కాంగ్రెస్ అధికారంలోకివస్తే ఆరు గ్యారంటీలు అమలు కావడం అటుంచితే, ఆరుగురు సీఎంలు కావడం మాత్రం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా చిట్యాలలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే కేసీఆర్ సీఎం అవుతారని, మరి కాంగ్రెస్ గెలిస్తే ఎవరు సీఎం అవుతారని కేటీఆర్ ప్రశ్నించారు.
‘‘కొత్త సీసాలో పాత సారానే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. 6 నెలలకో ముఖ్యమంత్రి మారే ప్రభుత్వం మనకు ఎందుకు? ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ లో వచ్చే ముఖ్యమంత్రులు మనకు ఎందుకు? అవుతల 11 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇవతల ఒక్క కేసీఆర్ ఉన్నాడు. కాంగ్రెస్ కు ఒక్క నల్గొండ జిల్లాలోనే నలుగురు సీఎం క్యాండిడేట్లు ఉన్నారు. ఒక్కాయనైతే పిల్లే లేదు కానీ పెళ్లి ముహూర్తం పెట్టుకున్నట్టు పార్టీలో సీఎం సీటు కోసం ముహూర్తం కూడా పెట్టుకున్నడు. జానారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయకుండానే తానే సీఎం అవుతానంటున్నాడు” అని విమర్శించారు.
కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలే..
పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కరెంట్ కష్టాలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు. 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలో.. 3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని చెప్పారు. ఉచిత కరెంట్ వద్దంటున్న కాంగ్రెస్ ను ఊరిపొలిమేర దాకా తరిమికొట్టాలన్నారు. ‘‘కాంగ్రెస్ నేతలకు కర్నాటక నుంచి డబ్బు సంచులు వస్తున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ డబ్బు మదంతో మాట్లాడుతున్నారు. వాళ్లకు ఓటమి తప్పదు” అని అన్నారు. బక్క పలుచని కేసీఆర్ ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ సన్నాసులు ఢిల్లీ, గుజరాత్, కర్నాటక నుంచి లీడర్లను దింపుతున్నారని మండిపడ్డారు.
‘‘వడ్ల దిగుబడిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. నల్గొండ జిల్లాలోనే వరి ఎక్కువ పండుతున్నది. నకిరేకల్ లో చిరుమర్తి లింగయ్య గెలిస్తే చిట్యాలలో పాలిటెక్నిక్ కళాశాల వస్తుంది. చిట్యాల ఫ్లైఓవర్, బ్రాహ్మణ వెల్లెంల, ఉదయ సముద్రం, పిల్లాయిపల్లి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం” అని హామీ ఇచ్చారు. కాగా, తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కోమటిరెడ్డి బ్రదర్స్ తనపై రాజకీయ కక్ష పెంచుకున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
చేనేత మిత్రను రూ.5 వేలకు పెంచుతం..
రాష్ట్రంలో అన్ని వర్గాలను, అన్ని రంగాలను ఆదుకున్న ప్రభుత్వం తమదేనని కేటీఆర్ అన్నారు. మంగళవారం నాగోల్ లోని దేవకీ కన్వెన్షన్ లో తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్, టెక్స్ టైల్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాకముందు కరెంట్, నీళ్ల సమస్యలు తీవ్రంగా ఉండేవని.. రాష్ట్రం వచ్చాక అవన్నీ పరిష్కరించామని కేటీఆర్ అన్నారు. పదేండ్ల కింద 10 గంటలు కరెంట్ పోయిన అడిగేవాడు లేడని, కానీ ఇప్పుడు 10 నిమిషాలు కరెంట్ పోతే ఇదేందని అడిగే పరిస్థితి వచ్చిందన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత మిత్ర స్కీమ్ కింద ఇస్తున్న రూ.3 వేలను రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. చేనేత రుణాలు కూడా మాఫీ చేస్తామని చెప్పారు.
నీలోఫర్‌కు కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మంగళవారం బంజారాహిల్స్‌లోని నీలోఫర్ కేఫ్‌కు వెళ్లారు. ఓ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు కేఫ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ చాయ్ తాగడానికి వచ్చిన జనంతో మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధి, బీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ ఎస్ పనితీరును ప్రజలు మెచ్చుకున్నారని, మంత్రిని వారందరూ కొనియాడారాని ఈ సందర్భంగా ఆయన కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.
నేడు వేములవాడకు..
పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ స్పీడ్ పెంచారు. బు ధవారం నుంచి 20వ తేదీ వరకు ప్రతి రోజూ సభలు, రోడ్ షోలలో ఆయన పాల్గొంటారని బీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించింది. బుధవారం ఉదయం కథలాపూర్, మేడిపల్లి, చందుర్తి, రుద్రాంగి సభల్లో పాల్గొంటారని, వేములవాడ టౌన్, వేములవాడ రూరల్, తంగళ్లపల్లి మండలాల్లో రోడు షో నిర్వహిస్తారని తెలిపింది. ఈ నెల 16న చేవెళ్ల, వికారాబాద్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఈ నెల 17న మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్, జూబ్లిహిల్స్, ఖైరతాబాద్ లో ప్రచారం చేపట్టనున్నట్లు తెలిపింది.