- రెండున్నరేండ్లుగా ఏర్పాటు కాని కొత్త కమిటీ
- యాసంగి అదును దాటుతున్నా అందని సాగునీరు
- ప్రాజెక్టు కింద బీళ్లుగా మారుతున్న పొలాలు
- ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు
మహబూబ్‌నగర్/చిన్నచింతకుంట, వెలుగు : జిల్లాలోని కురుమూర్తి రాయ లిఫ్ట్ఇరిగేషన్ స్కీంను నడిపించే వారు కరువయ్యారు. ప్రభుత్వం నీటి తీరువా కమిటీని వేయకపోవడంతో ఈ స్కీం మెయిన్టెనెన్స్బాధ్యత ఎవరూ తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే యాసంగి మొదలు కాగా, రైతులు వరి తుకాలు పోసుకుంటున్నారు. కానీ,ఈ స్కీం కింద ఈ సీజన్లో పొలాలకు సాగునీరు విడిచేది డౌటే అని తెలుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అదును దాటుతున్నా తుకాలు పోసుకునేందుకు సాగునీరు లేక కొందరు రైతులు పొలాలను బీళ్లుగా పెట్టుకుంటున్నారు.మహబూబ్‌నగర్ జిల్లా ఉమ్మడి చిన్నచింతకుంట మండలం కొత్తపల్లి వద్ద 1999లో అప్పటి ప్రభుత్వం ‘కురుమూర్తి రాయ’ లిఫ్ట్ఇరిగేషన్ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. నాబార్డ్ ద్వారా రూ.11 కోట్లు కేటాయించి, 2001లో స్కీంను అందుబాటులోకి తెచ్చింది. రామన్‌పాడు బ్యాక్‌వాటర్‌ను స్కీం ద్వారా లిఫ్ట్‌చేసి కొత్తపల్లి, దుప్పల్లి, అమ్మాపూర్, కురుమూర్తి గ్రామాల పరిధిలోని నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించేది. 2002 వరకు స్కీంను ఏపీఎస్ఐడీసీ ఆధ్వర్యంలో నడిపించగా, ఆ తర్వాత నీటి తీరువా కమిటీని ఏర్పాటు చేసి స్కీం బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ప్రతి రెండున్నర ఏండ్లకోసారి కొత్త కమిటీని వేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు కమిటీలు వేశారు. చివరి సారిగా 2018లో కమిటీ వేయగా, ఈ కమిటీ పరిమితి 2020 లో ముగిసింది. ఆ తర్వాత కొత్త కమిటీని వేయాల్సి ఉన్నా, ఎవరూ ముందుకు రాకపోవడంతో పాతవారే స్కీంను మెయిన్టెయిన్చేస్తూ వచ్చారు. ప్రస్తుతం వారు కూడా తప్పుకున్నారు. స్కీంను రన్చేసేందుకు సంబంధిత ఆఫీసర్లు, ప్రభుత్వం ఇంత వరకు ముందుకు రాకపోవడంతో స్కీం ద్వారా యాసంగి పంటలకు సాగునీరు అందడం కష్టంగా మారింది. ఇప్పటికే స్కీం ఆఫీస్‌కు తాళాలు వేశారు.
డెవలప్ చేయకుండా పన్ను పెంచిండ్రు
2013 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఈ స్కీం కింద ఎకరాకు రూ.1,000 చొప్పున ఏడాదికి నీటి తీరువా పన్నును రైతుల నుంచి కమిటీ సభ్యులు వసూలు చేసేవారు. 2014 లో తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ పన్నును రూ.1,500 కు పెంచారు. ఈ లెక్కన ఏడాదికి రూ.60 లక్షల వరకు వసూలు చేయాల్సి ఉంది. అయితే స్కీం డెవలప్మెంట్పనులు ఏవీ లేకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. 4 వేల ఎకరాలకు నీరు అందాల్సి ఉండగా, ప్రస్తుతం 1500 ఎకరాలకు కూడా అందడం లేదు. దీంతో రైతులు పన్ను చెల్లించడం లేదు. ప్రస్తుతం ఏడాదికి రూ.25 లక్షల వరకు మాత్రమే పన్ను పైసలు వసూలు అవుతున్నాయి.
పూడుకపోయిన కాల్వలు
ఈ ప్రాజెక్టులోని కాలువలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. మెయిన్ కెనాల్స్ నుంచి ఉన్న పిల్ల కాలువలు పూడిపోయాయి. పిచ్చి మొక్కలు, బురదతో నిండిపోయాయి. నీరు తమ పొలాలకు రావడం లేదని చాలా చోట్ల రైతులు తూములను ధ్వంసం చేశారు. షటర్లు కూడా లేవు. అమ్మాపూర్ శివారు వద్ద కురుమూర్తి ప్రాంతానికి చెందిన రైతులు కాల్వలను ధ్వంసం చేశారు. పొలాల మధ్యలో కాల్వ ఉండటం, ఏండ్లుగా నీళ్లు రాకపోవడంతో కొన్ని చోట్ల కాల్వను పూడ్చేశారు.
యాసంగి సాగు డౌటే?
ఈ స్కీం కింద అత్యధికంగా రైతులు వరి సాగు చేస్తారు. ప్రస్తుతం యాసంగి అదును దాటుతోంది. ఇప్పటికే కాల్వలు, చెరువులు, పలు స్కీం కింద జిల్లాలోని రైతులు వరి తుకాలు పోసుకున్నారు. అయితే ఇక్కడ వరి తుకాలు పోసేందుకు రైతులు వెనకడుగు వేస్తున్నారు. పొలాలు దున్నితే సాగునీరు ఇచ్చేది అనుమానమే ఉండడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రస్తుతం స్కీం కింద ఉన్న ఆయకట్టులో బోర్ల సౌలత్ ఉన్న రైతులు వరికి సిద్ధం కాగా, మిగతా వారు బీళ్లుగా వదిలేశారు.
బోరు లేదు.. స్కీం నీళ్లే దిక్కు
నాకు ఈ స్కీం కింద 3 ఎకరాల పొలం ఉంది. రెండు సీజన్లలో వరే వేస్తా. స్కీం నుంచి కాల్వల ద్వారా నీళ్లు వస్తేనే నా పొలానికి నీరు అందుతుంది. బోరు కూడా లేదు. ప్రస్తుతం యాసంగి పంటలకు ఈ స్కీం నుంచి నీళ్లు విడిసేది లేనిది ఇంత వరకు ఏం చెప్తలేరు. కమిటీ వాళ్లను అడిగితే మాకు తెల్వదంటున్నరు.
- పోతురాజు రాములు, రైతు, అమ్మాపూర్
బీడుగా పెట్టుకున్నా..
నాకు 5 ఎకరాల భూమి ఉంది. ఎప్పుడైనా వరే వేస్తా. స్కీం కింద నీళ్లు ఇడిస్తేనే నా పొలానికి సాగునీరు అందుతుంది. కాల్వ నీళ్లు రాకపోవడం వల్ల పొలాన్ని బీడుగా పెట్టిన. మాకు వ్యవసాయమే ఆధారం. పొలం బీడుగా ఉంటే ఆర్థికంగా దెబ్బతిని, వలస కూలీలుగా మారాల్సిందే. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి.
- పొనగంటి రాజు, రైతు, కురుమూర్తి