రాజస్థాన్​లో హస్తమా? కమలమా?

రాజస్థాన్​లో హస్తమా?  కమలమా?

రాజ వంశాల రాష్ట్రం రాజస్థాన్ చరిత్రను పరిశీలిస్తే రాజులు, రాజ్యాలకు అది ప్రసిద్ధి చెందింది. స్వాతంత్ర్యానికి ముందు రాజస్థాన్ రాజుల  పాలనలో ఉండేది. వారు బ్రిటిష్ వారితో విదేశీ వ్యవహారాలు, రక్షణ నిర్వహణపై అవగాహన ఒప్పందం చేసుకున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశంలో సుమారు 565 రాచరికపు పాలనలోని రాజ్యాలు ఉన్నాయి.

అదేవిధంగా రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లోనూ 19 రాచరికపు పాలిత రాజ్యాలు ఉండేవి.ఆనాటి పాలకులు రాచరికపు రాజులే అయినా వారిని ప్రజలు ఎంతో ప్రేమించేవారు. స్వాతంత్ర్యం అనంతరం ఈ సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనమైనప్పటికీ రాచరికపు రాజులు, రాకుమారులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి నాయకులుగా  ఎన్నికయ్యారు. 


రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 1993 నుంచి రాజస్థాన్​లో ఏ అధికార ప్రభుత్వం కూడా నిరాటంకంగా వరుసగా రెండవసారి విజయం సాధించలేదు. రాజస్థాన్‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీలో 200 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ 100 మంది ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోగా బీజేపీ 73  అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందింది. రాజస్థాన్​లో కాంగ్రెస్ పరిస్థితిని ఒకసారి గమనిస్తే..కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నాయకుడు, ఆ రాష్ట్ర సీఎం అశోక్  గెహ్లాట్ మూడుసార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

కానీ, ప్రతిసారి అశోక్​ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా తన పదవీకాలం తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. సీనియర్​ రాజకీయ నాయకుడైన గెహ్లాట్ గత కొన్ని దశాబ్దాలుగా రాజస్థాన్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అయితే ఆయన అధికారం చేపట్టి పదవీకాలం ముగిసిన తరువాత కాంగ్రెస్​ పార్టీ పదే పదే ఓటమిపాలైంది. ఇది ఆయన పాలన పేలవంగా ఉన్నదని నిరూపిస్తోంది.

గుజ్జర్ల నేత సచిన్​ పైలట్​...

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలోనూ పైలట్ ను  పక్కన పెట్టేందుకు సీఎం గెహ్లాట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా, సచిన్ పైలట్ తూర్పు రాజస్థాన్​లో ముఖ్యమైన గుజ్జర్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయకుడు. 2018లో పైలట్ ముఖ్యమంత్రి అవుతారని భావించిన గుజ్జర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు.

ఈసారి గుజ్జర్లకు పైలట్ ముఖ్యమంత్రి  రేసులో లేరని తెలియడంతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీకి ఓటు వేయకపోవచ్చు. 2020 జులైలో సచిన్​ పైలట్ తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేల బృందాన్ని తీసుకొని గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. గెహ్లాట్​సర్కారును పడగొట్టే ప్రయత్నం చేసి ఢిల్లీలో పైలట్​క్యాంప్ పెట్టినా ఆయన ఆశించినది జరగలేదు. పైలట్ వ్యూహం బెడిసికొట్టింది. అనంతరం గెహ్లాట్, పైలట్​ మధ్య అనుమానాస్పద రాజీ కుదిరింది.

