- ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారానికి దిగిన మంత్రి
- కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరు బరిలో దిగుతారో నో క్లారిటీ
- కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకే పొంగులేటి ఆసక్తి
- సత్తుపల్లిలో సండ్రకు, వైరాలో మదన్‌లాల్‌కు బీఆర్ఎస్ టికెట్లు ఓకే!
ఖమ్మం, వెలుగు : ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి అయిన పువ్వాడ అజయ్‌కుమార్ వచ్చే ఎన్నికల్లో హాట్రిక్కొట్టాలని తహతహలాడుతున్నారు. ఈసారి కూడా బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగేది తానేనని ఇప్పటికే ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల కోసం హైదరాబాద్‌వెళ్లి ఆయన ఇటీవల ఖమ్మం సిటీకి చేరుకోగానే ఎన్నికల ప్రచారానికి నాంది పలుకుతున్నట్లు తెలిపారు. అయితే అధికార పార్టీ అభ్యర్థిపై కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, ఇప్పుడు ఆ పార్టీలో లేరు. దీంతో మంత్రికి దీటైన ప్రత్యర్థి, అంగబలం, ఆర్థిక బలం ఉన్న లీడర్ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం బరిలో ఉంటారని ప్రచారం జరిగినా, ఆయన కొత్తగూడెం సెగ్మెంట్ పైనే ఫోకస్‌పెట్టినట్టు తెలుస్తోంది. ఖమ్మం సీటు నుంచి పోటీ చేసేందుకు పొంగులేటి ఆసక్తిగా లేరనే టాక్జిల్లాలో నడుస్తోంది.
బచ్చాను పెట్టి ఓడిస్తానంటున్న పొంగులేటి
తెలంగాణ ఏర్పాటయ్యాక జరిగిన 2014 ఎన్నికల్లో ఖమ్మం సెగ్మెంట్కాంగ్రెస్ తరఫున పువ్వాడ అజయ్ పోటీ చేసి గెలిచారు. ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి అయిన తుమ్మల నాగేశ్వరరావును ఓడించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన గుండాల కృష్ణ(ఆర్జేసీ కృష్ణ) నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఆ తర్వాత అజయ్, తుమ్మల నాగేశ్వరరావు వేర్వేరుగా బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పువ్వాడ అజయ్, కాంగ్రెస్ తో జతకట్టిన టీడీపీ నుంచి నామ నాగేశ్వరరావు పోటీ చేయగా రెండోసారి అజయ్గెలిచారు.
తర్వాత కొద్దిరోజులకే నామ నాగేశ్వరరావు కూడా బీఆర్ఎస్ లో చేరారు. 2019లో ఖమ్మం ఎంపీగా కారు గుర్తుపై గెలిచారు. అప్పటి నుంచి ఖమ్మంలో పువ్వాడ అజయ్ ను ఢీకొట్టే నాయకుడు లేకుండా పోయారని కాంగ్రెస్ కార్యకర్తలే చెబుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలోని మూడు జనరల్ సెగ్మెంట్లలో పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ పోటీ చేస్తానని చెప్పారు. ఒక సందర్భంలో ఖమ్మంలో బచ్చాను నిలబెట్టి అజయ్‌ను ఓడిస్తానని స్టేట్మెంట్ఇచ్చారు.
చీఫ్ గ్రీన్ సిగ్నల్
ఖమ్మంతోపాటు మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులకు టికెట్లు కన్ఫామ్చేసినట్లు తెలుస్తోంది. వర్గపోరు లేని, సర్వేల రిపోర్టులు సానుకూలంగా ఉన్నచోట్ల ఆ పార్టీ చీఫ్కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ఇచ్చినట్టు సమాచారం. మూడ్రోజుల కింద మంత్రి అజయ్ ఎన్నికల ప్రచారానికి నాంది పలికానంటూ చేసిన కామెంట్లు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ‘‘గతంలో బీఫామ్ తీసుకొని వచ్చినప్పుడు ఖమ్మం కాల్వొడ్డు దగ్గరనే నన్ను రిసీవ్ చేసుకున్నారు.
ఇప్పుడు అంతకంటే పెద్ద విషయాలతో ముఖ్యమంత్రి కేసీఆర్నన్ను ఇక్కడికి పంపించారు. మంత్రిగా ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తిరిగి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఖమ్మంలో నా గెలుపు బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలి” అని అజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
గతంలో కేవలం ఒక్క సీటే
గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు గుర్తుపై కేవలం ఒక్కరు మాత్రమే గెలిచారు. తర్వాత కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల చేరికలతో పార్టీ బలపడింది. ఖమ్మంలో అజయ్ తో పాటు సత్తుపల్లి సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కేసీఆర్ లైన్ క్లియర్చేసినట్టు సమాచారం. బీఆర్ఎస్ తరఫున తాను పోటీ చేయడం కన్ఫామ్అని, కాంగ్రెస్‌నుంచి ఎవరు పోటీ చేస్తారో తేల్చుకోవాలని ఇప్పటికే సండ్ర సవాల్‌విసిరారు. అలాగే వైరా సీటు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కు ఓకే చేసినట్టుగా సమాచారం. వైరా సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్‌పై వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో తేలిందని తెలుస్తోంది.
ఆయన కొడుకు, రాష్ట్ర ఇన్‌కమ్‌ట్యాక్స్ కమిషనర్ లావుడ్యా జీవన్ లాల్ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగే ఆలోచనలో ఉండడంతో పార్టీ హైకమాండ్ ప్రత్యామ్నాయాలను ప్లాన్ చేసినట్టు సమాచారం. జీవన్‌లాల్‌కు మహబూబాబాబ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించేందుకు కొంత సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన స్థానాల్లో ఇద్దరి కంటే ఎక్కువ ఆశావహులు ఉన్నారు. వర్గ పోరుతో ఆయా చోట్ల అభ్యర్థులపై సస్పెన్స్కొనసాగుతోంది. పాలేరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కందాల ఉపేందర్‌రెడ్డి ఉండగా, ఎన్నికల బరిలో తానే ఉంటానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదేపదే ప్రకటిస్తుండడం ఆసక్తి రేపుతోంది.