- అభివృద్ధి గెలిపిస్తుందంటున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- అసంతృప్తులు, పార్టీలో గ్రూపులు మైనస్ అయ్యే అవకాశం
- ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్ హవా, చిన్నారెడ్డి మద్దతుతో విక్టరీ కొడతానంటున్న మేఘా రెడ్డి
- యువతపైనే బీజేపీ అభ్యర్థి అనుజ్ఞ రెడ్డి ఆశలు
వనపర్తి, వెలుగు : ఈ ఎన్నికల్లో వనపర్తిలో రసవత్తర పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పెద్దమందడి మాజీ ఎంపీపీ మేఘారెడ్డి, బీజేపీ తరఫున ఎన్ఆర్ఐ అనుజ్ఞరెడ్డి బరిలో నిలిచారు. పదేండ్ల పాలనలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి మరోసారి గెలిపించాలని నిరంజన్ రెడ్డి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అయితే, పార్టీలో గ్రూపులు, అసంతృప్తుల భయం ఆయనను వెంటాడుతోంది. మరోవైపు కాంగ్రెస్ హవా, ఆరు గ్యారంటీలతో పాటు మాజీ మంత్రి చిన్నారెడ్డి మద్దతుతో తాను విజయం సాధించడం ఖాయమని మేఘారెడ్డి ధీమాతో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఆఖరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరి టికెట్ సంపాదించిన మేఘారెడ్డికి...టికెట్ రాలేదని అసంతృప్తితో ఉన్న చిన్నారెడ్డి సహకరించకపోతే గెలుపు తీరం చేరడం కష్టమేనని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. యూత్ఫాలోయింగ్ఉన్న బీజేపీ క్యాండిడేట్అనుజ్ఞరెడ్డి మోదీ ఛరిష్మా గెలిపిస్తుందన్న నమ్మకంతో ముందుకెళ్తున్నారు.
సింగిరెడ్డికి సెకండ్ టైం కష్టమే..
సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా నిరంజన్ రెడ్డికి పేరు ఉంది. 2018లో తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టిన ఆయన వనపర్తికి మెడికల్, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ లతోపాటు పలు విద్యాసంస్థలను తీసుకువచ్చానని చెప్తున్నారు. 30 ఏండ్లుగా వివాదాస్పదంగా మారిన వనపర్తి రోడ్ల విస్తరణ పనులను రూ.100 కోట్ల నిధులతో పూర్తి చేయించానని అంటున్నారు. ప్రభుత్వ పథకాలు, సీఎం రిలీఫ్ ఫండ్ అత్యధికంగా మంజూరు చేయించానని, గ్రామాల్లో బీఆర్ఎస్కు ఎన్ని గ్రూపులున్నా తనను చూసి ఓటు వేయాలని కోరుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య ఉన్న గ్రూప్ తగాదాలను ఏమాత్రం పట్టించుకోలేదన్న పేరుంది. ఒకరిద్దరి మాటే నడవడంతో మంత్రి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని లీడర్లు అసంతృప్తితో ఉన్నారు. దీంతో కొందరు పార్టీకి దూరమయ్యారు. మంత్రితోపాటు ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకిష్టయ్య బిడ్డ వాసంతి అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డారు. మంత్రి వందల ఎకరాలు కొని ఫాం హౌస్ నిర్మించారని, భూకబ్జాలు చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఎమ్మెల్యే అయ్యేనా?
బీఆర్ఎస్ ను వీడి అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరిన క్లాస్ వన్ కాంట్రాక్టర్, పెద్దమందడి ఎంపీపీ మేఘా రెడ్డి నెల రోజుల్లోనే కాంగ్రెస్ టికెట్ సాధించారు. మొదట మాజీ మంత్రి చిన్నారెడ్డికి టికెట్ ఫైనల్ చేసిన హైకమాండ్..సర్వేల తర్వాత ఆయన స్థానంలో మేఘా రెడ్డికి టికెట్ కన్ఫమ్ చేసింది. అన్నివర్గాల ప్రజలతో సత్సంబంధాలు మెయింటెయిన్చేయడం మేఘారెడ్డికి కలిసి వచ్చే అంశం. టికెట్ప్రకటించినప్పటి నుంచి మంత్రి నిరంజన్‌రెడ్డిపై వాడి వేడి విమర్శలు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. అన్ని పనుల్లోనూ మంత్రి నిరంజన్‌రెడ్డి కమీషన్లు దండుకొని అవినీతికి పాల్పడ్డాడని, అక్రమ ఆస్తులు కూడబెట్టారని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ.. తనను గెలిపిస్తే పెద్ద జీతగాడిలా పనిచేస్తానని చెబుతున్నారు.
బీఆర్ఎస్ అసంతృప్తులను, మంత్రి నిరంజన్ రెడ్డి వ్యతిరేకులను సమీకరిస్తూ ప్రచారాన్ని ఉధృతం చేశారు. నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ కు మంచి పట్టు ఉంది. ఇంతకుముందు ఇక్కడి నుంచి పోటీ చేసిన చిన్నారెడ్డి గెలిచి మంత్రిగా కూడా పని చేశారు. టీడీపీ, టీఆర్ఎస్ గాలిలోనూ ఆయన విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో టికెట్దక్కించుకున్న మేఘారెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు ఇస్తే విజయం నల్లేరుపై నడకే అని చెప్తున్నారు. చిన్నారెడ్డి వర్గం కలిసి పని చేస్తుందా లేదని అన్న అనుమానాలున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేకపోవడం మేఘారెడ్డికి మైనస్‌గా మారొచ్చు.
క్యాడర్‌ను ఉత్సాహపరుస్తూ...
బీజేపీ తరఫున వనపర్తికి చెందిన ఎన్ఆర్ఐ అనుజ్ఞ రెడ్డి ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈయన గత రెండు, మూడేండ్లుగా ఎన్నికల్లో పోటీ చేయడం కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. దీంతో యువత ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఎప్పటికప్పుడు పార్టీకి నియోజకవర్గంలో పట్టున్న ప్రాంతాల్లో పర్యటిస్తూ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇది అనుజ్ఞరెడ్డికి కలిసి వచ్చే అంశం. మోదీ ఛరిష్మా, బీజేపీకి క్రెడిట్ తో పాటు పలు స్థానిక సమస్యలపై ప్రచారం చేస్తూ తనను గెలిపించాలని కోరుతున్నారు. వనపర్తిలో మాదిగ సామాజిక వర్గాల ఓట్లు 46 వేల వరకు ఉన్నాయని, వర్గీకరణకు మోదీ మద్దతుతో అవన్నీ తనకే వస్తాయనే ధీమాతో ఉన్నారు. 2018లో బీజేపీ తరఫున పోటీ చేసిన కొత్త అమరేందర్ రెడ్డికి కేవలం 3,168 ఓట్లు రాగా ఈసారి పరిస్థితి తారుమారు చేస్తానని, గెలిచి చూపిస్తానని అనుజ్ఞరెడ్డి కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. ఆయనకు రాజకీయంగా అనుభవం లేకపోవడం మైనస్‌గా మారనుంది. బీజేపీలో సీనియర్లు సపోర్ట్ చేస్తారా లేదా అన్నది కూడా సందేహమే.