కాంగ్రెస్​కు విజయ​రాజే షాక్​

దశాబ్దాలుగా బలమైన నాయకుడిగా భైరాన్​సింగ్ షెకావత్​ బీజేపీలో ఆధిపత్యం చెలాయించారు. షెకావత్ రాజకీయ చతురత ఉన్న వ్యక్తి. అయినా చాలా స్నేహశీలి. ఆయన తన శత్రువులపై విజయం సాధించారు. బైరాన్​సింగ్​షెకావత్ తర్వాత విజయ రాజే సింధియా ముఖ్యమంత్రి అయ్యారు. షెకావత్​ ఆధిపత్యానికి గండికొట్టి ఆమె పైచేయి సాధించి ప్రతీకారం తీర్చుకుంది. గత ఐదేండ్లుగా బీజేపీ విజయ రాజే సింధియాను పక్కనపెట్టింది. దీంతో బీజేపీ విజయాన్ని ఆమె అడ్డుకుంటుందని వదంతులు  వ్యాప్తించాయి. కానీ, అకస్మాత్తుగా ఐదేండ్ల తరువాత విజయ​రాజే సింధియాకు ఎమ్మెల్యే సీటు లభించింది.

ఇక ఆమె బీజేపీకి పూర్తిస్థాయిలో తన సహకారాన్ని అందించనుంది. ఈ కీలక పరిణామంతో కాంగ్రెస్ ​పార్టీ షాక్​కు గురైంది. విజయ రాజే సింధియా స్నేహపూరకంగా మారడంతో బీజేపీలో ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యాయి. విజయ​రాజే సింధియాపై పోరాటం చేయడం కంటే సఖ్యతకే బీజేపీ హైకమాండ్​ప్రాధాన్యత ఇచ్చింది. 2018లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఓటు వేసిన జాట్‌‌‌‌‌‌‌‌లు, గుజ్జర్లు, మీనాలు ఇతర వర్గాల ఓటర్ల మనసును గెలవడానికి బీజేపీ హైకమాండ్ ​ప్రయత్నాలు చేస్తోంది. రాజస్థాన్ రాజకీయాలలో ఉన్న కుల ప్రాబల్య అంశంలో బీజేపీ కొంత సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లోని ఇతర పార్టీల హవా, లీడర్లను పరిశీలిస్తే.. హనుమాన్ బేనివాల్ ఒక ప్రముఖ జాట్ నాయకుడు. ఆయనకు  రాష్ర్టీయ లోక్​తాంత్రిక్ పేరుతో సొంత​పార్టీ ఉంది.   ప్రస్తుతం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌పై  హనుమాన్​ బేనివాల్​కోపంగా ఉన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు జాట్‌‌‌‌‌‌‌‌లు ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయవచ్చు. అయితే, బేనీవాల్‌‌‌‌‌‌‌‌ పార్టీ తప్ప ఇతర ప్రాంతీయ పార్టీలు పెద్దగా ప్రభావం చూపకపోయినా కొందరు స్వతంత్రులు కూడా గెలిచే అవకాశం ఉంది.

డైలమాలో గాంధీలు

రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లో గాంధీలు కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు. అశోక్ గెహ్లాట్ తమపై తిరుగుబాటు చేసి బతికి బట్టకట్టడం వల్ల ఆయన పెద్ద రాజకీయ శక్తి అని వారు గ్రహించారు. అయితే ఎన్నికల తర్వాత గెహ్లాట్‌‌‌‌‌‌‌‌ను సమర్థంగా ఎదుర్కోగలమని గాంధీలు భావిస్తున్నారు. రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ గెలిస్తే గాంధీలు తనను వ్యతిరేకించవచ్చని గెహ్లాట్‌‌‌‌‌‌‌‌కు కూడా బాగా తెలుసు. ప్రస్తుతం రాజస్థాన్ లో షాడో ఫైటింగ్ జరుగుతోంది.  గెహ్లాట్‌‌‌‌‌‌‌‌కు అత్యంత సన్నిహితులైన ముగ్గురు మంత్రులకు కాంగ్రెస్​పార్టీ టికెట్లు రాకుండా గాంధీలు ఆపేశారు.

