
ముంబై: ఇటీవల మహా కుంభమేళా జరిగిన గంగా నది పరిశుభ్రతపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే హాట్ కామెంట్స్ చేశారు. గంగా నది కలుషితమైందని.. ఆ నదిలో తాను పవిత్ర స్నానం చేయనని అన్నారు. కుంభమేళాలో స్నానం చేస్తే చేసిన పాపలు పోతాయని మూడ నమ్మకాల నుంచి బయటకు రావాలని ప్రజలకు సూచించారు. మార్చి 9న తన పార్టీ 19వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్ థాక్రే మాట్లాడుతూ.. తమ పార్టీ సీనియర్ నాయకుడు బాలా నందగావ్కర్ కుంభమేళా నుంచి నా కోసం పవిత్ర జలమని నీళ్లు తెచ్చారు. కానీ ఆ నీటిని తాగడానికి నేను తిరస్కరించానని తెలిపారు.
కలుషితమైన ఆ గంగా నది నీటిని ఎవరు తాగారు..? వాటితో ఎవరూ స్నానం చేస్తారు..? అని ప్రశ్నించి.. ఆ నీళ్లు తనకు వద్దని చెప్పి పంపించానని అన్నారు. కుంభమేళాలో కోట్ల మంది భక్తులు తమ శరీరాలను రుద్దుకుంటూ గంగా నదిలో స్నానం చేశారు.. అలాంటి నీటిని ఎలా తాగుతారని.. విశ్వాసానికి కూడా కొంత అర్థం ఉండాలన్నారు. దేశంలోని ఒక్క నది కూడా శుభ్రంగా లేదు. కానీ మనం ఆ నదులను తల్లి అని పిలుస్తాము. అదే విదేశాలలో చూసినట్లైతే నదిని తల్లి అని పిలవరు. కానీ అక్కడ నదులు శుభ్రంగా ఉంటాయని అన్నారు.
ALSO READ | Viral Video: నడి రోడ్డుపై యువతి బైక్ పై స్టంట్స్.. పైగా ఇద్దరి మగాళ్ల మధ్యలో.. ఏంట్రా ఇది..!
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కాలం నుంచి గంగా నదిని శుద్ధి చేస్తారని తాను వింటున్నాను.. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు అది జరగలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు ఇకనైనా ఈ విశ్వాసం, మూఢనమ్మకాల నుండి బయటకు రావాలని హితవు పలికారు. ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళా నీరు పవిత్ర స్నానాలకు పనికి రాదని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రయాగ్‌రాజ్‌లోని గంగానదిలో 'మల కోలిఫాం' బ్యాక్టీరియా స్థాయిలు గణనీయంగా ఉన్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు రిపోర్ట్ ఇవ్వడం ప్రతిపక్షాల బలానికి మరింత చేకూర్చినట్లైంది. ఈ క్రమంలో ప్రతిపక్షాల విమర్శలకు యూపీ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది.