసు చాలా చిన్నది. 22 ఏండ్లు ఉంటాయి. పర్వతాలు ఎక్కడంలో అంతగా అనుభవం కూడా లేదు.
కానీ.. అతను ఆక్సిజన్ సిలిండర్స్ ఎక్స్పర్ట్. ఒక పర్వతారోహకుడి మీద ఆక్సిజన్ ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? ఆక్సిజన్ తగ్గిన తర్వాత ఏం చేయాలి? ఇలాంటివన్నీ ఇర్విన్‌కు బాగా తెలుసు. అప్పటివరకు అంత ఎత్తులో ఉన్నప్పుడు మానవ శరీరం ఎలా స్పందిస్తుంది? ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ అవసరం ఎంతవరకు ఉంటుందనే వివరాలు కచ్చితంగా ఎవరికీ తెలియవు. కాబట్టి.. ఒక్కడే ఎవరెస్ట్ ఎక్కడం అంత ఈజీ కాదని మల్లోరీకి అర్థమై వెంట ఇర్విన్‌ని తీసుకెళ్లాడు. అతను ఆక్సిజన్ సిలిండర్ల ఫిక్సింగ్, అసెంబ్లింగ్ చేయడంలో ఎక్స్పర్ట్.
చేరుకున్నారా?
ఎవరెస్ట్ ఎక్కిన మల్మోరీ, ఇర్విన్లు మళ్లీ తిరిగి రాలేదు. అయితే.. వాళ్లు ఎక్కుతుంటే చనిపోయారా? లేదంటే.. దిగుతుంటే చనిపోయారా? అనేది మాత్రం ఇప్పటికీ తెలియలేదు. ఈ సంఘటన జరిగిన చాలా ఏండ్లకు 1999లో క్లైంబర్ కాన్రాడ్ అంకెర్ దాదాపు 27,250 అడుగుల (8,229 మీ) ఎత్తులో మల్లోరీ శవాన్ని చూశాడు.
ఎవరెస్ట్ ఎత్తు 29,032 అడుగులు (8,849 మీ). అంటే ఇంకా మిగిలింది 2 వేల అడుగులే. ఇర్విన్ శవం ఇప్పటికీ దొరకలేదు. పైగా.. వాళ్లు తమ వెంట తీసుకెళ్లిన కెమెరా కూడా దొరకలేదు. ఆ కెమెరా దొరికితే కనుక వాళ్లు ఎవరెస్ట్ అగ్రస్థానానికి చేరుకున్నారో, లేదో తెలిసేది.
ఎలా చనిపోయారు?
మల్లోరీ యాత్ర మీద రీసెర్చ్ చేసిన జియాలజిస్ట్ ఒడెల్లె మాత్రం వాళ్లు ఎవరెస్ట్ చివరి భాగానికి చేరుకుని ఉంటారని అంచనా వేశాడు. అయితే.. వాళ్లు ఎవరెస్ట్ ప్రయాణం మొదలుపెట్టిన కొన్ని రోజులకే అక్కడి వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. దానివల్ల ఎవరెస్ట్ మీద మంచు తుపాన్లు వచ్చి ఉంటాయి. చాలా వేగంగా చల్లటి గాలులు వీయడంతో ఆ ఇద్దరూ చనిపోయారని ఒడెల్లె పుస్తకంలో రాశాడు.