కాగా, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లో మాజీ రాజుల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. వారు తమ గత ప్రభావాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు.  రాజులు తమ హయాంలో పూర్తి అధికారాలతో ప్రజలను పాలించినప్పటికీ, ప్రస్తుత  రాజకీయాల్లో వారు కూడా గొప్ప రాజకీయ నాయకులుగా మారారు. రాజులు వినయంగా వ్యవహరించారు. నీటిపారుదల, విద్య , ఆరోగ్య సౌకర్యాలను అభివృద్ధి చేశారు. బ్రిటిష్ వారి ప్రాంతాల కంటే ఎంతో మెరుగ్గా అభివృద్ధి చేశారు. రాజస్థాన్ రాజకీయాల్లో రాజుల ప్రభావం చాలా కీలక అంశంగా మారింది. ప్రస్తుతం రాజస్థాన్​లో​ పోరు సమంగా ఉంది. కానీ, ఆ రాష్ట్రం క్రమం తప్పకుండా  ప్రభుత్వ మార్పునకు మద్దతు ఇస్తున్నది.  జాట్‌‌‌‌‌‌‌‌లు, గుజ్జర్లు, మీనాలు వంటి చిన్న కులాలు  ఈసారి కూడా  ‘మార్పు’ ఫార్ములాను అనుసరిస్తారో, లేదో  వేచిచూడాలి.

ALS0 READ: దిగజారుతున్న అభ్యసనా ప్రమాణాలు : ఎన్సీఈఆర్టీ

గాంధీలపై గెహ్లాట్ తిరుగుబాటు

 గాంధీ కుటుంబంపై  2022 సెప్టెంబరులో జరిగిన అతిపెద్ద తిరుగుబాటుకు అశోక్ గెహ్లాట్ స్వయంగా నాయకత్వం వహించారు. అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని,  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవిని చేపట్టాలని హైకమాండ్​ నుంచి గెహ్లాట్​కు ఆదేశాలు అందాయి. అయితే ఆశ్చర్యకరంగా అశోక్ గెహ్లాట్ సీఎం పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించారు.  తను ముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో  గెహ్లాట్‌‌‌‌‌‌‌‌కు గాంధీలు గుణపాఠం చెప్పాలని భావించినా.. వారు కేంద్రంలో అధికారంలో లేకపోవడంతో మరో మార్గం లేక ఆయననే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగించారు.

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ సానుకూలాంశాలను పరిశీలిస్తే..సెప్టెంబరు 2022 నుంచి అశోక్ గెహ్లాట్ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఉచితాలు ఉత్తమ మార్గం అని భావిస్తున్నారు. భారీ మీడియా ప్రచారంతో అనేక ఉచితాలు, నగదు బదిలీలను ప్రకటించారు. గెహ్లాట్ ఇప్పుడు కూడా అదే బాటలో ఉన్నారు. ఐదేండ్లుగా రాజస్థాన్​లో గెహ్లాట్ పేలవమైన పాలన ఉన్నప్పటికీ ఉచితాలు ఆ రాష్ట్రంలో గెలుపునకు ఉపయోగపడతాయని కాంగ్రెస్ హైకమాండ్​ భావిస్తోంది.

గెహ్లాట్ వర్సెస్ పైలట్ 

రాజస్థాన్​లో 2018 డిసెంబర్​లో  అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ భారీ విజయం సాధించిన ఆ సమయంలో సచిన్ పైలట్ రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అవుతారని రాజకీయ వర్గాలతోపాటు హస్తం పార్టీ సీనియర్​ నేతలు కూడా భావించారు. కానీ, కాంగ్రెస్ హైకమాండ్ యువ నాయకుడు సచిన్ పైలట్ కరిష్మాను చూసి భయపడింది. ఫలితంగా అశోక్​ గెహ్లాట్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.  సచిన్​ పైలట్ ను సీఎం​ రేసు నుంచి కాంగ్రెస్​అధిష్టానం తప్పించింది. ఇది అశోక్​ గెహ్లాట్​, సచిన్​పైలట్​ మధ్య నిరంతర పోరాటానికి దారి తీసింది. గెహ్లాట్, పైలట్​ మధ్య నెలకొన్న  వైరం నేటికీ కొనసాగుతోంది. 

- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్