హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారుకు పరీక్ష

హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారుకు పరీక్ష

 

  • హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతం రావు
  • మజ్లిస్ కు సపోర్ట్ ఇవ్వనున్న కాంగ్రెస్!
  • మజ్లిస్ కు బీఆర్ఎస్ మద్దతిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం చేయనున్న బీజేపీ
  •  బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తే.. కాంగ్రెస్ నుంచి విమర్శలు 
  • ఓటు వేయకుండా ఉంటే రెండు  పార్టీల నుంచి దాడి

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ఇవాళ సాయంత్రంతో ముగియనుంది. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లున్న ఈ సెగ్మెంట్ లో మజ్లిస్ అత్యధిక ఓట్లు కలిగి ఉంది. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకొని ఎంఐఎంకు 49 మంది ఓటర్లున్నారు. బీజేపీకి 25, బీఆర్ఎస్ కు 24, కాంగ్రెస్ కు 14 మంది ఓటర్లున్నారు.
 

కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీల బలం కలిపితే 63గా ఉంటుంది. దీంతో ఈ ఎన్నికల్లో విజయం సునాయసమవుతుంది. నిన్నటి వరకు ఈ ఎన్నిక ఏకగ్రీవంగానే జరుగుతుందని అందరూ భావించారు. అయితే ఇవాళ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో పోటీ అనివార్యంగా మారింది. బీజేపీ అభ్యర్థిగా గౌతం రావును ప్రకటిస్తూ బీజేపీ జాతీయ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నామినేషన్ వేశారు

బీజేపీ నిర్ణయం బీఆర్ఎస్ ను ఇరుకున పడేసేలా మారింది. మజ్లిస్ అభ్యర్థికి మద్దతు ఇస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ ప్రచారం చేసే అవకాశం ఉంది. కావాలని రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయంటూ స్వరం పెంచే చాన్స్ ఉంది. ఒక వేళ బీజేపీకి మద్దతు ప్రకటిస్తే ఆ పార్టీ అభ్యర్థి గట్టెక్కక పోగా.. కాంగ్రెస్  నుంచి విమర్శల దాడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని తాము మొదటి నుంచి చెబుతున్నామని కాంగ్రెస్ స్వరం పెంచే అవకాశం ఉంది. ఓటు వేయకుండా ఊరుకుంటే రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ పై దాడి చేసే అవకాశం లేకపోలేదు. మజ్లిస్ ను గెలిపించేందుకు బీఆర్ఎస్ దూరంగా ఉందంటూ బీజేపీ  నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా పోటీ చేసే దమ్ములేక దూరంగా ఉందంటూ ఎదురు దాడికి దిగే చాన్స్ ఉంది. ఏది ఏమైనా హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి పరీక్షగా మారాయి.