- నెల కింద వడగళ్లతో దెబ్బతిన్న పంటలు
- రైతులు, కౌలు రైతుల మధ్య కుదరని సయోధ్య
- నివేదికల తయారీలో ఆఫీసర్లకు తప్పని ఇక్కట్లు
మహబూబాబాద్, వెలుగు: గత నెలలో అకాల వర్షాలతో నష్టపోయిన కౌలు రైతులకు పరిహారం అందిస్తామని సర్కారు భరోసా ఇచ్చింది. అయితే రైతులు, కౌలు రైతుల మధ్య సమోధ్య కుదరకపోవడంతో రిపోర్టు తయారీలో ఆఫీసర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కౌలు రైతులకు ఎప్పటికి పరిహారం అందుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. గత నెలలో రాష్ట్రంలో వడగళ్ల వానతో 2.28 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి.
ఉమ్మడి వరంగల్జిల్లా పరిధిలోని మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లో వరి, మొక్కజొన్న, మామిడి, మిర్చి, పుచ్చకాయ పంటలు దెబ్బతిన్నాయి. గత నెల 23న సీఎం కేసీఆర్, రాష్ట్ర స్థాయి ఆఫీసర్లు మహబూబాబాద్జిల్లా పెద్దవంగర, వరంగల్జిల్లా దుగ్గొండి మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల చొప్పున సాయం అందజేస్తామని కేసీఆర్ప్రకటించారు. పంటకు పెట్టుబడి పెట్టేది కౌలు రైతులే కాబట్టి వాళ్లకూ న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు.
పంట నష్టం అంచనా వేయాలని ఆఫీసర్లకు సూచించారు. అయితే ప్రొఫార్మాలో భూమి సాగు చేస్తున్న రైతు వివరాలు అనే చోట కౌలు రైతులు, పట్టాదారు ఎవరి వివరాలు సేకరించాలనే అంశంలో ఆఫీసర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల రైతులు, కౌలు రైతుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో నివేదికల తయారీలో జాప్యం జరుగుతోంది. ఆఫీసర్లు భూమి సాగు చేసే రైతు, భూమి సర్వే నంబర్, పంట సాగు వివరాలు, పంట నష్టం, బ్యాంక్ ఎకౌంట్, కులం, వయస్సు ఇలా మొత్తంగా 32 రకాల వివరాలు సేకరిస్తున్నారు, అగ్రికల్చర్, హార్టికల్చర్ఆఫీసర్లే తుది నివేదికలు తయారు చేస్తున్నారు.
ఒక్కరి పేరే పెట్టాలనడంతో..
అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు వన్ టైం సెటిల్మెంట్ క్రాప్రిలీఫ్ ఫండ్ అందించడం కోసం ఒక సర్వే నంబర్ లో భూ యజమాని పేరు లేదా ఆ పంటను సాగు చేస్తున్న కౌలు రైతులు వివరాలు మాత్రమే పొందుపరచాల్సి ఉంది. వారిద్దరి అంగీకారంతో ఒక్కరి పేరు మాత్రమే ప్రపోజ్ చేసి ఆఫీసర్లు నివేదిక రూపొందించాలి. కొన్నిచోట్ల అంగీకారం కుదురుతుండగా మరికొన్నిచోట్ల మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.
కౌలు రైతులు, భూ యజమానులు తమ వివరాలు పంపాలంటే తమవి పంపాలంటూ పోటీ పడుతుండడంతో వారిమధ్య విభేదాలు పెరిగిపోతున్నాయి. ఉన్నతాధికారుల నుంచి త్వరగా నివేదిక ఇవ్వాలని ఆర్డర్స్ రావడంతో ఆఫీసర్లు ఏం చేయాలో తోచక సతమతమవుతున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో రెండుసార్లు పర్యటించిన ఆఫీసర్లు మరోసారి పర్యటిస్తూ ఫోటో స్కాన్ వివరాలు అప్లోడ్చేస్తున్నారు.
కౌలు రైతులకూ పరిహారమివ్వాలి
రెండు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని ఎకరంలో మిర్చి, ఎకరంలో మొక్కజొన్న పంట వేశా. వడగండ్ల వానతో పంట పూర్తిగా నేలమట్టమైంది. పెట్టుబడి, చేసిన కష్టం మొత్తం పోయింది. భూ యజమానికి కౌలు ఎలా కట్టాలో తెలియడం లేదు. ప్రభుత్వం కౌలు రైతులను పరిగణలోకి తీసుకుని పంట నష్టం నేరుగా కౌలు రైతుల బ్యాంక్అకౌంట్లోనే జమ చేయాలి. - గుగులోతు రవి, జమా తండా, నెల్లికుదురు మండలం
అంగీకారంతోనే తుది నివేదిక
భూయజమానులు, కౌలు రైతుల అంగీకారంతోనే తుది నివేదికలు రూపొందిస్తున్నాం. ఒక సర్వే నంబర్ లో పంట నష్టానికి సంబంధించి ఒక్కరి వివరాలు మాత్రమే పంపిస్తాం. క్షేత్రస్థాయిలో కొన్నిచోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారికి సర్దిచెప్పి గ్రామ పెద్దల సాయంతో తుది నివేదిక రూపొందించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 3 వరకు తుది నివేదికలు రూపొందిస్తాం. ఎక్కడైనా అభ్యంతరాలు ఉంటే ఆఫీసర్లకు తెలపవచ్చు. రైతులు, కౌలు రైతులు ఒక అంగీకారంతో ముందుకు సాగాలి. - సూర్యనారాయణ, జిల్లా హార్టికల్చర్ఆఫీసర్, మహబూబాబాద్