మునుగోడులో చిన్న పార్టీల పాత్ర ఎలా ఉండబోతోంది..?

మునుగోడు ఉప ఎన్నికలో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరాగా తలపడుతున్నాయి. తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తూ అమీతుమీ తేల్చుకునే రీతిలో పోటీ చేస్తుండడం ఉత్కంఠ రేపుతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరపున బరిలోకి దిగారు. తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతిని ఎన్నిక బరిలో నిలిపింది. టీఆర్ఎస్ పార్టీ.. జాతీయ పార్టీగా మారుతున్న కీలక తరుణంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి బీఫాం ఇచ్చి  ఉప ఎన్నిక బరిలోకి దింపింది.  

మూడు ప్రధాన పార్టీలు నువ్వానేనా అన్నట్టుగా బరిలో దిగుతున్నా...చిన్నపార్టీల రోల్ ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతుందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. చాలా ఎన్నికల్లో ఒకటి లేదా రెండు శాతం ఓట్లతో ప్రభుత్వాలే మారిపోయిన ఉదంతాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక రాబోయే సాధారణ ఎన్నికలకు రెఫరెండంలా మూడు ప్రధాన పార్టీలు పరిగణిస్తున్నట్లు ఢీకొంటున్నాయి. ఇంతటి ప్రతిస్టాత్మక ఉప ఎన్నికలో ఎవరికి మేలు జరగనుంది..? నియోజకవర్గంలో ఎక్కువ శాతం బీసీ, ఎస్సీ ఓటర్లే ఉండగా.. వాళ్ల ఓట్లను ఎవరు కొల్లగొట్టబోతున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అన్ని పార్టీలకు సవాల్ గా ఉప ఎన్నిక

మునుగోడు ఉప ఎన్నికను అన్ని పార్టీలు చాలెంజింగ్ గా తీసుకున్నాయి. ఎవరు గెలిచినా, ఓడినా రానున్నసాధారణ ఎన్నికల్లో ఆయా పార్టీలపై ఎఫెక్ట్ ఉండే అవకాశాలు కనిపిస్తుండడంతో సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కీలకమైన ఉప ఎన్నికకు నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో ఇప్పటికే నియోజకవర్గంలో మకాం వేసిన ప్రధాన పార్టీల ముఖ్యనేతలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి తమ ప్రచారంతో జోరు పెంచారు. 

సై అంటున్న చిన్న పార్టీలు

మునుగోడు ఉప ఎన్నికలో చిన్నపార్టీలు కూడా సై అంటున్నాయి. ఓవైపు అభ్యర్ధుల వేట సాగిస్తూనే ప్రచారానికి రెడీ అయ్యాయి. కొన్నిపార్టీలు ప్రధాన పార్టీలకు మద్దతు ఇస్తుండగా, టీడీపీ, జనసేన, వైస్సార్ టీపీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ పార్టీలకు కాస్తో కూస్తో ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ పోలింగ్ సమయంలోగా ఎవరికి మద్దతు ఇస్తారు..? వారి ఓట్లు ఏ పార్టీకి వెళ్తాయనే దానిపై నాయకులు లెక్కలు వేస్తూ విశ్లేషిస్తున్నారు.

బీఎస్పీ తరపున ఇప్పటికే ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారం చేస్తున్నారు. బీఎస్పీ తరపున బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆందోజ్ శంకరాచారికి బీఫాం ఇచ్చి బరిలోకి దింపారు. ప్రజాశాంతి పార్టీ తరపున ప్రజాగాయకుడు గద్దర్ ను పోటీలో పెట్టాలని కేపాల్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ప్రజాశాంతి పార్టీలో గద్దర్ చేరి, ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. బీసీ, ఎస్సీల ఓట్లు అధికంగా ఉన్నందున తమలాంటి పార్టీలకే మేలు జరుగుతుందని, అందుకే గద్దర్ రంగంలోకి దింపామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఆయన పార్టీ ఆఫీసు వద్దకు వచ్చి లోపలికి వెళ్లకుండానే వెనుదిరగి వెళ్లిపోవడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది.  

మునుగోడులో మొత్తం 2 లక్షల 20వేల ఓట్లు

మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2లక్షల 20వేల వరకు ఉండగా ఇప్పటి వరకు ఇక్కడ  లెఫ్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలిచాయి. ఇందులో టిఆర్ఎస్, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయగా, బీజేపి మాత్రం టిడిపితో పొత్తు పెట్టుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటిచేసి 12వేల ఓట్లు సాధించింది. తెలుగుదేశం పార్టీకి కొంత ఓటు బ్యాంకు ఉండగా వారి ఓట్లు ఎటువైపు మళ్లుతాయో అంచనా వేయలేని పరిస్థితి ఉంది.

ఈసారి బీజేపీ గుర్తుతో రాజగోపాల్ రెడ్డి ఒంటరిగానే బరిలోకి దిగుతుండటం, గతంలో కంటే బీజేపీకి సానుకూలత పెరగడం, వరుస ఉప ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయాలు, అధికార గులాబీ పార్టీ వైఫల్యాలు లాంటి కారణాలు బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది కాంగ్రెస్ సీటు కావడం బీజేపీకి పెద్ద సవాల్ గా మారిందని, బీజేపి గెలవడం ద్వారా రాష్ట్రంలో ఆ పార్టీకి మేలు జరిగే అవకాశముంటుందని చెబుతున్నారు. మరోవైపు ఈసారి కూడా టీఆర్ఎస్ ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. చిన్నపార్టీలకు కొంత ఓట్లు వచ్చినా అవి ఎటునుంచి చీలి ప్రధాన పార్టీలకు దెబ్బతీస్తాయో తేలాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు నగేష్ చెబుతున్నారు.

మునుగోడులో పోటీ చేసేవారిలో ప్రధాన పార్టీలు అగ్రవర్ణాలకే టిక్కెట్లు ఇచ్చినందున బీసీల సంగతి ఏంటనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ఉపఎన్నిక సమయంలో ఏ కులానికి ఇచ్చారనేది ప్రామాణికత ఉండదనే వాదన ఉన్నా.. కొంత ఆ కులాల ఓట్లు చీలే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. బీసీ ఓట్లే 70శాతానికి పైగా ఉండగా, ఎస్సీ, ఎస్టీలవి 20 శాతం వరకు ఉన్నాయి. ప్రధానంగా గౌడ, ముదిరాజ్, పద్మశాలీ, ఎస్సీ సామాజికవర్గాల వారు అధికంగా ఉన్నారు. ఈ సామాజికవర్గాలను ఎవరు ఆకట్టుకుంటే వారికి కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. బీసీలకు ఇస్తామన్నబీసీ బంధు, రుణాలు లాంటివి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంపై జనాలు వ్యతిరేకతతో ఉన్నారని బీసీ సంఘాలు చెబుతున్నాయి. 

మునుగోడులో పోటీచేసే ప్రధాన పార్టీ అభ్యర్దులు ఓసి క్యాటగిరివాళ్లే ఉండగా, చిన్నపార్టీల్లో బీసీ, ఎస్సీలకు చెందిన వారు పోటీ చేస్తున్నారు. అయితే మునుగోడు జనం ఎటువైపు మళ్లుతారనేది తేలాల్సి ఉంది. మరోవైపు చిన్నపార్టీలు ఇచ్చే మద్దుతు ప్రధాన పార్టీలకు ఏ రకంగా పనికొస్తుంది..? పోటీ చేస్తే వారి ఓట్లు చీలడం ద్వారా ఎవరికి మేలు జరుగుతుందనేది ఫలితాల తర్వాత తేలే అవకాశం ఉంది.