
- మ. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్–18, హాట్‌స్టార్‌లో లైవ్
లాహోర్: వరల్డ్ క్లాస్ ప్లేయర్లు, మేటి ఆటగాళ్లు ఉన్నా ఐసీసీ ఈవెంట్లలో తడబడుతున్న న్యూజిలాండ్, సౌతాఫ్రికా చాంపియన్స్ ట్రోఫీని ముద్దాడేందుకు ముందడుగు వేయాలని చూస్తున్నాయి. బుధవారం (మార్చి 5) జరిగే రెండో సెమీఫైనల్లో గెలిచి ఫైనల్లో ఇండియాను ఢీ కొట్టాలని భావిస్తున్నాయి. సఫారీ టీమ్, కివీస్ చాంపియన్స్ ట్రోఫీలో (1998, 2000) చెరోసారి విజేతగా నిలిచాయి.
కానీ, ఐసీసీ నాకౌట్ ట్రోఫీలుగా పిలిచిన ఆ రెండు ఎడిషన్లకు ఇప్పటి మాదిరిగా ప్రాముఖ్యత లేదు. పెద్ద టోర్నీల్లో తడబడే సఫారీలు గతేడాది టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయారు. మరోవైపు కివీస్ 2015, 2019 వన్డే వరల్డ్ కప్స్, 2021 టీ వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరినా ఆఖరి అంకాన్ని దాటలేకపోయింది. ఈసారి ఎలాగైనా ఐసీసీ ట్రోఫీని చేజిక్కించుకోవాలని రెండు జట్లూ ఆశిస్తున్నాయి. శాంట్నర్ కెప్టెన్సీలోని న్యూజిలాండ్ గ్రూప్–లో ఇండియా తర్వాత రెండో స్థానంలో నిలవగా.. గ్రూప్–బిలో సౌతాఫ్రికా టాప్ ప్లేస్ సాధించింది.
ఆటగాళ్లు, బలాబలాల్లో రెండు జట్ల మధ్య పెద్దగా అంతరం కనిపించడం లేదు. ఇరు జట్లలోనూ నాణ్యమైన బ్యాటర్లు, పవర్ హిట్లర్లు ఉన్నారు. కాకపోతే బౌలింగ్‌లో సఫారీ టీమ్ కాస్త ముందంజలో ఉంది. గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో ఇండియా చేతిలో ఓడినప్పటికీ గత నెల ఇదే పాకిస్తాన్‌లో జరిగిన ట్రై సిరీస్‌లో సౌతాఫ్రికాను ఓడించిన కివీస్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.
మరోవైపు సఫారీ టీమ్ గతంలో ఎన్నడూ లేనంతగా అన్ని విభాగాల్లో సమతూకమైన జట్టుతో మంచి ఫామ్‌లో ఉంది. మరి సెమీస్ పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.