- పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, మల్లు నందిని మధ్య తీవ్ర పోటీ
- రాజ్యసభ సీటు కేటాయింపుతో తప్పుకున్న రేణుకా చౌదరి
- ఈ సీటు పరిధిలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒకరు సీపీఐ
ఖమ్మం, వెలుగు : కాంగ్రెస్సీనియర్నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరికి రాజ్యసభ సీటు కేటాయించడంతో, ఖమ్మం లోక్‌సభ టికెట్రేసు నుంచి ఆమె తప్పుకున్నారు. దీంతో టికెట్ఆశావహులకు కొంత లైన్క్లియర్అయింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి మధ్యనే తీవ్ర పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్అధినేత్రి సోనియా గాంధీని ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ చేయాలని పార్టీ రాష్ట్ర నేతలు ఆహ్వానించినప్పటికీ, ఆమెను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపిస్తున్నట్లు ఏఐసీసీ బుధవారం ప్రకటించింది. ప్రస్తుతం సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలి నుంచి వచ్చే ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని తెలుస్తోంది. దీంతో ఏఐసీసీ అగ్ర నేతలు ఖమ్మం నుంచి బరిలో దిగే అవకాశం లేనట్లు స్పష్టమవుతోంది. టికెట్ ఆశిస్తున్న వారిలో ఎవరో ఒకరికి పోటీ చేసే అవకాశం దక్కనుంది.
12 మంది దరఖాస్తులు
ఖమ్మం లోక్ సభ సీటు నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటూ 12 మంది కాంగ్రెస్ లీడర్లు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో రేణుకాచౌదరి కూడా ఉన్నారు. తాజాగా ఆమె తప్పుకోవడంతో ప్రధానంగా ప్రసాద్‌రెడ్డి, మల్లు నందిని, వీవీసీ రాజేంద్రప్రసాద్, వీహెచ్, మద్ది శ్రీనివాస్‌రెడ్డి తదితరులు టికెట్రేసులో ఉన్నారు. ఖమ్మం టికెట్‌విషయంలో ప్రస్తుతం సామాజిక వర్గాల వారీగా చర్చ జరుగుతోంది. నాలుగుసార్లకు పైగా ఖమ్మం నుంచి పోటీ చేసిన రేణుకాచౌదరిది కమ్మ సామాజికవర్గం. ఏఐసీసీ ఆమెకు రాజ్యసభ అవకాశం కల్పించింది. దీంతో అదే సామాజికవర్గానికి చెందిన వారికి ఖమ్మం లోక్‌సభ టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదని తెలుస్తోంది. సామాజిక సమీకరణ అంశం వీవీసీ మోటార్స్అధినేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ కు మైనస్ గా మారే అవకాశముంది. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగంధర్ కూడా ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు కూడా ఈసారి అవకాశం లేదని సమాచారం. మరో సీనియర్‌నేత వీహెచ్ బీసీ కోటాలో ఖమ్మం సీటు ఆశిస్తున్నా.. దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, మల్లు నందిని మధ్య మాత్రమే పోటీ ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
బీఫాం తెచ్చుకుంటే గెలిచినట్లే
ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రస్తుతం కాంగ్రెస్ కు తిరుగులేదు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్, మరో చోట కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ అభ్యర్థులకు 2.63 లక్షల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. ఈ నంబర్ల ప్రకారం కాంగ్రెస్బీఫామ్ దక్కించుకుంటే ఎంపీగా గెలిచినట్టేనన్న ధీమా నేతల్లో కనిపిస్తోంది. అందుకే ఈ సీటు కోసం నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ఎన్నికల ఇన్చార్జిగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సపోర్ట్ ఉన్న వాళ్లకే టికెట్ దక్కే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.