Zainab Ali Naqvi: గుండెపోటుతో టెన్నిస్ ప్లేయర్ మృతి.. ఎవరీ జైనబ్ అలీ నఖ్వీ?

Zainab Ali Naqvi: గుండెపోటుతో టెన్నిస్ ప్లేయర్ మృతి.. ఎవరీ జైనబ్ అలీ నఖ్వీ?

పాక్ టెన్నిస్ సంచ‌ల‌నం జైన‌బ్ అలీ న‌ఖ్వీ గుండెపోటుతో మరణించింది. 23 ఏళ్ల న‌ఖ్వీ సోమ‌వారం(జనవరి 12) ఇస్లామాబాద్‌లోని త‌న ఇంటి బాత్రూంలో కుప్పకూలిపోయింది. జైన‌బ్ త్వరలో ప్రారంభంకానున్న ఐటీఎఫ్(ITF) టోర్న‌మెంట్ కోసం త‌మ‌ ఇంటి వ‌ద్దనే సిద్ధమ‌వుతోంది. ఈ క్రమంలో సోమ‌వారం ప్రాక్టీస్ అనంత‌రం స్నానం చేయ‌డానికి బాత్రూంకి వెళ్లగా ఛాతీలో నొప్పి రావడంతో అక్కడే పడిపోయింది. 

గమనించిన కుటుంబసభ్యులు వెంటనే బాత్రూం డోర్లు పగలకొట్టి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఉన్నత శిఖ‌రాలు అధిరోహించాల‌నుకున్న జైన‌బ్ జీవితం విషాదంగా ముగియడం టెన్నిస్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె మ‌ర‌ణ‌వార్త తెలిసి టెన్నిస్ క్రీడాకారులు సహా ఆ దేశ క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆరేళ్ల వ‌య‌సులోనే రాకెట్ బాట

జైన‌బ్‌కు తన తండ్రే.. స్ఫూర్తి. టెన్నిస్ ప్లేయ‌రైన తండ్రిని చూస్తూ పెరిగిన‌ ఆమె ఆరేళ్ల వ‌య‌సులోనే రాకెట్ ప‌ట్టింది. ప‌లు జాతీయ, అంత‌ర్జాతీయ టోర్నీలో పాల్గొన్న ఆమె.. ఏటీఎఫ్ అండ‌ర్ -14 సూప‌ర్ సిరీస్ టెన్నిస్ చాంపియ‌న్‌షిప్స్ ట్రోఫీ గెలిచింది. ఫైన‌ల్లో భార‌త క్రీడాకారిణి వ‌ర్షా దాస్‌ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. ఆ ప్రదర్శనతో ఆమె పేరు పాకిస్థాన్‌లో మార్మోగిపోయింది. మరుసటి రోజు పాక్ మీడియా పత్రికల్లో అన్నీ ఆమె కథనాలే. జైన‌బ్ కు హార్డ్ కోర్ట్‌లో ఆడ‌డమంటే ఎంతో ఇష్టం. ఆమె చదువులోనూ రాణించేది. ఆమె మృతికి సంతాపంగా త్వరలో ఇస్లామాబాద్‌ వేదికగా జరగనున్న ITF J30 టోర్నమెంట్‌కు జైన‌బ్ పేరు పెట్టాల‌ని పాకిస్తాన్ టెన్నిస్ ఫెడరేషన్ నిర్ణయించింది.